Telugu Global
NEWS

పేరెంటింగ్ మిస్టేక్స్!

పిల్లల పెంపకం ఒక కళ. తల్లిదండ్రులు అవ్వగానే చెప్పలేని బాధ్యత వచ్చి పడుతుంది. ఆ బాధ్యతలోనే పిల్లల విషయంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు. బహుశా తల్లిదండ్రుల కోణంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు సరైనవే కావచ్చు కానీ పిల్లల కోణంలోంచి చూస్తే తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలు పిల్లల జీవితాలకు పెద్ద సమస్యలై కూచుంటాయి. వారి చిట్టి ప్రపంచానికి ఇదంతా కాస్త గందరగోళంగా ఉండొచ్చు. పిల్లల్ని పెంచడం, పోషించడం, వారిలో కష్టపడే తత్వాన్ని పెంపొందిచడం , సంపాదన పరులుగా మార్చడం […]

పేరెంటింగ్ మిస్టేక్స్!
X

పిల్లల పెంపకం ఒక కళ. తల్లిదండ్రులు అవ్వగానే చెప్పలేని బాధ్యత వచ్చి పడుతుంది. ఆ బాధ్యతలోనే పిల్లల విషయంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు. బహుశా తల్లిదండ్రుల కోణంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు సరైనవే కావచ్చు కానీ పిల్లల కోణంలోంచి చూస్తే తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలు పిల్లల జీవితాలకు పెద్ద సమస్యలై కూచుంటాయి. వారి చిట్టి ప్రపంచానికి ఇదంతా కాస్త గందరగోళంగా ఉండొచ్చు.

పిల్లల్ని పెంచడం, పోషించడం, వారిలో కష్టపడే తత్వాన్ని పెంపొందిచడం , సంపాదన పరులుగా మార్చడం వంటి విషయాల్లో తల్లిదండ్రులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూనే ఉంటారు. కానీ తల్లిదండ్రులు తీసుకునే కొన్ని నిర్ణయాలు పిల్లల జీవితాలను అల్లకల్లోలం చేయడం, చాలా సమస్యల్లోకి నెట్టడం మనకు తెలియకుండా జరిగే కొన్ని సందర్భాలు. “అంతా నీ మంచికోసమే కదా!” అనే డైలాగ్ తో పిల్లల నోర్లు మూయిస్తున్న తల్లిదండ్రులు చాలామందే ఉన్నారు. కానీ నిజానికి ఇటువంటి నిర్ణయాలు పిల్లల మానసిక పరిస్థితిని చాలా దారుణంగా దెబ్బతీస్తాయి.

పోల్చడం పెద్ద తప్పే..
పరీక్షల్లో మార్కుల విషయం నుండి జీవితంలో ఎంపిక చేసుకునే భాగస్వామి వరకు అన్ని విషయాలలో పక్క వాళ్ళతోనూ, తెలిసిన వాళ్ళతోనూ పోల్చి విశ్లేషణ చేసే తల్లిదండ్రులు ఎక్కువ భాగం ఉంటారు. ముఖ్యంగా అలవాట్లు, ఇష్టాలు, అభిరుచులు, ఆసక్తుల విషయాల్లో అది కాదు ఇది, ఇది కాదు అది అని నిర్ణయించడమే కాకుండా “వాళ్ళు చూడు ఎలా ఉన్నారో! వీళ్ళు చూడు ఇదే చేసి ఎంత బాగున్నారో” వంటి మాటలు తరచుగా అంటూ ఉంటారు. ఈ మాటలే వారిమీద గాఢమైన ముద్ర వేస్తాయని గమనించకపోవడం ప్రతి తల్లితండ్రులు చేస్తున్న పెద్ద పొరబాటనే చెప్పాలి.

చిన్నతనం నుండి పిల్లలకు ఇటువంటివి చూసి చూసి తమ మీద తాము నమ్మకాన్ని కోల్పోతారు. ఫలితంగా వాళ్లకు ఏ పని మీద ఆసక్తి లేకపోవడం, దేన్నీ శ్రద్ధగా చేయలేకపోవడం, నిరాశ, తాము కరెక్ట్ కాదేమో, ఏమి చేతకాదేమో అనే ఆత్మన్యూనతా భావం పెరిగిపోయి పిల్లల్ని ఒక ఫెయిల్యూర్ కేటగిరిలోకి తోసేస్తుంది.

