‘అహ్మదాబాద్ పేరును అదానీబాద్ గా మార్చండి’.. బీజేపీ నేతకు కేటీఆర్ సవాల్
తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్ గా మారుస్తామంటూ బీజేపీ నేత, జార్ఖండ్ మాజీ సీఎం రఘువర్ దాస్ చేసిన కామెంట్ పై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. మొదటి మీరు అహ్మదాబాద్ పేరును ‘అదానీబాద్’ గా ఎందుకు మార్చరని ఆయన ప్రశ్నించారు. అసలింతకీ ఈ ‘జుమ్లా జీవి’ ఎవరని కూడా ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుల సమావేశాలకు, ప్రధాని మోడీ సభకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన రఘువర్ దాస్.. […]
తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్ గా మారుస్తామంటూ బీజేపీ నేత, జార్ఖండ్ మాజీ సీఎం రఘువర్ దాస్ చేసిన కామెంట్ పై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. మొదటి మీరు అహ్మదాబాద్ పేరును ‘అదానీబాద్’ గా ఎందుకు మార్చరని ఆయన ప్రశ్నించారు. అసలింతకీ ఈ ‘జుమ్లా జీవి’ ఎవరని కూడా ఆయన ట్వీట్ చేశారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుల సమావేశాలకు, ప్రధాని మోడీ సభకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన రఘువర్ దాస్.. మరే టాపిక్కూ లేనట్టు ఈ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ నగరం పేరును భాగ్యనగర్ గా మారుస్తుందన్నారు. ఇక్కడ టీఆరెఎస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వంలో కుటుంబ పాలన నడుస్తోందని, వీరికి తెలంగాణ ప్రజల సంక్షేమం గురించి పట్టదని కూడా పనిలో పనిగా వ్యాఖ్యానించారు.
తన సహచర బీజేపీ నేతలంతా ఈ ధోరణిలో మాట్లాడుతుంటే రఘువర్ దాస్ కూడా అదే పంథాలో పోయారు. ఏదో ఒకటి అనాలి కదా మరి ? ఇక్కడ రెండు రోజులుగా తానుంటున్నానని, వ్యాపారవేత్తలు గానీ, సాధారణ ప్రజలు గానీ టీఆరెఎస్ ప్రభుత్వం పట్ల ఆగ్రహంతో ఉన్నారని ఆయన చెప్పారు. ఈ ప్రభుత్వం తమ కుటుంబం గురించే ఆలోచిస్తుందని, తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోదు గనుకే వారు బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారని ఆయన చెప్పారు.
కుటుంబ పాలనకు అంతం చెప్పేందుకే ప్రధాని మోడీ ఇక్కడికి వచ్చి బహిరంగ సభలో పాల్గొన్నట్టు రఘువర్ దాస్ పేర్కొన్నారు. అంతకు ముందు ఈయన చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు.
ఇక ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గురించి ఆయన ప్రస్తావిస్తూ.. జార్ఖండ్ ప్రజలు, ముస్లింలు ఒవైసీని తిరస్కరించారని అన్నారు. తమ రాష్ట్రంలో ఒవైసీ ఒక్క సీటు కూడా గెలవలేదని, మోడీ హయాంలో .. ప్రజలను చీల్చడానికి యత్నించే శక్తులకు ఏ మాత్రం చోటు లేదని రఘువర్ దాస్ చెప్పారు.
కాగా బడా పారిశ్రామికవేత్త అదానీతో ప్రధాని మోడీకి, ఇతర బీజేపీ నేతలకు ఉన్న సంబంధాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్.. రఘువర్ దాస్ కు చురక వేసినట్టు భావిస్తున్నారు. పైగా గుజరాత్ .. మోడీ సొంత రాష్ట్రం కూడా.. అందువల్లే అహ్మదాబాద్ పేరును మొదట మీరు అదానీబాద్ గా మార్చాలని కేటీఆర్ సవాల్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని గతంలోకూడా పలువురు బీజేపీ నేతలు హామీలు గుప్పించారు.