ప్రేమించి పెళ్ళి చేసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్… హత్య చేసిన యువతి కుటుంబం
హైదరాబాద్ లోని కేపీహెచ్బీ (KPHB) కాలనీ రోడ్డు నంబర్ 1లో నివాసముండే నారాయణరెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఓ యువతిని ప్రేమించి ఏడాది క్రితం పెళ్ళి చేసుకున్నారు. ఆ పెళ్ళిని యువతి కుటుంబం వ్యతిరేకించింది. కొంత కాలం వారిద్దరూ కాపురం చేసిన తర్వాత యువతి కుటుంబ సభ్యులు యువతిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళారు. అయితే ఆ తర్వాత కూడా ఆ యువతి నారాయణరెడ్డితో ఫోన్ లో మాట్లాడటం చూసిన కుటుంబం, బందువులు నారాయణ రెడ్డిని ఎలాగైనా […]
హైదరాబాద్ లోని కేపీహెచ్బీ (KPHB) కాలనీ రోడ్డు నంబర్ 1లో నివాసముండే నారాయణరెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఓ యువతిని ప్రేమించి ఏడాది క్రితం పెళ్ళి చేసుకున్నారు. ఆ పెళ్ళిని యువతి కుటుంబం వ్యతిరేకించింది. కొంత కాలం వారిద్దరూ కాపురం చేసిన తర్వాత యువతి కుటుంబ సభ్యులు యువతిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళారు.
అయితే ఆ తర్వాత కూడా ఆ యువతి నారాయణరెడ్డితో ఫోన్ లో మాట్లాడటం చూసిన కుటుంబం, బందువులు నారాయణ రెడ్డిని ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా నారాయణ రెడ్డి కనిపించకుండా పోయాడు. దీనిపై జూన్ 30న కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైంది.
ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు నారాయణ రెడ్డి కాల్ డేటా ఆధారంగా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విచారణ చేయగా అనేక విషయాలు బహిర్గతమయ్యాయి.
శ్రీనివాసరెడ్డితో నారాయణరెడ్డికి ముందే పరిచయం ఉండటంతో జూన్ 29న వాళ్లిద్దరితో పాటు మరికొంతమంది ఖాజాగూడ వద్ద ఓ వైన్ షాపులో మద్యం కొనుగోలు చేసి ఓ చోట తాగారు. అనంతరం నారాయణరెడ్డిని గొంతు నులిమి హతమార్చి సంగారెడ్డి జిల్లా జిన్నారం అటవీ ప్రాంతంలో పెట్రోల్ పోసి తగలబెట్టారు.
శ్రీనివాస రెడ్డి ఇచ్చిన సమాచారంతో సగం కాలిన నారాయణ రెడ్డి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
యువతి కుటుంబసభ్యులే శ్రీనివాస రెడ్డి ద్వారా నారాయణరెడ్డిని హత్య చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై పోలీసులు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.