Telugu Global
National

అస్సోంలో వరదలు సృష్టించిన ఇద్దరు అరెస్టు

వరదలంటే ప్రకృతి విపత్తు కదా..! దాన్ని మనుషులు సృష్టించడం ఏంటి అనే కదా.. మీ అనుమానం. కానీ, ఈ వార్త చదివితే మనుషులే అస్సోం వరదలకు ఎలా కారణమయ్యారో తెలుస్తుంది. ఈశాన్య రాష్ట్రమైన అస్సోంలో ఇటీవల వర్షాల కారణంగా భారీ వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సిల్‌చార్ పట్టణాన్ని వరద ముంచెత్తడంతో దాదాపు లక్ష మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే ఇది ప్రకృతి విపత్తుతో సంభవించిన వరదలు కావని, మనుషులు సృష్టించినదేనని అస్సోం […]

అస్సోంలో వరదలు సృష్టించిన ఇద్దరు అరెస్టు
X

వరదలంటే ప్రకృతి విపత్తు కదా..! దాన్ని మనుషులు సృష్టించడం ఏంటి అనే కదా.. మీ అనుమానం. కానీ, ఈ వార్త చదివితే మనుషులే అస్సోం వరదలకు ఎలా కారణమయ్యారో తెలుస్తుంది. ఈశాన్య రాష్ట్రమైన అస్సోంలో ఇటీవల వర్షాల కారణంగా భారీ వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సిల్‌చార్ పట్టణాన్ని వరద ముంచెత్తడంతో దాదాపు లక్ష మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే ఇది ప్రకృతి విపత్తుతో సంభవించిన వరదలు కావని, మనుషులు సృష్టించినదేనని అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.

సిల్‌చార్ పట్టణాన్ని ఆనుకొని బారక్ నది ప్రవహిస్తోంది. వర్షాకాలంలో వరద నీళ్లు పట్టణంలోకి రాకుండా నది ఒడ్డున కరకట్ట నిర్మించారు. అయితే ఇటీవల గుర్తు తెలియని కొందరు వ్యక్తులు నీళ్లు నదిలోకి పోవడానికి బేతుకండి వద్ద కరకట్టను ధ్వంసం చేశారు. ఇది సిల్‌చార్ పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. భారీ వర్షాలకు బారక్ నది ఉప్పొంగింది. తెంచిన కట్ట నుంచి వరద నీరు పట్టణంలోకి ప్రవేశించింది. నది నీరంతా పట్టణంలోకి రావడంతో లక్ష మంది ఇబ్బంది పడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

కరకట్టను తెంచిన వారిలో ఇద్దరిని పోలీసులు గుర్తించారు. మిథు హుస్సేన్ లష్కర్, కాబుల్ ఖాన్ అనే వ్యక్తులు ఈ వరదలకు కారణమని తెలిసి పోలీసులు వారిని అరెస్టు చేశారు. కరకట్ట తెంచే సమయంలో కాబుల్ ఖాన్ మొబైల్‌లో ఒక వీడియో కూడా తీశాడు. ఇటీవల సీఎం హిమంత సిల్‌చార్‌లో పర్యటించినప్పుడు ఆ వీడియోను చూపించి.. నిందితులను గుర్తించమని కూడా ప్రజలను కోరారు.

బేతుకండి వద్ద కరకట్టను ధ్వంసం చేసిన వారిపై గౌహతీలో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి, వీడియో ఆధారంగా దర్యాప్తు జరిపారు. ప్రజల సహకారం కూడా లభించడంతో నిందితులు ఇద్దరిని పట్టుకున్నారు. ఇకపై కరకట్ట వద్ద భారీగా పోలీసు రక్షణ ఏర్పాటు చేస్తామని, భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని సీఎం శర్మ స్పష్టం చేశారు. వీరిద్దరితో పాటు కట్టను ధ్వంసం చేసిన మిగిలిన వారిని కూడా అరెస్టు చేసి.. కఠినంగా శిక్షిస్తామని ఆయన చెప్పారు.

First Published:  5 July 2022 7:24 AM IST
Next Story