Telugu Global
NEWS

తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కారు కోరుకుంటున్నారు

– ఈ రాష్ట్రంలో బీజేపీ బలపడుతోంది – 8 ఏళ్లలో రాష్ట్రానికి చాలా నిధులు ఇచ్చాం – త్వరలో మెగా టెక్స్‌టైల్ పార్క్ రాబోతోంది – రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని త్వరలోనే జాతీయం చేస్తాం – తెలుగు భాషలో మెడిసిన్, ఇంజినీరింగ్ విద్యను అందించనున్నాం దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు ఎంతో అభివృద్ది చెందుతున్నాయి. అందుకు డబుల్ ఇంజిన్ సర్కార్లే కారణం. తెలంగాణ ప్రజలు కూడా డబుల్ ఇంజన్ సర్కారును కోరుకుంటున్నారు. అందుకు ఇక్కడి ప్రజలే […]

Narendra Modi
X

– ఈ రాష్ట్రంలో బీజేపీ బలపడుతోంది
– 8 ఏళ్లలో రాష్ట్రానికి చాలా నిధులు ఇచ్చాం
– త్వరలో మెగా టెక్స్‌టైల్ పార్క్ రాబోతోంది
– రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని త్వరలోనే జాతీయం చేస్తాం
– తెలుగు భాషలో మెడిసిన్, ఇంజినీరింగ్ విద్యను అందించనున్నాం

దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు ఎంతో అభివృద్ది చెందుతున్నాయి. అందుకు డబుల్ ఇంజిన్ సర్కార్లే కారణం. తెలంగాణ ప్రజలు కూడా డబుల్ ఇంజన్ సర్కారును కోరుకుంటున్నారు. అందుకు ఇక్కడి ప్రజలే మార్గం సుగమమం చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం సాయంత్రం బీజేపీ నిర్వహించిన ‘విజయ సంకల్ప సభ’లో ఆయన పాల్గొని, ప్రసంగించారు. ‘తెలంగాణ బీజేపీని ఆశీర్వదించడానికి ఎంతో దూరం నుంచి వచ్చిన కార్యకర్తలకు, సోదర సోదరీమణులకు, మాతృమూర్తులకు నా నమస్కారం’ అంటూ మోడీ తెలుగులో ప్రారంభించారు. 25 నిమిషాల పాటు సాగిన ఈ ప్రసంగంలో తెలంగాణకు గత ఎనిమిదేళ్లలో ఏం నిధులు ఇచ్చాం, ఏలా అభివృద్ధి చేశామనే విషయాలను మోడీ వివరించే ప్రయత్నించారు.

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరవడానికి 2015 నుంచి ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే ఆ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేస్తామని ప్రధాని చెప్పారు. తెలంగాణలో త్వరలో మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ రాష్ట్రం నుంచి భారీగా ధాన్యం కొనుగోలు చేశాము. దాదాపు రూ. 1 లక్ష కోట్ల మేర కొనుగోళ్లు చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రైతుల జీవితాలను మార్చాలని తాము కోరుకుంటున్నామని అన్నారు.

హైదరాబాద్‌లో రూ. 1500 కోట్లతో అనేక ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ రోడ్లను కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తోందని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డును కూడా హైదరాబాద్ చుట్టూ నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో 2,700 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించామని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో 5 వేల కిలోమీటర్ల నేషనల్ హైవేలు ఉన్నాయన్నారు. తెలంగాణ అంతటా కనెక్టివిటీ ఉండాలని.. పట్టణాలే కాకుండా, గ్రామాలను కూడా అనుసంధానం చేస్తూ నేషనల్ హైవేలు నిర్మిస్తున్నామన్నారు. మా ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో జాతీయ రహదారులు రెట్టింపయ్యాయని గుర్తు చేశారు. తెలంగాణలో రూ. 35 వేల కోట్లతో 5 భారీ సాగునీటి ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో అత్యాధునిక సైన్స్ సిటీ నిర్మించాలని కేంద్రం కృషి చేస్తోందన్నారు.

బీజేపీలో ఉన్న సేవా గుణం తెలంగాణలోని ప్రతీ వ్యక్తికి సాయం అందుతోంది, కరోనా సమయంలో అందరికీ ఉచిత వ్యాక్సిన్లు అందించామని అన్నారు. ధనిక, పేద, మధ్యతరగతి అనే వివక్ష లేకుండా ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ అందించామన్నారు. అలాగే ఉచిత వైద్య సేవలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కరోనా సమయంలో రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి బీజేపీ సాయం చేసిందని చెప్పారు. ఉజ్వల పథకం ద్వారా ఎంతో మంది పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షలు అందించామని ప్రధాని చెప్పారు. ఇక హైదరాబాద్‌లో ఒక పరిశోధన కేంద్రం ప్రారంభించనున్నామన్నారు. అలాగే మెడిసిన్, ఇంజినీరింగ్ చదువులు తెలుగు మాధ్యమంలో ప్రారంభించనున్నామని.. పేద విద్యార్థులకు ఇవి చాలా ఉపయోగపడతాయని అన్నారు.

2019 ఎన్నికల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించారు, సమర్థించారని.. ఇక్కడి ప్రజలు బీజేపీపై చాలా నమ్మకం పెట్టుకున్నారని మోడీ అన్నారు. తెలంగాణలో కూడా బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. తెలంగాణ నలుదిక్కులా అభివృద్ధి చెందాలన్నదే బీజేపీ ప్రాధాన్యమని, రాష్ట్రభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఇక్కడి దళితులు, ఆదివాసీల ఆంకాంక్షలను బీజేపీ నెరవేర్చిందన్నారు. సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్ మంత్రంతో తెలంగాణను అభివృద్ది చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం చాలా సహకరిస్తున్నామని చెప్పారు. ప్రజల ఆంకాంక్షలను నెరవేర్చేందుకు బీజేపీ పగలు, రాత్రి శ్రమిస్తోందన్నారు.

తెలంగాణ పరాక్రమాలకు నిలయం..

మోడీ తన ప్రసంగంలో తెలంగాణ గడ్డను, కళలను, సంస్కృతిని కొనియాడారు. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సదస్సు నిర్వహించడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ సదస్సుకు చాలా ప్రాముఖ్యత ఉన్నదని మోడీ చెప్పారు. తెలంగాణలో కళ, కౌశలం, పనితనం పుష్కలంగా ఉన్నాయన్నారు. ఇది పరాక్రమాలకు నిలయమైన పుణ్యభూమి అని.. ఈ నేలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. భద్రాచలం శ్రీరాముడు, యాదాద్రి నర్సింహస్వామి, జోగులాంబ, వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయన్నారు.

కాకతీయుల వీరత్వం.. రాణి రుద్రమ, ప్రతాపరుద్రుడు, కొమురం భీమ్ పరాక్రమాలు అమూల్యమైనవని అన్నారు. భక్త రామదాసు, పాల్కూరి సోమన్నల సాహిత్యం.. రామప్ప నుంచి కాకతీయ తోరణం వరకు ఎంతో అమూల్యమైన శిల్పకళలను, అద్భుతమైన నిర్మాణ కౌశల్యాన్ని ఆయన కొనియాడారు. ఇక్కడి ప్రజల ఉత్సాహాన్ని తాను అర్థం చేసుకున్నానని.. మీ అందరి ఆశీర్వాదాలకు ధన్యవాదాలని మోడీ చెప్పారు.

First Published:  3 July 2022 2:56 PM IST
Next Story