Telugu Global
NEWS

‘మహా’ రహస్య ఎజండా !! ఇంకా ఉంది.. !!

బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి మోడీ ప్రసంగం ఉసూరుమనిపించిందనీ, కేసీఆర్‌ పేరేత్తనందుకు బీజేపీ శ్రేణులు నిరాశలో ఉన్నాయంటూ కథనాలు వస్తున్నాయి. ఇది పాక్షిక సత్యమే! వ్యూహాత్మకంగానే మోడీ అభివృద్ధి సబ్జెక్టును ఎంపిక చేసుకొని ఉంది ఉంటారు. ఒకసారి అమిత్ షా, నడ్డా, పీయూష్ గోయల్ ప్రసంగాలు వినండి. అందులో వాడి, వేడి పుష్కలంగా ఉంది. తెలంగాణలో పార్టీ జాతీయ సమావేశాలను నిర్వహించడం, భారీ బహిరంగసభ, కేసీఆర్ ను గద్దె దింపుతామంటూ పార్టీ నాయకుల ప్రతిజ్ఞలు.. అన్నీ […]

‘మహా’ రహస్య ఎజండా !! ఇంకా ఉంది.. !!
X

బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి మోడీ ప్రసంగం ఉసూరుమనిపించిందనీ, కేసీఆర్‌ పేరేత్తనందుకు బీజేపీ శ్రేణులు నిరాశలో ఉన్నాయంటూ కథనాలు వస్తున్నాయి. ఇది పాక్షిక సత్యమే! వ్యూహాత్మకంగానే మోడీ అభివృద్ధి సబ్జెక్టును ఎంపిక చేసుకొని ఉంది ఉంటారు. ఒకసారి అమిత్ షా, నడ్డా, పీయూష్ గోయల్ ప్రసంగాలు వినండి. అందులో వాడి, వేడి పుష్కలంగా ఉంది. తెలంగాణలో పార్టీ జాతీయ సమావేశాలను నిర్వహించడం, భారీ బహిరంగసభ, కేసీఆర్ ను గద్దె దింపుతామంటూ పార్టీ నాయకుల ప్రతిజ్ఞలు.. అన్నీ ప్రణాళికాబద్ధంగానే సాగాయి.

పైపైన చూసే వారికి ఈ సంగతి తొందరగా అర్థం కాదు. ‘తెలంగాణ మాకు సారవంతమైన నేల. గట్టిగా ప్రయత్నిస్తే అధికారం మాదే’ అని బీజేపీ రాష్ట్ర నాయకుడొకరు అనడంలో తాత్పర్యం సులభంగా అర్థ‌మవుతుంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సగానికిపైగా స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ జరుగుతోంది.

”ఎన్నికలు షెడ్యూలు ప్రకారం జరిగినా, ముందస్తు జరిగినా గెలుపు మాదే” అని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను చాలా లోతుగా అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ ప్రభుత్వాన్ని చీకాకు పరచడానికి ‘దర్యాప్తు సంస్థల’ను రంగంలోకి దింపే అవకాశాలను కొట్టిపారవేయలేం. అయితే అందుకు గాను ఎలాంటి ‘క్లూ’ బీజేపీ నాయకత్వం ఇవ్వడం లేదు.

ఐటీ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల దుర్వినియోగం గురించి రోజూ వింటూ ఉన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్, అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరచూ ఇలాంటి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ‘కేసీఆర్ కుటుంబంపై దర్యాప్తు ప్రక్రియకు తగిన సమయం రావాలి’అని టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాకతాళీయంగా మాట్లాడారని అనుకోవడానికి వీల్లేదు.

ఆదివారం రాత్రి కూడా తెలంగాణ బీజేపీ నాయకులతో అమిత్ షా రహస్య సమావేశం జరిపారు. ఆ సమావేశం వివరాలు బయటకు వచ్చినా, వాస్తవాలు బయటకు వస్తాయన్న నమ్మకం లేదు. అమిత్ షా, మోడీ, నడ్డా వంటి వారికి తెలియకుండా తెలంగాణలో ‘మహారాష్ట్ర సీన్ రిపీట్’ అవుతుందని కిషన్ రెడ్డి వంటి బాధ్యతగల నాయకులు ఎట్లా చెబుతారు? అంటే బీజేపీలో ఢిల్లీ స్థాయిలో ‘ఏదో జరుగుతోంది’! ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. రాష్ట్రస్థాయి నాయకులకు కూడా అంతు చిక్కకుండా ‘స్కెచ్ ‘వేస్తున్నట్టు అనుమానించవచ్చు.

తెలంగాణ ప్రభుత్వం జోలికి వస్తే కేసీఆర్ తెలంగాణ వాదానికి మరలా ఎట్లా నిప్పంటించగలరో బీజేపీ పండితులకు తెలుసు. కనుక అన్నీ ఆలోచించి అడుగు వేయాలన్న పథకం బీజేపీ ఢిల్లీ నాయకుల మనసులో సుడులు తిరుగుతోంది.

కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన గురించి అమిత్ షా మరోసారి ప్రస్తావించి, మరోసారి తెలంగాణ ప్రజల్ని అవమాన పరిచారు. మహారాష్ట్ర సహా 9 రాష్ట్రాలలో ప్రజాతీర్పును అపహాస్యం చేసి అధికారం చేపట్టిన బీజేపీ తెలంగాణలోనూ అలాంటి ‘కుట్ర’కు పథక రచన చేస్తున్నట్టుగానే అనుమానించాలి. ఆ ‘ప్రయోగం’ఇప్పట్లో అమలు చేయకపోయినా వచ్చే ఎన్నికల తర్వాత అయినా తెలంగాణలో ‘ప్రజాతీర్పు’ను తారుమారు చేసే అవకాశాలను తోసిపుచ్చలేం. కనుక టీఆర్ఎస్ మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది.

మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తర ప్రదేశ్ విభజనను ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ విభజన సక్రమంగా పద్ధతి ప్రకారం జరగనందుకే ఇప్పటికీ రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వైషమ్యాలు కొనసాగుతున్నాయని షా అన్నారు. తెలంగాణలో అవినీతి గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, పీయూష్ గోయల్ ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 40 వేల కోట్ల అంచనాలతో ప్రారంభించగా లక్ష కోట్లకు పైగా ఖర్చు జరిగిందని ఆయన ఆరోపించారు. ఆదివారం మధ్యాహ్నమే నోవాటెల్ హోటల్ లో విలేకరుల సమావేశంలోనూ గోయల్ ఇదే విషయం చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో శాంతిభద్రతలు సజావుగా ఉన్నాయని, సుపరిపాలన అందిస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. బీజేపీ జాతీయ నాయకులు ఒక్కొక్కరు ఒక సబ్జెక్టును ఎంచుకొని దాని ప్రకారమే మాట్లాడినట్టు కనిపిస్తోంది.

”సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. మంత్రంతో తెలంగాణను అభివృద్ధి చేస్తాం.హైదరాబాద్ ప్రతిభకు పట్టం కడుతుంది. తెలంగాణ ప్రాచీన, పరాక్రమాల గడ్డ. తెలంగాణ గడ్డ ఎంతో స్పూర్తిని ఇస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోంది. బడుగు , బలహీన వర్గాల కోసం బీజేపీ ప్రభుత్వం ఎంతో చేసింది.

భద్రాచలం రాముల వారి ఆశీస్సులు మనకు వున్నాయి. ప్రతి పేద, బడుగు, బలహీన వర్గాలకు కేంద్ర పథకాలు అందుతున్నాయి. ఉచిత రేషన్, ఉచిత వ్యాక్సిన్ అందించాం. 2019 ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు మద్ధతు పలికారు. 2019 నుంచి తెలంగాణలో పార్టీ బలపడుతోంది. కరోనా సమయంలో తెలంగాణ ప్రజల కోసం చాలా చేశాం. తెలంగాణ ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరుగుతోంది. డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.

హైదరాబాద్ లో సైన్స్ సిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాము. బయో మెడికల్ సైన్సెస్ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. తెలుగులో టెక్నాలజీ, మెడికల్ చదువులు ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించాలి. మహిళా సాధికారత దిశగా ముందడుగు వేస్తున్నాం. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాం. తెలంగాణలో 5 ప్రాజెక్ట్ లకు కేంద్రం సహకరిస్తోంది. రైతుల కోసం ఎంఎస్‌పీని పెంచాం. హైదరాబాద్ లో 1500 కోట్లతో ఫ్లై ఓవర్లు, ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేలు నిర్మిస్తున్నాం.

రీజనల్ రింగ్ రోడ్ కూడా కేటాయించాం. దేశ ఆర్ధిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెంచాం.. ఆవిష్కరణల్లో దేశంలోనే తెలంగాణ కేంద్రంగా మారింది. మా పాలనలో గ్రామాల్లోని యువతకు ప్రోత్సాహం ఇస్తున్నాం. తెలంగాణలో రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. తెలంగాణలో 5000 కిలోమీటర్ల నేషనల్ హైవేలను అభివృద్ధి చేశాం. మెగా టైక్స్‌టైల్ పార్క్ ను తెలంగాణలో నిర్మిస్తాం” అని మోడీ వివరించారు.

కాగా తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ముఖాముఖి యుద్ధం జరగనున్నట్టు ఎవరూ అంచనా వేయడం లేదు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందనే అందరూ భావిస్తున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య, కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ సమరం జరగవచ్చు. మరికొన్ని నియోజకవర్గాల్లో ఈ మూడు పార్టీల మధ్య భీకరపోరాటం జరగవచ్చు.

ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల నాటికి మారే సమీకరణాలు, రాజకీయ బలాబలాలు, అభ్యర్థుల సత్తా, అంగబలం, డబ్బు.. తదితర అంశాల ఆధారంగా ‘పోరాటం’ ఎట్లా ఉంటుందో అప్పటికి ఒక నిర్ధారణకు రావడానికి సాధ్యమవుతుంది. ప్రతిపక్షాలు ఏవైనా అధికారపక్షం టిఆర్ఎస్ తోనే ప్రధానంగా తలపడవలసి ఉంది.

కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు మోడీ జవాబు ఇవ్వలేకపోయారని టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. ఇదీ పాక్షిక సత్యమే. కేసీఆర్ వ్యూహం తెలుసుకోవడానికి ఒక ట్రిక్కు కూడా కావచ్చు. కేసీఆర్ కు కొంత ‘ రిలాక్స్ ‘ ఇస్తే ఏమి చేస్తారో చూద్దామని మోడీ ఎత్తుగడ అయి ఉండవచ్చు!

First Published:  4 July 2022 6:01 PM IST
Next Story