కర్ణాటకలో వాస్తు సిద్ధాంతి చంద్రశేఖర్ గురూజీ దారుణ హత్య
కర్ణాటకలో ప్రముఖ వాస్తు సిద్ధాంతి చంద్రశేఖర్ గురూజీ దారుణ హత్యకు గురయ్యారు. ‘సరళ్ వాస్తు’ గురూజీగా పేరున్న ఆయనను పట్టపగలు మంగళవారం దుండగులు కత్తితో పొడిచి చంపారు. హుబ్బళి లోని హోటల్ లో ఉన్న ఆయన వద్దకు సంప్రదింపులకోసమంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చి కత్తితో ఆయనపై దాడి చేశారు. సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆ సమయంలో అక్కడే చాలామంది ఉన్నప్పటికీ ఎవరూ ఆ వ్యక్తులను అడ్డుకోలేకపోయారు. ఈ ఘటనలో గురూజీ […]
కర్ణాటకలో ప్రముఖ వాస్తు సిద్ధాంతి చంద్రశేఖర్ గురూజీ దారుణ హత్యకు గురయ్యారు. ‘సరళ్ వాస్తు’ గురూజీగా పేరున్న ఆయనను పట్టపగలు మంగళవారం దుండగులు కత్తితో పొడిచి చంపారు. హుబ్బళి లోని హోటల్ లో ఉన్న ఆయన వద్దకు సంప్రదింపులకోసమంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చి కత్తితో ఆయనపై దాడి చేశారు. సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆ సమయంలో అక్కడే చాలామంది ఉన్నప్పటికీ ఎవరూ ఆ వ్యక్తులను అడ్డుకోలేకపోయారు. ఈ ఘటనలో గురూజీ అక్కడికక్కడే మరణించారు. పోస్ట్ మార్టం కోసం ఆయన మృతదేహాన్ని హుబ్బళిలోని ఓ ఆసుపత్రికి తరలించారు.
బాగల్ కోట్ కి చెందిన చంద్రశేఖర్ గురూజీ సివిల్ ఇంజనీర్ అయినప్పటికీ వాస్తు శాస్త్రాన్ని చదివారు. ‘సరళ్ వాస్తు’ గురుజీగా ఆయన కర్ణాటకలోని పలు న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ ఛానల్స్ లో పాపులర్ అయ్యారు. గృహ, ఆఫీసు వాస్తు సూచనలు చేసే ఈయనను అనేకమంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఇతర వర్గాలు కన్సల్ట్ చేసేవారని తెలుస్తోంది. ఈయన హత్య సమాచారం తెలియగానే హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర ..హుబ్బళి కమిషనర్ నుంచి పూర్తి నివేదిక కోరారు. పోలీస్ కమిషనర్ లభు రామ్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు మధ్యాహ్నం హత్య జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. దర్యాప్తు ప్రారంభమైంది. గురూజీని హతమార్చిన వ్యక్తులు ఆయన శిష్యులే అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
వ్యక్తిగత పనుల నిమిత్తం చంద్రశేఖర్ గురూజీ కొన్ని రోజుల క్రితమే హుబ్బళికి వచ్చినట్టు తెలిసింది. ఆయన జూలై 3న వచ్చారని హోటల్ సిబ్బంది తెలిపారు. మొదట కాంట్రాక్టర్ గా జీవితం ఆరంభించిన ఆయన ముంబైలో ఉద్యోగం సంపాదించి అక్కడే సెటిలయ్యారని, ఆ తరువాత వాస్తు శాస్త్రంలోకి దిగారని వెల్లడైంది. కాగా ఆయన వద్ద పని చేస్తున్న వ్యక్తుల్లో కొందరికి కొన్ని నెలలుగా ఆయన జీతాలు ఇవ్వడం లేదని సమాచారం.
కాగా.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గురూజీ వచ్చే సమయానికి ఇద్దరు వ్యక్తులు వేచి చూశారని, ఆయన వచ్చి సోఫాలో కూర్చోగానే వీరిలో ఒకడు వంగి ఆయన పాదాలకు నమస్కరిస్తుండగా మరొకడు పదునైన ఆయుధం (కత్తి) తీసి ఆయన కడుపులో, ఇతర శరీర భాగాల్లో పొడిచాడని తెలిసింది. ఈ ఘటనలో ఆయన పడిపోగానే ఇద్దరూ దగ్గరలోనివారిని కత్తితో బెదిరిస్తూ పారిపోయారని అంటున్నారు. వీరికోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు,