ఏకైక టెస్టులో టీమ్ ఇండియా 416 ఆలౌట్.. జడేజా సెంచరీ
ఇంగ్లాండ్‌లో ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత జట్టు మెరగైన స్కోర్ సాధించింది. రెండో రోజు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీతో చెలరేగడంతో టీమ్ ఇండియా 416 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. తొలి రోజు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 95 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, రవీంద్ర జడేజా జట్టును ఆదుకున్నారు. రిషబ్ పంత్ తన సహజ శైలిలో వేగంగా […]
ఇంగ్లాండ్‌లో ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత జట్టు మెరగైన స్కోర్ సాధించింది. రెండో రోజు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీతో చెలరేగడంతో టీమ్ ఇండియా 416 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. తొలి రోజు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 95 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, రవీంద్ర జడేజా జట్టును ఆదుకున్నారు.
రిషబ్ పంత్ తన సహజ శైలిలో వేగంగా ఆడాడు. టెస్టు ఇన్నింగ్స్‌లా కాకుండా.. టీ20ని తలపించేలా బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కేవలం 111 బంతుల్లో 146 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజాతో కలసి ఆరో వికెట్‌కు ఏకంగా 222 పరుగులు జోడించాడు. అయితే జో రూట్ బౌలింగ్‌లో పంత్ పెవీలియన్ చేరాడు. పంత్ అవుటైన తర్వాత భారత జట్టు పరుగుల వేగం మందగించింది. రవీంద్ర జడేజా టెయిలెండర్లతో కలసి బాధ్యతాయుతంగా ఆడాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది.
రెండో రోజు 338/7 ఓవర్ నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఆచితూచి ఆడింది. రవీంద్ర జడేజాకు మహ్మద్ షమీ (16) సహకారం అందించాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా 183 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ కలసి ఎనిమిదో వికెట్‌కు కీలకమైన 48 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే రవీంద్ర జడేజా (104), మహ్మద్ షమీ (16) స్వల్ప వ్యవధిలో పెవీలియన్ చేరడంతో భారత జట్టు 9 వికెట్లకు 375 పరుగుల వద్ద నిలిచింది.
భారత జట్టు 400 పరుగుల స్కోర్ దాటుతుందా లేదా అని అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఈ టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జస్ప్రిత్ బుమ్రా దూకుడుగా ఆడాడు. కేవలం 16 బంతుల్లో 31 పరుగులు చేశాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన 84వ ఓవర్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సులు, ఒక సింగిల్‌లో పాటు ఐదు వైడ్లు కూడా జత అయ్యాయి. ఈ ఓవర్‌లో బుమ్రా 35 పరుగులు రాబట్టారు. అయితే మరుసటి ఓవర్‌లో మహ్మద్ సిరాజ్ (1) అవుటవడంతో భారత జట్టు 416 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 100లోపే ఐదు వికెట్లు కోల్పోయినా 400+ పరుగులు చేయడం టీమ్ ఇండియాకు ఇది మూడో సారి. జేమ్స్ అండర్సన్ 5 వికెట్లతో చెలరేగాడు.
టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ : 416 ఆలౌట్
రిషబ్ పంత్ 146, రవీంద్ర జడేజా 104, బుమ్రా 31 నాటౌట్
తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్:
ఏకైక టెస్టులో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ అలెక్స్ లీస్ (6) ఇన్నింగ్స్ మూడో ఓవర్ చివరి బంతికి బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వర్షం రావడంతో ఆటను తాత్కాలికంగా నిలిపేశారు. ప్రస్తుతం జాక్ క్రాలీ (7), ఓలీ పోప్ (0) క్రీజులో ఉన్నారు.