Telugu Global
NEWS

‘మద్యంతో వైసీపీ నేతలకు నెలకు వచ్చే ఆదాయం రూ. 250 కోట్లు !’ జనసేనాని

మద్యంతో వైసీపీ నేతలకు నెలకు వచ్చే ఆదాయం 250 కోట్ల రూపాయలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మద్య‌ నిషేధం అని చెప్పిన వ్యక్తే నేడు మద్యం అమ్ముతున్నారని, ఈ మద్యం ద్వారానే వారు నెలకు వ్యక్తిగతంగా ఇన్ని కోట్లు సంపాదిస్తున్నారని ఆయన చెప్పారు. అడ్డగోలుగా లంచాలు తింటున్న వ్యక్తులే అవినీతి నిర్మూలనకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టడం హాస్యాస్పదమని, అలాంటివారికి ఉద్యోగులను శిక్షించే అర్హత ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. శనివారం మంగళగిరిలోని తమ […]

‘మద్యంతో వైసీపీ నేతలకు నెలకు వచ్చే ఆదాయం రూ. 250 కోట్లు !’ జనసేనాని
X

మద్యంతో వైసీపీ నేతలకు నెలకు వచ్చే ఆదాయం 250 కోట్ల రూపాయలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మద్య‌ నిషేధం అని చెప్పిన వ్యక్తే నేడు మద్యం అమ్ముతున్నారని, ఈ మద్యం ద్వారానే వారు నెలకు వ్యక్తిగతంగా ఇన్ని కోట్లు సంపాదిస్తున్నారని ఆయన చెప్పారు. అడ్డగోలుగా లంచాలు తింటున్న వ్యక్తులే అవినీతి నిర్మూలనకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టడం హాస్యాస్పదమని, అలాంటివారికి ఉద్యోగులను శిక్షించే అర్హత ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.

శనివారం మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయంలో జరిగిన వీర మహిళల తొలి విడత రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొన్నారు. చట్టసభల్లో ఈ అవినీతిపరులు చేసిన చట్టాలను, హామీలను వారే పాటించరని, సాధారణ వ్యక్తులకు చట్టాలు ఎలా అమలవుతాయో వీటిని చేసినవారికి కూడా అలానే అమలవ్వాలని పవన్ పేర్కొన్నారు. దేశాన్ని నడిపించేది అత్యున్నత రాజ్యాంగమేనని, రాజ్యాంగం చెప్పినట్టు ఎవరైనా నడచుకోవలసిందేనని, సుప్రీం న్యాయమూర్తులైనా రాజ్యాంగానికి తలవంచాల్సిందేనన్నారు.

‘ఇష్టానుసారం కొత్త భాష్యాలు చెప్పడం కాదు.. మహిళలకు సరళమైన భాషలో రాజ్యాంగంలోని కీలకాంశాలపై పుస్తకాన్ని అందిస్తాం.. మన ప్రాథమిక హక్కులు, బాధ్యతల గురించి తెలుసుకుంటే పోరాట పటిమ పెరుగుతుంది. మనలో అవగాహన పెరిగితే పాలకులు తప్పులు చేయడానికి భయపడతారు’ అని ప‌వ‌న్‌ వ్యాఖ్యానించారు.

‘క్రిమినల్స్ కి వంత పాడుతున్నారు’
వైసీపీ ప్రభుత్వంలో హోం శాఖకు మంత్రిగా ఉన్న ఓ ఆడపడుచు.. రాష్ట్రంలో ఓ ఆడపిల్లకు అన్యాయం జరిగితే తల్లి పెంపకం సరిగా లేదంటూ మాట్లాడడం అత్యంత హేయమని, నేరం జరిగినప్పుడు ఆడపిల్లకు అండగా నిలబడాల్సిన ప్రజాప్రతినిధులు క్రిమినల్స్ కి వంత పాడుతున్నారని పవన్ దుయ్యబట్టారు. మిమ్మల్ని ఇలాంటి అరాచకాలకు అండగా ఉండడానికా గెలిపించింది అని ప్రశ్నించిన ఆయన.. భర్త ఎదురుగా అత్యాచారం చేస్తే బాధ్యత కలిగిన మంత్రి బాధితురాలికి ధైర్యం చెప్పకపోగా నేరస్థులను వెనకేసుకొచ్చేలా మాట్లాడారన్నారు.