ఎమోషన్స్ ను గుర్తించాలి!
ఈ ప్రపంచంలో జంతువులకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. అయితే వాటిని వ్యక్తం చేసినప్పుడు ప్రతిస్పందనల ఆధారంగా ఆ ఎమోషన్స్ ప్రభావం తగ్గడం జరుగుతూ ఉంటుంది. కారణాలు ఏవైనా పిల్లల్లో బాధ, కోపం, అలక వంటి మూడ్స్ లో ఉన్నప్పుడు వాళ్ళను పట్టించుకోకుండా “కొద్దిసేపు అయితే మాములు అయిపోతారులే” అనుకోవడం చాలా పెద్ద తప్పు. మరీ ముఖ్యంగా పిల్లలు బాధలో ఉన్నప్పుడు వాళ్లకు పేరెంట్స్ ఓదార్పు అవసరం అవుతుంది. ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు వాళ్ళను నిందించడం, వాళ్ళ మానాన వాళ్లను వదలేయడం వంటివి చేయకుండా దగ్గర కూర్చుని మాట్లాడితే వారికి కాస్త ఊరటతోపాటు.. తనవైపు తల్లితండ్రులు ఉన్నారన్న భరోసాను కల్పించిన వారవుతారు. ఓదార్చడం, సమస్యకు కారణాలు వివరించడం, మీరైతే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో చెప్పడం, పూర్తిగా ఎమోషన్ మూడ్స్ ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా వాళ్లకు మేమున్నాం అనే భరోసా ఇవ్వడం..తెలీకుండానే వాళ్లకు ఏనుగంత బలాన్ని తెచ్చిపెడుతుంది.

ఎమోషన్ బ్లాక్ మెయిల్!
రిలేషన్ ఏదైనా సరే చాలామంది ప్రయత్నించే అస్త్రం ఎమోషన్ బ్లాక్ మెయిల్. పిల్లల ఎమోషన్స్ ను పట్టించుకోకపోవడం ఒక తప్పైతే వాళ్ళను ఎమోషన్ బ్లాక్ మెయిల్ చేయడం అతిపెద్ద తప్పు. తల్లిదండ్రుల మాటకు ఒకే చెప్పకపోతే “మీ ఇష్టం పెద్దవాళ్ళు అయ్యారు మీకెందుకు మాతో పని” “మీకు నచ్చినట్టే చేసుకోండి మేము ఎలా చస్తే మీకేంటి?” “మీరెప్పుడు మా మాట విన్నారు? ఏదైనా అయితే మేము బాధ్యులం కాదు” వంటి మాటలు పిల్లల్ని మానసికంగా చాలా నిర్ణయాలు వెనక్కి తీసుకొనేలా చేస్తాయి. ఏదైనా తప్పు కనిపిస్తే దాన్ని వివరించడానికి చూస్తే బ్లాక్ మెయిల్ వరకూ వెళ్లనవసరం ఉండదు.

అతి ప్రేమ, అతి జాగ్రత్త!
ప్రేమ చూపించడం, జాగ్రత్తలు చెప్పడం మంచిదే కానీ అది అతి అయితే చాలా ఇబ్బందులనే తెచ్చిపెడుతుంది. ఈ అతిప్రేమ, అతి జాగ్రత్త అనేవి మొదట్లో సర్దుకుపోయే విషయాలుగా అనిపించినా క్రమంగా పిల్లల యాంగిల్ లో అవన్నీ పెద్ద బంధనాలుగా తయారైపోతాయి. పెద్దయ్యే కొద్దీ అది ప్రేమలా కాకుండా కట్టేసినట్టు అనిపించి ప్రతి విషయంలో ఆంక్షలు పెడుతున్నట్టే భ్రమింపచేస్తాయి. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

డిమాండ్ చేయడం!
నువ్వు అదే చెయ్యి, ఇదే చెయ్యి, అలా చేస్తేనే నీకు లైఫ్ ఉంటుంది వంటి మాటలు పిల్లల్ని మానసికంగా బలహీనులనులుగా మారుస్తుంది. అంతేకాదు ప్రతిదాంట్లో తల్లిదండ్రుల నిర్ణయమే ఉంటే పిల్లలకు అసలు ఆలోచనాశక్తి అనేది స్తంభించిపోతుంది. కొట్టడం, తిట్టడం, మనిషి ఉనికితోనే భయం పెట్టడం వంటి పనులు పిల్లల్ని పిరికివాళ్లుగా మారుస్తాయి. ఆ ఒత్తిడి భరించలేక డిప్రెషన్, యాంగ్జైటీకి గురవ్వడమే కాకుండా చాలా సున్నిత స్వభావం కలవారు లేదా ఎక్కడికైనా పారిపోవాలనే మెంటాలిటీ కలిగిన వారిగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. పిల్లల్ని ఎప్పుడు నెత్తి మీద పెట్టుకుని మోస్తూ తిప్పితే వాళ్లకు నడవడం గురించి తెలీదు. నడవడమే తెలియని వాళ్లకు పడ్డప్పుడు లేవడం తెలీదు. అసలు పడని వాళ్లకు దెబ్బ ఎలా ఉంటుందో అర్థం కాదు. ఇవేమీ అర్థం కాక పసితనంలోనే చిన్న విషయాలకు కూడా ఆత్మహత్యల వరకూ వెళిపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

First Published:  3 July 2022 2:10 AM IST
Next Story