Telugu Global
NEWS

మోదీ ప్రసంగంతో కాంగ్రెస్ లో నిరాశ..

అదేంటి.. కేసీఆర్ ని మోదీ విమర్శించకపోవడం వల్ల బీజేపీ శ్రేణులు నిరాశపడ్డాయంటే అందులో అర్థముంది, మధ్యలో కాంగ్రెస్ కి ఏమొచ్చింది అనుకుంటున్నారా..? ఇది నిజం, మోదీ ప్రసంగంలో టీఆర్ఎస్ ని, ముఖ్యంగా కేసీఆర్ ని పల్లెత్తు మాట అనకపోవడంతో కాంగ్రెస్ హర్ట్ అయింది. ఒకరకంగా కాంగ్రెస్ రెండు వ్యూహాలను ముందుగానే సిద్ధం చేసుకుంది. ఒకవేళ మోదీ విమర్శలు సంధిస్తే.. టీఆర్ఎస్ అవినీతి జాతీయ స్థాయిలో తెలిసిపోయింది, అందుకే ఈ విమర్శలంటూ కేసీఆర్ సర్కారుని ఇరుకునపెట్టేవారు కాంగ్రెస్ నేతలు. […]

మోదీ ప్రసంగంతో కాంగ్రెస్ లో నిరాశ..
X

అదేంటి.. కేసీఆర్ ని మోదీ విమర్శించకపోవడం వల్ల బీజేపీ శ్రేణులు నిరాశపడ్డాయంటే అందులో అర్థముంది, మధ్యలో కాంగ్రెస్ కి ఏమొచ్చింది అనుకుంటున్నారా..? ఇది నిజం, మోదీ ప్రసంగంలో టీఆర్ఎస్ ని, ముఖ్యంగా కేసీఆర్ ని పల్లెత్తు మాట అనకపోవడంతో కాంగ్రెస్ హర్ట్ అయింది. ఒకరకంగా కాంగ్రెస్ రెండు వ్యూహాలను ముందుగానే సిద్ధం చేసుకుంది. ఒకవేళ మోదీ విమర్శలు సంధిస్తే.. టీఆర్ఎస్ అవినీతి జాతీయ స్థాయిలో తెలిసిపోయింది, అందుకే ఈ విమర్శలంటూ కేసీఆర్ సర్కారుని ఇరుకునపెట్టేవారు కాంగ్రెస్ నేతలు. మోదీ విమర్శించలేదు కాబట్టి.. వారిద్దరి మధ్య స్నేహబంధం చూడండి అంటూ ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు. మొత్తమ్మీద తెలంగాణ గడ్డపై మోదీ, కేసీఆర్ ని విమర్శించకపోవడంతో కాంగ్రెస్ నొచ్చుకోవడం విశేషం.

“తెలంగాణ మిత్రులారా
తన చీకటి మిత్రుడు కేసీఆర్ పేరు కూడా ప్రస్తావించకుండా, కుటుంబ పాలన, అవినీతి ఊసెత్తకుండా.. మోదీ గారి మిత్రధర్మం చూశారుగా..!” అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ వేశారు. మోదీ ప్రసంగంలో కేసీఆర్ పేరెత్తలేదని, దీంతో వారి లాలూచీ బయటపడిందని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ భాయ్ భాయ్ అంటూ గతంలో పలు విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలకు.. మోదీ తాజా ప్రసంగం మరో ఊతంగా మారింది.

శబ్ద కాలుష్యం తప్ప ఏమీ లేదు..
విభజన హామీలపై ప్రధాని మోదీ నిర్దిష్ట ప్రకటన చేస్తారని ఆశించామని, కానీ ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలకు శబ్ద కాల్యుషం తప్ప బీజేపీ సభతో ఒరిగిందేమీ లేదన్నారు రేవంత్ రెడ్డి. గిరిజన విశ్వవిద్యాలయం, ఎన్టీపీసీ 4వేల మెగావాట్ల పవర్‌ ప్లాంట్‌, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్‌ ప్యాక్టరీ ఏర్పాటుపై మోదీ కనీసం ప్రకటన చేయలేదని విమర్శించారు.

బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామన్నారని, ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, కానీ అవేవీ నెరవేర్చలేకపోయారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, ఎనిమిదేళ్లుగా ఎన్డీఏ తీసుకొచ్చే ప్రతి బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు తెలుపుతూ వచ్చిందని విమర్శించారు. కాళేశ్వరం కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలా మారిందని ఆరోపించారే కానీ, చర్యలు ఎందుకు తీసుకోలేదని మోదీని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. బీజేపీ నాయకులు ప్రసంగాల్లో అధికారదాహం తప్ప తెలంగాణ త్యాగాలు, అమరవీరుల త్యాగాల గురించి ప్రస్తావన లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించేలా ఈ గడ్డపై అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు ఆయన దుస్సాహసాన్ని ప్రతిబింబిస్తున్నాయని, అమిత్‌ షా తన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

First Published:  4 July 2022 2:14 AM IST
Next Story