Telugu Global
NEWS

ఏకైక టెస్టులో పట్టుబిగించిన భారత్

ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న ఏకైక టెస్టు అనేక మలుపులు తిరుగుతూ రసవత్తరంగా మారింది. తొలి రోజు కేవలం 100 పరుగుల లోపే 5 వికెట్లు కోల్పోయి భారత జట్టు కష్టాల్లో పడింది. కానీ, ఆ తర్వాత పంత్, జడేజాలు సెంచరీల మోత మోగించడంతో 400పైగా పరుగులు చేసింది. ఇక ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 284 పరుగులు చేసి ఆలౌట్ అవ్వ‌డంతో భారత జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 132 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. మూడో […]

ఏకైక టెస్టులో పట్టుబిగించిన భారత్
X

ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న ఏకైక టెస్టు అనేక మలుపులు తిరుగుతూ రసవత్తరంగా మారింది. తొలి రోజు కేవలం 100 పరుగుల లోపే 5 వికెట్లు కోల్పోయి భారత జట్టు కష్టాల్లో పడింది. కానీ, ఆ తర్వాత పంత్, జడేజాలు సెంచరీల మోత మోగించడంతో 400పైగా పరుగులు చేసింది. ఇక ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 284 పరుగులు చేసి ఆలౌట్ అవ్వ‌డంతో భారత జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 132 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. మొత్తానికి 257 పరుగుల ఆధిక్యంతో పటిష్టస్థితిలో కనపడుతుంది.

మూడో రోజు 84/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టును సూపర్ ఫామ్‌లో ఉన్న బెయిర్‌స్టో ఆదుకున్నాడు. ఒకవైపు బెయిర్‌స్టో క్రీజులో పాతుకొని పోయి భారత జట్టు బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో టీమ్ ఇండియా బౌలర్స్ మరో ఎండ్ నుంచి వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెంచారు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడిన బెయిర్‌స్టో.. ఆ తర్వాత తన సహజశైలిలో దూకుడు పెంచాడు. చకచకా బౌండరీలు బాదుతూ స్కోర్ వేగం పెంచాడు. క్రీజులో నిలదొక్కుకున్నట్లు కనిపించినా కెప్టెన్ బెన్‌స్టోక్స్‌ (25) శార్థుల్ ఠాకూర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన శామ్ బిల్లింగ్స్ నిలకడగా ఆడాడు. మరో ఎండ్‌లో దూకుడుగా ఆడుతున్న బెయిర్‌స్టోకు చక్కని సహకారం అందించాడు. లంచ్ విరామం అనంతరం సెంచరీ పూర్తి చేసుకున్న బెయిర్‌స్టో.. ఆ తర్వాత దూకుడు కొనసాగించాడు. కానీ మహ్మద్ షమీ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి బెయిర్‌స్టో (106) పెవీలియన్ చేరడంతో భారత జట్టు ఊపిరి పీల్చుకుంది. బిల్లింగ్స్ (36), పాట్స్ (19) కాస్త నిలకడగా ఆడారు. అయితే మహ్మద్ సిరాజ్ చివర్లో చెలరేగి మూడు వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ జట్టు 284 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌ను పేలవంగా ప్రారంభించింది. ఓపెనర్ గిల్ (4) మరోసారి నిరాశపరిచాడు. సీనియర్ బౌలర్ అండర్సన్‌ చేతికే మరోసారి చిక్కాడు. ఆ తర్వాత పుజారా, విహారి కలిసి వికెట్ కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. విహారి చాలా నెమ్మదిగా ఆడాడు. వీరిద్దరూ వికెట్ కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. అయితే స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో హనుమ విహారి (11) వెనుదిరిగాడు. మరోఎండ్‌లో మాత్రం చతేశ్వర్ పుజారా వికెట్ కాపాడుకుంటూ పాతుకొని పోయాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ బౌండరీలు బాదుతూ మంచి టచ్‌లో కనిపించాడు. అయితే స్టోక్స్ అతడిని ఒక అద్భుతమైన బంతికి అవుట్ చేశాడు. డిఫెన్స్ ఆడబోయిన కోహ్లీ (20) స్లిప్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత చతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడారు. వీరిద్దరూ కలసి నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. ఈ క్రమంలో పుజారా కూడా అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తానికి భారత జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. భారత జట్టు ప్రస్తుతం 257 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

సోమవారం ఆట చాలా కీలకం. భారత జట్టు ప్రస్తుతం ఉన్న ఆధిక్యాన్ని మరింతగా పెంచుకోవల్సి ఉన్నది. 400పైగా ఆధిక్యం సాధించి.. చివరి రోజు ఇంగ్లాండ్‌కు బ్యాటింగ్ ఇస్తే గెలుపునకు అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికైనే ఈ మ్యాచ్‌లో భారత జట్టు పట్టుభిగించినట్లే. అయితే ఈ రోజు ఎంత ఎక్కువ సేపు భారత జట్టు బ్యాటింగ్ చేస్తే.. విజయావకాశాలు అంతగా మెరుగు పడతాయి.

ఇండియా తొలి ఇన్నింగ్స్ : 416
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 284
ఇండియా రెండో ఇన్నింగ్స్ : 125/3
మొత్తం ఆధిక్యం : 257

First Published:  4 July 2022 2:28 AM IST
Next Story