Telugu Global
National

వ్యాపారం చేసుకుంటే టీడీపీ వాళ్లకు ఏం నొప్పి? : వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ నేతలు తనపై లేనిపోని అబద్దపు ఆరోపణలు చేస్తూ.. తిరిగి వాళ్లే దేవుడి దగ్గర ప్రమాణాలకు పిలుస్తున్నారని శ్రీధర్ రెడ్డి అన్నారు. శనివారం మీడియా మీట్‌ ఏర్పాటు చేసి టీడీపీ వాళ్లపై ఆయన నిప్పులు చెరిగారు. అసలు టీడీపీ వాళ్లకు ప్రమాణాలు చేసే అర్హత ఉందా అంటూ నిలదీశారు. తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం పెద్ద నేరమైనట్లు టీడీపీ ప్రచారం చేస్తోందన్నారు. […]

వ్యాపారం చేసుకుంటే టీడీపీ వాళ్లకు ఏం నొప్పి? : వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి
X

నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ నేతలు తనపై లేనిపోని అబద్దపు ఆరోపణలు చేస్తూ.. తిరిగి వాళ్లే దేవుడి దగ్గర ప్రమాణాలకు పిలుస్తున్నారని శ్రీధర్ రెడ్డి అన్నారు. శనివారం మీడియా మీట్‌ ఏర్పాటు చేసి టీడీపీ వాళ్లపై ఆయన నిప్పులు చెరిగారు. అసలు టీడీపీ వాళ్లకు ప్రమాణాలు చేసే అర్హత ఉందా అంటూ నిలదీశారు.

తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం పెద్ద నేరమైనట్లు టీడీపీ ప్రచారం చేస్తోందన్నారు. ఎమ్మెల్యేగా ఉంటే వ్యాపారాలు చేయకూడదా అని ప్రశ్నించారు. రాజకీయ దందాలు చేస్తే తప్పుగానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేంటని ఆయన అన్నారు. వ్యాపారస్తులను వేధిస్తే తప్పుగానీ.. వ్యాపారం చేసుకుంటే తప్పేంటని అన్నారు.

నెల్లూరు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో తనకు భాగస్వామ్యం ఉన్న మాట వాస్తవమే అన్నారు. కేవలం నెల్లూరు రూరల్‌లో మాత్రమే కాకుండా సూళ్లూరుపేట, తిరుపతి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, తిరువళ్లూరు ప్రాంతాల్లో తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నట్లు శ్రీధర్ రెడ్డి స్పష్టంచేశారు. తాను ఏనాడూ ఏ వ్యాపారిని బెదిరించలేదని.. కేవలం తన వ్యాపారం తాను చేసుకుంటున్నానని అన్నారు. రియల్ ఎస్టేట్ కాకుండా కాంట్రాక్టు పనులు కూడా చేస్తుంటానని ఆయన వెల్లడించారు.

నెల్లూరు సిటీ టీడీపీ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి కొంత మంది వ్యాపారులను చందాల పేరుతో పీడిస్తున్నారు. బాదుడే బాదుడు అంటూ రక్తం వచ్చేలా వ్యాపారులను పీల్చి పిప్పి చేస్తున్నాడు. శ్రీనివాసులరెడ్డి బాధితులంతా తన వద్దకు వచ్చి బాధపడ్డారని శ్రీధర్ రెడ్డి చెప్పారు. వ్యాపారుల నుంచి రాజకీయ నాయకులు చందాలు తీసుకోవడం సాధారణమే.. కానీ మరీ ఇలా పీడించుకొని తినడం భావ్యం కాదని ఆయన అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తాను వెయ్యి మందికి పైగా కార్యకర్తలకు వ్యక్తిగతంగా సాయం చేశానన్నారు. మరో 1000 మందికి సాయం చేస్తానని మాట కూడా ఇచ్చానని చెప్పారు.

413 మంది చిన్నారులకు ఉచితంగా విద్యను అందిస్తున్నాను. ఇద్దరు విద్యార్థులకు సివిల్స్ కోచింగ్ ఇప్పిస్తున్నానని శ్రీధర్ రెడ్డి చెప్పారు. రాజకీయాల కోసం ఆస్తులు అమ్ముకున్నాను. కానీ తాను ఎప్పుడూ తప్పు చేయలేదని అన్నారు. ఇప్పుడు అమ్ముకోవడానికి పెద్దగా ఆస్తులు కూడా లేవని శ్రీధర్ రెడ్డి చెప్పారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేయకూడదనే ఇన్నాళ్లూ నోర్మూసుకొని ఉన్నానని.. తాను నోరు విప్పితే చాలా విషయాలు బయటపడతాయని ఆయన హెచ్చరించారు.

చేతక్ మీద తిరిగిన శ్రీధర్ రెడ్డి ఇవ్వాళ ఎంతో ఎదిగిపోయాడని అంటున్నారు. కానీ తాను చేతక్‌ కంటే ముందు సైకిల్ మీద కూడా తిరిగానని ఆయన చెప్పారు. తాను ఏనాడూ లగ్జరీ కారును వాడలేదని.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొన్న కారునే ఇప్పటికీ వాడుతున్నానని శ్రీధర్ రెడ్డి అన్నారు. ఇకపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోనని శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు.

First Published:  2 July 2022 12:55 PM IST
Next Story