మహిళలంటే నాకు అపార గౌరవం.. జనసేనాని పవన్ కల్యాణ్
మహిళలంటే తనకు అపారమైన గౌరవమని, మగవారిని మహిళలే ముందుండి నడిపించాలని అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. సైద్ధాంతిక బలం ఉన్న ఆడపడుచులను వెతికి, వెలికి తీయాలనే బలమైన సంకల్పంతో రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించామని ఆయన చెప్పారు. శనివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన వీర మహిళల తొలి విడత రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. సమాజం బాగుపడాలంటే కచ్చితంగా మహిళలంతా చైతన్యవంతులు కావాలన్నారు. అప్పుడే మార్పు సాధ్యం.. ఇందుకోసమే ఈ […]
మహిళలంటే తనకు అపారమైన గౌరవమని, మగవారిని మహిళలే ముందుండి నడిపించాలని అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. సైద్ధాంతిక బలం ఉన్న ఆడపడుచులను వెతికి, వెలికి తీయాలనే బలమైన సంకల్పంతో రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించామని ఆయన చెప్పారు.
శనివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన వీర మహిళల తొలి విడత రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. సమాజం బాగుపడాలంటే కచ్చితంగా మహిళలంతా చైతన్యవంతులు కావాలన్నారు.
అప్పుడే మార్పు సాధ్యం.. ఇందుకోసమే ఈ తరగతులు మీతోనే మొదలుపెట్టాం.. మగవారు ఎంతమంది ఉన్నా స్త్రీ శక్తి వేరు.. మహిళాలోకం తలచుకుంటే ఏదైనా సాధించగలదు. మీ ఇంట్లోవారిని సమాజ సేవ చేసేలా మీరే ప్రోత్సహించండి అని సూచించారు.
ఈ శిక్షణ తరగతుల వల్ల సత్వరమే అద్భుత ఫలితాలు వస్తాయని చెప్పను కానీ అద్భుతానికి మొదటిమెట్టుగా ఇవి ఉపయోగపడతాయన్నారు. ఇల్లు బాగుపడాలంటే ఆ ఇంట్లో ఆడబిడ్డ చదువుకోవాలని, యుద్ధం ప్రారంభిస్తే గెలవాలనే పట్టుదల మహిళల్లో ఉంటుందని పవన్ అన్నారు.
చిన్నప్పుడు తాను చదువుకున్న ఖడ్గతిక్కన కథలో యుద్ధభూమి నుంచి పారిపోయి తిరిగి వచ్చిన వ్యక్తికి ఇంట్లో తల్లి, భార్య స్నానానికి నీళ్లు పెట్టి, పసుపు, గాజులు కూడా ఇస్తారని, కానీ అది అతడిని అవమానించినట్టు కాదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రణరంగం నుంచి పారిపోయి వచ్చిన సొంత వ్యక్తి అయినా స్త్రీ భరించలేదని, రణం ప్రారంభిస్తే గెలవాలనే పట్టుదల ఉన్న వారు మన మహిళలని అన్నారు.
నేను లలితా త్రిపుర సుందరిని ఆరాధిస్తాను.. భండాసురుడనే రాక్షసుడిని చంపడం ఇంద్రాది దేవతలకు సాధ్యం కాని పరిస్థితుల్లో లలితా త్రిపుర సుందరిని వారు వేడుకుంటారు.. ఆమె ప్రతిసృష్టి చేసి అన్ని శక్తులను విలీనం చేసుకుని ఆ రాక్షసుడిని అంతమొందిస్తుంది.. అందువల్లే ఆదిపరాశక్తిని అంతా గొప్పగా పూజిస్తారు అని పవన్ కల్యాణ్ వివరించారు.
తాను ప్రతి సమావేశంలో భారత్ మాతాకీ జై అని చేసే నినాదంలోనూ చుట్టూ ఉన్న తల్లులు, చెల్లెళ్ళు, ఆడపడుచులను గౌరవపూర్వకంగా స్మరిస్తూ ఆ నినాదాన్నిస్తానన్నారు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కూడా ఓ స్త్రీ మూర్తి ధీరత్వమేనని, మీలోంచి అంతటి బలమైన నాయకురాళ్లు రావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ఓ మంచి పనికి వెళ్లేముందు తల్లినో, ఇంటి ఆడబిడ్డనో ఎదురు రమ్మని కోరుతామని, అప్పుడే ఆ పని విజయవంతమవుతుందని నమ్ముతామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
అందుకే రాజకీయ శిక్షణ తరగతులను మీతోనే మొదలు పెట్టామన్నారు. ఎక్కడ స్త్రీ మూర్తి పూజింపబడుతుందో అక్కడ మంగళం తప్పక జరుగుతుందన్న నానుడిని ఆయన ప్రస్తావించారు. మగవారిలో మాటలు తప్ప ఆచరణ గడప దాటదని, అందువల్ల వారిని మీరే ముందుండి నడిపించాలని ఆయన మళ్ళీ కోరారు.