‘సిద్ధాంతం’ బూటకం! మోడీ ఒక సత్యం !
”ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్ల మంది వినాలా..? ఇదేనా ప్రజాస్వామ్యం..? రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కూడా బీజేపీతో యుద్ధం కొనసాగుతుంది. దేశానికి కేసీఆర్ వంటి నాయకుడు అవసరం. ఇప్పుడు చేసే పోరాటం భారత్ భవిష్యత్తు కోసం, మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చేసేది. కేసీఆర్ తో మరోసారి సమావేశమవుతా’’ అని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్న మాటలు అక్షర సత్యాలు. మోడీ చెబుతుంటే దేశంలోని 135 కోట్ల మంది ప్రజలు వినవలసిందే. అటువంటి […]
”ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్ల మంది వినాలా..? ఇదేనా ప్రజాస్వామ్యం..? రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కూడా బీజేపీతో యుద్ధం కొనసాగుతుంది. దేశానికి కేసీఆర్ వంటి నాయకుడు అవసరం. ఇప్పుడు చేసే పోరాటం భారత్ భవిష్యత్తు కోసం, మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చేసేది.
కేసీఆర్ తో మరోసారి సమావేశమవుతా’’ అని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్న మాటలు అక్షర సత్యాలు. మోడీ చెబుతుంటే దేశంలోని 135 కోట్ల మంది ప్రజలు వినవలసిందే. అటువంటి వాతావరణం ఒకటి ఎనిమిదేళ్లుగా పకడ్బందీగా ఏర్పడింది.
అయితే దక్షిణాదిలో ప్రజాభిప్రాయం వేరుగా ఉంది. కర్ణాటకలో బీజేపీ పాతుకుపోవడం వెనుక యడ్యూరప్ప నాలుగు దశాబ్దాల కాంట్రిబ్యూషన్ ఉంది. తమిళనాడు, కేరళలలో బీజేపీ అధికారంలోకి రావడం కల్ల. అందుకే తెలంగాణ మైదానాన్ని మోడీ ఎంపిక చేసుకున్నారు.
కానీ ఇక్కడి నాలుగు కోట్ల మంది ప్రజల ఆలోచనా విధానం భిన్నంగా ఉంటుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ సహా బీజేపీని కూడా ఆదరించే ఓటర్లున్నారు. అయితే అంతిమంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే నాయకుడు ఎవరన్న అంశంపై ‘ప్రజాతీర్పు’ఆధారపడి ఉంటుంది.
బీజేపీ సైద్ధాంతిక పునాది గల పార్టీ అన్నది గతం. అది చరిత్ర. ఒక వ్యక్తి ఆధారిత పార్టీగా మారిపోయి చాలాకాలమైపోయింది. సిద్ధాంత పరమైన రాజకీయాలపై వ్యక్తి కేంద్రీకృత రాజకీయాల ఆధిపత్యం ఏర్పడడం విశేషం.
మోడీ ఏకఛత్రాధిపత్యం సహించని వారి పట్ల ఆయన ఎంత కర్కశంగా వ్యవహరిస్తారో చెప్పడానికి చాలా ఉదాహరణలున్నాయి. కాగా బీజేపీ ఒక జాతీయ శక్తిగా ఆవిర్భవించడం వెనుక అయిదు దశాబ్దాల చరిత్ర ఉంది.
”దేశ విభజన జరగకముందే 14 సంవత్సరాల వయస్సులో ఆర్ఎస్ఎస్ లో చేరిన అద్వానీ మాతృభూమికి నిస్వార్థ సేవ చేసేందుకు ఎన్నో త్యాగాలు చేశారు”. అని ‘అద్వానీ ఆత్మకథ’కు ముందుమాటలో వాజ్ పేయి అన్నారు. బీజేపీని ఒక సిద్ధాంత ఆధారిత పార్టీగా మార్చేందుకు అద్వానీ తీవ్రంగా ప్రయత్నించారు. అద్వానీ లేకపోతే రామజన్మభూమి ఉద్యమం లేదు.
కానీ 1992లో బాబ్రీమసీదు కట్టడం కూల్చివేత తర్వాత నాలుగు రాష్ట్రాల శాసనసభలను రద్దు చేస్తే మూడు రాష్ట్రాల్లో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాలేకపోయింది. బైరాన్ సింగ్ షెఖావత్, కుశభావు థాక్రే లాంటి వారి వల్ల రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో బీజేపీ బలోపేతమైంది.
సైద్ధాంతిక నిర్మాణంతో ఏర్పడిన పార్టీ ఒక వ్యక్తి ఆకర్షణలో చిక్కుకోవడం ఆశ్చర్యం. వ్యక్తిగత ఆకర్షణపై ఆధారపడిన కారణంగా అతి తక్కువ కాలంలోనే ‘భజనపరుల’ పార్టీగా మారి, ముఠాలు, వర్గాలుగా ముక్కచెక్కలయి ఇప్పటి దుస్థితికి చేరుకుంది.