సుగాలి ప్రీతి అనే 14 ఏళ్ళ బాలికను స్కూల్లోనే అత్యాచారం చేసి హత్య చేశారని, దాన్ని కూడా తల్లి పెంపకం సరిగా లేదని అంటారా అన్నారు. జనసేన పోరాటంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారని, కానీ ఆ తల్లికి మాత్రం న్యాయం జరగలేదని పేర్కొన్నారు. సుగాలి ప్రీతి తల్లి పార్వతీ, ఖమ్మంలో రోడ్డుపై నడుస్తూ లక్షలాది మొక్కలు నాటిన వనజీవి రామయ్య లాంటి వ్యక్తులు తన హీరోలని పవన్ చెప్పారు. దేశం కోసం పోరాటం చేసిన సుభాష్ చంద్రబోస్, ఆజాద్, భగత్ సింగ్ వంటివారి స్ఫూర్తి గొప్పదని, వారిని అనుసరిద్దామన్నారు. బూతులు తిట్టే నాయకులు చాలా అల్పులని, వారి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

‘వకీల్ సాబ్’ లో ఆ డైలాగ్ చెప్పేందుకు ఒప్పుకోలేదు
‘వకీల్ సాబ్’ చిత్రంలో హిందీ మాతృకలో బాధితురాలి పక్షాన వాదించే లాయర్ ఆమెను ‘ఆర్ యూ వర్జిన్’ అని అడిగే సీన్ ఉందని, దాన్ని తెలుగు వెర్షన్ లోనూ అలాగే ఉంచుతామని చెబితే.. తాను ఆ మాట అననని, ఆ డైలాగ్ చెప్పనని పవన్ తెలిపారు. దీంతో దాన్ని పూర్తిగా మార్చి మళ్ళీ ఆ సీన్ మొత్తాన్ని వేరేగా చేయాల్సివచ్చిందన్నారు. మహిళలను కించపరిచే మాట అనడానికి తన మనసు ఒప్పలేదని, కచ్చితంగా అలాంటి మాటలు కానీ, మహిళలను అగౌరవ పరిచే విషయాలు గానీ జనసేన పార్టీకి విరుద్ధమన్నారు. ‘అదే డైలాగ్ నేరం చేసినవాడిని ఉద్దేశించి చెప్పాను.. ఏం..? మగాళ్లకు ఓ మాట, స్త్రీకి ఒక మాట అంటే ఎలా’ అని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ప్రశ్నించారు.

నాకు నా మతం గొప్పది కావచ్చు కులం గొప్పది కావచ్చు.. కానీ ఇదే సమయంలో వాటితో బాటు ఇతర మతాలు, కులాలను కూడా గౌరవించుకోవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. బహుళ అంతస్థుల భవనం కూడా చిన్న పునాది రాయితో మొదలవుతుందని, జనసేన పార్టీ కూడా అలాంటిదేనని ఆయన పేర్కొన్నారు. పార్టీ నమ్మిన సిధ్ధాంతాలను బలంగా ముందుకు తీసుకువెళ్తే చిన్న చిన్న చుక్కల్లాంటి కార్యకర్తలను కలిపి.. అతి పెద్ద ప్రజాస్వామ్య సర్కిల్ ని రూపొందించడమే తమ విధానమని ఆయన వివరించారు. సుమారు 12ఏళ్ళ క్రితం వ్యక్తిగత అధ్యయనం చేసి పార్టీకి కొత్త సిద్ధాంతాలను రూపొందించానని, 80 వ దశకంలో కొత్త మార్పునకు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడితే ఆ తరువాత తెలంగాణాలో టీఆరెఎస్ కూడా అదేబాటలో నడిచిందన్నారు. బలమైన సిద్ధాంతాలతో వచ్చిన పార్టీలు సైతం ప్రత్యేక పరిస్థితుల్లో కులం, మతం, ప్రాంతం ఆధారంగా ముందుకు వెళ్లవచ్చని, కానీ తమ పార్టీ ఎప్పటికీ అలా వెళ్లకూడదనే బలమైన భావజాలం ఉన్న వ్యక్తులను తయారు చేయడానికి పూనుకున్నానని జనసేనాని వివరించారు.

First Published:  3 July 2022 7:37 AM IST
Next Story