Telugu Global
NEWS

వైసీపీ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు.. అక్కడే సీఎం తాత్కాలిక క్యాంప్ ఆఫీస్

ఏపీలో అధికార వైసీపీ పార్టీ జూలై 8,9 తేదీల్లో పార్టీ ప్లీనరీని నిర్వహించనున్నది. పార్టీ ఆవిర్భావం తర్వాత ప్లీనరీ నిర్వహించడం ఇది మూడో సారి మాత్రమే. 2011లో ఇడుపులపాయలో, 2017లో గుంటూరులో ప్లీనరీలు నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న తొలి ప్లీనరీ కావడంతోభారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ప్లీనరీ ప్రారంభం కానున్నది. మరో రెండేళ్లలోపు ఎన్నికలు కూడా ఉండటంతో కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం తీసుకొని రావడానికి ఈ ప్లీనరీ ఉపయోగపడుతుందని […]

YSRCP Plenary
X

ఏపీలో అధికార వైసీపీ పార్టీ జూలై 8,9 తేదీల్లో పార్టీ ప్లీనరీని నిర్వహించనున్నది. పార్టీ ఆవిర్భావం తర్వాత ప్లీనరీ నిర్వహించడం ఇది మూడో సారి మాత్రమే. 2011లో ఇడుపులపాయలో, 2017లో గుంటూరులో ప్లీనరీలు నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న తొలి ప్లీనరీ కావడంతోభారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ప్లీనరీ ప్రారంభం కానున్నది. మరో రెండేళ్లలోపు ఎన్నికలు కూడా ఉండటంతో కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం తీసుకొని రావడానికి ఈ ప్లీనరీ ఉపయోగపడుతుందని అధిష్టానం భావిస్తోంది. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఏ మేరకు హామీలు నెరవేర్చారో.. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని ఎలా మరింత అభివృద్ధి చేస్తారో ఈ ప్లీనరీ ద్వారా ప్రజలకు తెలిపేందుకు పార్టీ సిద్దమవుతోంది.

విజయవాడ-గుంటూరు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ప్లీనరీ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతీ జిల్లా నుంచి కార్యకర్తలు తరలిరానుండటంతో వారి కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. వానాకాలం కావడంతో వర్షాలు పడి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 100 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో జర్మన్ హ్యాంగర్ ఉపయోగించి ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది వాటర్ ప్రూఫ్ కావడంతో వర్షం పడినా పెద్దగా ఇబ్బంది ఉండదు. రెండు రోజుల ప్లీనరీకి దాదాపు 6 లక్షల మంది వచ్చే అవకాశం ఉండటంతో ఏర్పాట్లు కూడా అలాగే జరుగుతున్నాయి.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైసీపీకి భారీ మెజార్టీ అందించారు. లోక్‌సభలో కూడా బలమైన పార్టీగా మారిపోయింది. దీని వెనుక కార్యకర్తల కృషే ప్రధాన కారణం అని వైఎస్ జగన్ నమ్ముతున్నారు. రాబోయే రెండేళ్లు మరింత ఉత్సాహంగా పని చేసి, ప్రజలకు చేరువకావాలంటే కార్యకర్తలే ముఖ్యం. అందుకే వారి కోసం ప్లీనరీలో శుభవార్త చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. పార్టీ తరపున ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారో కూడా ప్లీనరీలో ప్రకటించనున్నారు.

ప్లీనరీకి హాజరు కానున్న నాయకులు, కార్యకర్తలకు ఇవ్వడానికి ఆహ్వాన పత్రికలు కూడా ముద్రించారు. దీనిపై వైఎస్ జగన్ సంతకం ఉంటుందని, ప్రతీ ఒక్కరికీ ఈ ఆహ్వానపత్రిక అందుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లీనిక్స్, రైతు భరోసా కేంద్రాల వివరాలను ఆహ్వాన పత్రికపై ముద్రించారు.

పార్టీ ప్లీనరీ సందర్భంగా అధినేత వైఎస్ జగన్ రెండు రోజులు అక్కడే బిజీగా గడపనున్నారు. అదే సమయంలో రాష్ట్ర పాలనా వ్యవహారాలకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ప్లీనరీ ప్రాంగణం వెనుక తాత్కలికంగా సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. శాఖల వారీగా సమీక్షలు చేయడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

First Published:  5 July 2022 12:03 AM GMT
Next Story