గుజరాత్లో మోడీ అధికారంలోకి రావడానికి ముందుగానే అక్కడ కాంగ్రెస్ వ్యతిరేక వాతావరణం ఉంది. మోడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారాన్ని స్థిరపరచుకోవడానికి, మూడు సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఎలాంటి పన్నాగాలు పన్నారో తెలిసిందే. పది సంవత్సరాల యూపీఏ పాలనపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలుసు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న వేళ మోడీకి కేంద్రంలో పగ్గాలు లభించాయి.
ఎనిమిదేండ్లలో నరేంద్రమోడీ బీజేపీని, ఆర్ఎస్ఎస్ ను మించిన నాయకుడుగా మారిపోవడం ఆసక్తికరం. సంస్థ కన్నా వ్యక్తి ప్రాధాన్యంపెరిగిపోయింది.
బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను కబళించేందుకు బీజేపీ కుట్రపూరిత ప్రయత్నాలు ఏమిటో మహారాష్ట్రతో మరోసారి రుజువయ్యింది. ప్రత్యర్థుల అణిచివేత కోసం దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్న తీరు విమర్శలపాలవుతోంది.
రాజకీయ ప్రత్యర్థులపై అనేక ఆయుధాలను, సామ దాన భేద దండోపాయాలను మోడీ ప్రయోగిస్తున్నారు. జాతీయ స్థాయిలో కేసీఆర్ తనకు ‘పోటీదారు’గా మారవచ్చునన్న ఆందోళన మోడీకి ఉంది. దక్షిణాది ముఖ్యమంత్రులలో కేసీఆర్ మాత్రమే ఎక్కువ ‘ప్రమాదకారి’ అని ప్రధాని భావిస్తుండవచ్చు. అందువల్లనే తెలంగాణను బీజేపీ టార్గెట్ చేసింది.
బీజేపీ మతపరమైన ఎజెండాను ఎదుర్కోగల సత్తా, దానికి సైద్ధాంతిక ప్రత్యామ్నాయాన్ని రూపొందించి ప్రజలను చైతన్య పరిచి తమ వైపునకు తిప్పుకోగలగిన శక్తి కేసీఆర్ కు ఉన్నట్టు యశ్వంత్ సిన్హాతో పాటు పలువురు రాజకీయ నాయకులు అంచనా వేస్తున్నారు.
అభివృద్ధి, ఆర్థిక విధానాల గురించి మాట్లాడకుండా ఆలయాల గురించి, ఇతర మతపరమైన అంశాలగురించి మాత్రమే బీజేపీ మాట్లాడుతోంది. లేకపోతే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా మరికొందరు నాయకులు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించడం ఎందుకు? జనంతో ఎట్లా కనెక్టు కావాలన్న ట్రిక్కులు బీజేపీ నాయకులకు బాగా తెలుసు. ఈ విషయం తెలిసినందు వల్లనే ‘ఒవైసీ’లను ఎట్లా ఉపయోగించాలో, భావోద్వేగాలకు ఆజ్యంపోసేలా బండి సంజయ్ లను ఎట్లా తయారుచేయాలో బీజేపీ హైకమాండ్ పరిశోధించింది.
బీజేపీకి ఆర్థిక, అభివృద్ధి ఎజెండాలో భాగంగానే ఇప్పటివరకూ ప్రవేశించని రంగాల్లో ఆర్థిక శక్తుల రంగ ప్రవేశానికి దోహదం చేస్తోంది. ఈ శక్తులకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నారు. వాటి అండతోనే బీజేపీ బలోపేతమవుతోంది. బీజేపీ దూకుడు రెండు విధాలా సాగుతోంది. కశ్మీర్, రామమందిరం, ముస్లిం వ్యతిరేకత, ఇతర భావోద్వేగాలతో బీజేపీ ఓటర్ల పునాదిని పటిష్ఠపరచుకుంటోంది. మాతృసంస్థ ‘సంఘ్ పరివార్’ ను సంతృప్తి పరుస్తూ, పార్టీకి అండగా నిలిచే ఆర్థిక శక్తులను పూర్తిగా విశ్వాసంలోకి తీసుకునే చర్యలను మోదీ చేబడుతున్నారు.
2016లో అస్సోంలో విజయం సాధించడం ద్వారా బీజేపీ ఈశాన్యంలోనూ విస్తరణను ప్రారంభించింది. మణిపూర్, త్రిపుర వంటి రాష్ట్రాలనూ కైవసం చేసుకోగలిగింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడి పోతుండడమే బీజేపీకి అనుకూల అంశం. బీజేపీ ‘ఆధిపత్యాన్ని’దెబ్బతీయాలంటే అందుకు అనుగుణమైన వ్యూహరచన, ప్రత్యామ్నాయ సైద్ధాంతిక బలం అవసరం.