ప్రధాని గో బ్యాక్ అంటూ… తెలంగాణలో నిరసనలు
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీకి తెలంగాణలో నిరసనలు ఎదురయ్యాయి. ఒకవైపు సోషల్ మీడియాలో బైబై మోదీ అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అయిన నేపథ్యంలో మోదీకి వ్యతిరేకంగా పలు సంఘాలు రోడ్డెక్కాయి. అధికారంలోకి రాగానే వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ MRPS, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా […]
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీకి తెలంగాణలో నిరసనలు ఎదురయ్యాయి. ఒకవైపు సోషల్ మీడియాలో బైబై మోదీ అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అయిన నేపథ్యంలో మోదీకి వ్యతిరేకంగా పలు సంఘాలు రోడ్డెక్కాయి.
అధికారంలోకి రాగానే వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ MRPS, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా AITUC పలు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ దగ్గర్లోని ధర్మోజీగూడ వద్ద జాతీయరహదారిపై MRPS కార్యకర్తలు నిరసన తెలిపారు. రోడ్డు మధ్యలో టైర్లు కాల్చిన MRPS కార్యకర్తలు రోడ్డు మీదే బైటాయించారు. ఎస్సీ వర్గీకరణ హామీని తుంగలో తొక్కారని మోదీపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వీరి ప్రదర్శన వల్ల చాలా సేపు జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఖమ్మం జిల్లాలో కూడా MRPS సడక్ బంద్ నిర్వహించింది. నాయకన్ గూడ వద్ద ఖమ్మం-సూర్యాపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దాంతో రహదారిపై ట్రాఫిక్ జాం ఏర్పడింది. అధికారంలోకి రాగానే వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిన బీజేపీ.. ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చకపోవడంతో నిరసనకు దిగారు.
మరో వైపు కరీంనగర్‌లోని కమాన్ చౌక్ లో AITUC నిరసన ప్రదర్శన నిర్వహించింది. కేంద్రం తీసుక వచ్చిన నూతన కార్మిక చట్టానికి, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా AITUC నాయకులు, కార్యకర్తలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా, గో బ్యాక్ మోదీ అంటూ నినాదాలు చేశారు.
ఇక రాష్ట్రంలోని మరొ కొన్నిప్రాంతాల్లో ఆర్థిక నేరగాళ్ల వేషంలో ఉన్న కొందరు ‘మేము బ్యాంకులను మాత్రమే దోచుకుంటాం మీరు మొత్తం దేశాన్నే దోచుకుంటున్నారు’ అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు. ఆ ప్లకార్డులపై బై బై మోదీ అని కూడా రాసి ఉంది.