ప్రత్యేక హోదా ఇవ్వండి.. ప్రధాని మోడీకి సీఎం జగన్ వినతిపత్రం
ఏపీలో అల్లూరి విగ్రహావిష్కరణకు వచ్చిన మోడీకి సీఎం జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు. భీమవరంలో విగ్రహావిష్కరణ పూర్తయిన తర్వాత ఢిల్లీకి వెళ్లడానికి గన్నవరం ఎయిర్‌పోర్టుకు మోడీ వచ్చారు. అక్కడే ఆయనకు వీడ్కోలు పలికిన వైఎస్ జగన్.. పలు విజ్ఞప్తులతో కూడిన వినతిపత్రాన్ని ఇచ్చారు. ఏపీకి హక్కుగా రావల్సిన నిధులు, గ్రాంట్లతో పాటు విభజన హామీలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను కూడా జగన్ అందులో ప్రస్తావించారు. తెలంగాణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల నుంచి […]
ఏపీలో అల్లూరి విగ్రహావిష్కరణకు వచ్చిన మోడీకి సీఎం జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు. భీమవరంలో విగ్రహావిష్కరణ పూర్తయిన తర్వాత ఢిల్లీకి వెళ్లడానికి గన్నవరం ఎయిర్‌పోర్టుకు మోడీ వచ్చారు.
అక్కడే ఆయనకు వీడ్కోలు పలికిన వైఎస్ జగన్.. పలు విజ్ఞప్తులతో కూడిన వినతిపత్రాన్ని ఇచ్చారు. ఏపీకి హక్కుగా రావల్సిన నిధులు, గ్రాంట్లతో పాటు విభజన హామీలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను కూడా జగన్ అందులో ప్రస్తావించారు.
తెలంగాణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల నుంచి ఏపీ జెన్కోకు రావల్సిన రూ. 6,627.28 కోట్లను ఇప్పించాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాల మేరకు రూ. 55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. రీసోర్స్ గ్యాప్ గ్రాంట్ కింద ఇవ్వాల్సిన రూ. 34,125.5 కోట్లను విడుదల చేయాలని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు.
జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఏపీకి ఇస్తున్న రేషన్ విషయంలో హేతుబద్దత లేదని.. దీని వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతోందని జగన్ తెలిపారు. వెంటనే రేషన్ విషయంలో దానిని సవరించి రాష్ట్రానికి మేలు చేయాలని ఆయన కోరారు. దీనికి సంబంధించిన చర్యలు త్వరలో తీసుకుంటే పేదలకు మరింత సమర్థవంతంగా రేషన్ అందించే వీలుంటుందని చెప్పారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలకు తగిన ఆర్థిక సాయం చేయాలని, భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించిన అనుమతులను వెంటనే మంజూరు చేయాలని ఆ లేఖలో కోరారు. ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని సీఎం జగన్ ఆ లేఖలో ప్రస్తావించారు.