Telugu Global
NEWS

ఎమ్మెల్యేల మొర ఆలకించిన జగన్.. అభివృద్ధి నిధులకు గ్రీన్ సిగ్నల్?

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యేలకు భారీగా నిధులు కేటాయించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఇటీవల ‘గడప గడపకు ప్రభుత్వం’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. అందరు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను ఈ ప్రోగ్రాం ద్వారా పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ చోట్ల రోడ్లు, డ్రైనేజీల మీదే ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాల ద్వారా లబ్ది పొందాం.. కానీ ఈ రోడ్లు, […]

ఎమ్మెల్యేల మొర ఆలకించిన జగన్.. అభివృద్ధి నిధులకు గ్రీన్ సిగ్నల్?
X

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యేలకు భారీగా నిధులు కేటాయించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఇటీవల ‘గడప గడపకు ప్రభుత్వం’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. అందరు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను ఈ ప్రోగ్రాం ద్వారా పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ చోట్ల రోడ్లు, డ్రైనేజీల మీదే ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాల ద్వారా లబ్ది పొందాం.. కానీ ఈ రోడ్లు, డ్రైనేజీలు సక్రమంగా లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యేలను నిలదీశారు.

ఇక అన్ని నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న ప్లీనరీల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారు. ఒంగోలు జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఒక్క బటన్ నొక్కి ప్రజలకు నేరుగా డబ్బులు వేస్తున్నారు. అలాగే ముఖ్యమైన పథకాలు అమలు చేస్తున్నారు. దీని వల్ల జగన్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. కానీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా మాత్రం మాకు ఏమీ లాభం లేకుండా పోయింది. స్థానిక ప్రజలు ఎన్నో రకాల సమస్యలను మా దృష్టికి తెస్తున్నారు. రోడ్లు బాగుచేయమని అడుగుతున్నారు. కానీ, ఏమీ చేయలేకపోతున్నామని ఆయన వాపోయారు.

మరి కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తాము ఏ పని చేయలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. ఈ విషయాలు సీఎం జగన్ వరకు చేరినట్లు తెలుస్తుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ కూడా పనిచేసే క్యాడర్ కొరకు ఏదో ఒక పథకాన్ని తీసుకొని రావల్సిన ఆవశ్యకత ఉందన్నారు. త్వరలోనే ఆ పథకాన్ని అమలు చేస్తామని కర్నూలులో జరిగిన ప్లీనరీలో వ్యాఖ్యానించారు.

కాగా, నియోజకవర్గ అభివృద్ధి నిధుల పేరుతో ప్రతీ ఎమ్మెల్యేకు రూ. 12 కోట్లు మంజూరు చేయాలని జగన్ భావిస్తున్నారు. ముందుగా ఎమ్మెల్యేలకు రూ. 2 కోట్లు ఇవ్వనున్నారు. ఈ నిధులు పూర్తిగా ఎమ్మెల్యే విచక్షణా అధికారంతోనే అభివృద్ధికి ఖర్చు చేయనున్నారు. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ రిపేర్లకు ఈ నిధులు ఉపయోగించడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. మిగిలిన రూ. 10 కోట్లను రెండు విడతలుగా ఇవ్వనున్నారు. ఇవి కూడా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనికైనా వినియోగించే అవకాశం ఉంది.

ఎలాంటి అవకతవకలు లేకుండా.. పూర్తిగా అభివృద్ధి పనులకే ఎమ్మెల్యేల ద్వారా నిధులు ఖర్చు పెట్టించాలని జగన్ అనుకుంటున్నారు. దీని వల్ల స్థానిక సమస్యలు తీరిపోవడంతో పాటు.. ఎమ్మెల్యేల గ్రాఫ్ కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. అవసరం అయితే ఎమ్మెల్యేల కోరిక మేరకు మరి కొంత ఎక్కువ మొత్తం కూడా ఇవ్వడానికి జగన్ ఓకే చెప్పారని సమాచారం. రాబోయే రెండేళ్లు కీలకం కాబట్టి.. స్థానిక ప్రజల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత లేకుండా చేయడానికి ఈ నిధులు కీలకం కానున్నాయి. ఈ నిధుల విడుదలకు ముందు సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్యేలతో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.

First Published:  2 July 2022 12:36 PM IST
Next Story