వారం క్రితంఉద్దవ్ కు మద్దతుగా కన్నీరు … నేడు బలపరీక్షలో షిండే కు మద్దతు…
రాజకీయాలు ఎలా చేయాలో, రాజకీయ నాయకులంటే ఎలా ఉంటారో ఆచరణలో చూపెట్టాడు మహా రాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యే. జూన్ 24న, శివసేన అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు గౌహతిలో మకాంపెట్టిన విషయం తెలిసిందే . ఆ సమయంలో సంతోష్ బంగర్ అనే శివసేన ఎమ్మెల్యే తన నియోజక వర్గంలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అది వీడియో తీసి ట్విట్టర్ లో కూడా పెట్టారు. అందులో ఆయన ఏడుస్తూ […]
రాజకీయాలు ఎలా చేయాలో, రాజకీయ నాయకులంటే ఎలా ఉంటారో ఆచరణలో చూపెట్టాడు మహా రాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యే.
జూన్ 24న, శివసేన అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు గౌహతిలో మకాంపెట్టిన విషయం తెలిసిందే . ఆ సమయంలో సంతోష్ బంగర్ అనే శివసేన ఎమ్మెల్యే తన నియోజక వర్గంలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అది వీడియో తీసి ట్విట్టర్ లో కూడా పెట్టారు. అందులో ఆయన ఏడుస్తూ ఉద్దవ్ ఠాక్రేకు ద్రోహం చేయొద్దని రెబల్ ఎమ్మెల్యేలను కోరాడు. వెంటనే అందరూ తిరిగి ఉద్దవ్ దగ్గరికి రావాలని ముకుళిత హస్తాలతో ఏడుస్తూ చెప్పారు. ఆ వీడియోలో ఎమ్మెల్యే అనుచరుడు ఒకరు ఆయన కన్నీళ్ళను తుడవడం కూడా కనపడింది.
అంతే కాదు ” ఉద్ధవ్ ఠాక్రే, ఆప్ ఆగే బడో, హమ్ తుమ్హారే సాథ్ హై (ఉద్ధవ్ ఠాక్రే, మీరు ముందు నడవండి మేము మీతో ఉన్నాము)” అని ఎమ్మెల్యే సంతోష్ బంగర్ నినాదాలు చేయగా ప్రజలంతా చప్పట్లు కొట్టడం ఆ వీడియోలో కనిపించింది.
కాగా ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా చివరకు ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రెబల్ ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది. ఇక ఈ రోజు అసెంబ్లీలో బల పరీక్షలో కూడా షిండే విజయం సాధించారు.
అయితే ఉద్దవ్ ఠాక్రే కోసం బహిరంగంగా ఏడ్చిన ఎమ్మెల్యే సంతోష్ బంగర్ రంగు మార్చేశాడు, మాట మార్చేశాడు. ఉద్దవ్ ఠాక్రేకు హ్యాండ్ ఇచ్చేసి షిండే కు జై కొట్టాడు. ” ఉద్ధవ్ ఠాక్రే, మీరు ముందు నడవండి మేము మీతో ఉన్నాము” అని నినదించిన ఆ ఎమ్మెల్యే ఎక్ నాథ్ షిండే వెనక చేరిపోయాడు. అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో షిండేకు అనుకూలంగా ఓటేశాడు. చివరకు రాజకీయ నాయకులంటే ఎలా ఉంటారో ప్రజలకు, ఎలా ఉండాలో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారికి చూపించి జన్మ ధన్యం చేసుకున్నాడు.