సీటు షిండేకు..స్టీరింగ్ ఫడ్నవీస్ కు !
మహారాష్ట్ర లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఉద్దవ్ ఠాక్రే రాజీనామా..శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి కావడం..ఉపముఖ్యమంత్రిగా పనిచేసేందుకు మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అంగీకరించడం ఆసక్తికరం. మొత్తం మీద శివసేనను తుదముట్టించాలనే బిజెపి వ్యూహం స్పష్టమవుతోంది. మొదట ఫడ్నవీస్ సీఎం అవుతారనే అంతా ఊహించారు. కానీ బిజెపి అధిష్టానం దీర్ఘ దృష్టితో ఆలోచించింది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాలు రంగంలోకి దిగారు. ఫడ్నవీస్ ను నేరుగా ముఖ్యమంత్రిని […]
మహారాష్ట్ర లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఉద్దవ్ ఠాక్రే రాజీనామా..శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి కావడం..ఉపముఖ్యమంత్రిగా పనిచేసేందుకు మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అంగీకరించడం ఆసక్తికరం. మొత్తం మీద శివసేనను తుదముట్టించాలనే బిజెపి వ్యూహం స్పష్టమవుతోంది.
మొదట ఫడ్నవీస్ సీఎం అవుతారనే అంతా ఊహించారు. కానీ బిజెపి అధిష్టానం దీర్ఘ దృష్టితో ఆలోచించింది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాలు రంగంలోకి దిగారు. ఫడ్నవీస్ ను నేరుగా ముఖ్యమంత్రిని చేస్తే ఎదురయ్యే పరిణామాలను ఊహించింది. ఇది శివసేన కేడర్ లో అసంతృప్తి, నిరసనలకు దారి తీసే అవకాశం ఉందని భావించింది.
పైగా అధికారం కోసమే ఇదంతా చేశారని, పదవీ లాలసతోనే శివసేనలో తిరుగుబాటును ప్రోత్సహించారనే అపవాదును బిజెపి మోయాల్సి ఉంటుందని గ్రహించింది ( అది వాస్తవమైనా). అందుకే షిండేను ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టి వెనక నుంచి కార్యక్రమాలను చక్కబెట్టవచ్చని వ్యూహం పన్నింది. తిరుగుబాటు నేత షిండే వర్గంతో మంతనాలు దగ్గర్నుంచి, అధిష్టానంతో చర్చలు, గవర్నర్ ను కలిసే వరకూ ఫడ్నవీస్ కీలక పాత్ర పోషించారు. ఇదంతా తానే ముఖ్యమంత్రిని అవుతాననే భావనతోనే చాలా చురుకుగాపనిచేశారు.
ఎందుకు తప్పించింది..?
ప్రస్తుత సంక్షుభిత రాజకీయ పరిణామాలు, గతంలో ముఖ్యమంత్రుల ఎంపికలో బిజెపి ఎదుర్కొన్న అనుభవాల దృష్ట్యా నేరుగా ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి పక్కకు తప్పించింది. దీంతో ఫడ్నవీస్ కంగు తిన్నారు.
మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ (బ్రాహ్మణుడు), జాట్‌లు అధికంగా ఉన్న హర్యానాలో పంజాబీ ఖత్రీ మనోహర్ లాల్ , ఒబిసి అయిన రఘువరదాస్ ను జార్ఖండ్ లో నియమించారు. అయితే వారికి మాస్ శ్రేణుల్లో ఉన్న ఫాలోయింగ్ వల్ల కాదు కానీ కేంద్ర అధిష్టానంతో వారికున్న సాన్నిహిత్యం వల్లనే అని పార్టీలో చెప్పుకుంటారు.
వీరు పదవిలోకి వచ్చిం తర్వాత రాష్ట్రంలో ప్రజాదరణ, కుల మద్దతు ఉన్న ఇతర నాయకుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారని, వీరి వల్ల పార్టీకి ముప్పు వాటిల్లవచ్చని అధిష్టానం గ్రహించింది. అందుకనే ఈ విథానాన్ని పునరాలోచించుకుంటోంది.
ఈ కారణాలే కాక మహారాష్ట్రలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రిని చేయలేదు. అయితే, షిండేకు ముఖ్యమంత్రి పీఠం అప్పగించి కళ్ళు మూసుకుని కూర్చోవాలని కూడా బిజెపి అనుకోవడంలేదు. పదవి తన చేతిలో లేకపోయినా చక్రం తిప్పాలనే ఆలోచనను వీడలేదు. షిండే సీనియర్ మంత్రి అయినా, ముఖ్యమంత్రిగా పాలనా అనుభవం లేనందున ఆయనకు సహకరించేందుకు, నడిపించేందుకు (?) ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఉండాలని అధిష్ఠానం భావించింది.
ఈ నేపధ్యంలోనే ఫడ్నవీస్ అంతకు ముందు మాట్లాడుతూ ..”నేను ప్రభుత్వానికి వెలుపల దూరంగా ఉంటాను. , అయినా కొత్త ప్రభుత్వానికి అన్ని విషయాల్లో సహకరిస్తాను. గత రెండున్నరేళ్లలో ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి ప్రారంభించేందుకు నేను చేయగలిగినదంతా చేస్తాను . ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపేందుకు సహకరిస్తాను ” అని అన్నారు.
పరోక్షంగా ఆయనకే పదవి.. దీనిపై కేంద్ర నాయకత్వం వెంటేనే స్పందించింది. జాతీయ అధ్యక్షుడు నడ్డా ఫోన్ చేసి ఫడ్నవీస్ తో సంప్రదించి ప్రభుత్వంలో చేరాలని కోరారు. అది ఫలించినట్టు కనబడక పోవడంతో నేరుగా ప్రధాని మోడీ, అమిత్ షా కూడా ఆయనతో మాట్లాడి ఎట్టకేలకు ప్రభుత్వంలో చేరేలా ఒప్పించ గలిగారు.
అనంతరం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగం కావడానికి ఫడ్నవీస్ అంగీకరించారని చెప్పారు. ‘బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అభ్యర్థన మేరకు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఫడ్నవీస్ నిర్ణయం మహారాష్ట్ర ప్రజల పట్ల ఆయనకున్న సేవా భావాన్ని తెలియజేస్తుంది’ అని షా పేర్కొన్నారు.
అధినాయకత్వంతో జరిగిన చర్చల్లో ఫడ్నవీస్ ను ఉప ముఖ్యమంత్రిగా ఉండాలని కోరారు. అధినాయకత్వంతో జరిగిన చర్చల్లో ఫడ్నవీస్ ను ఉపముఖ్యమంత్రిగా ఉండాలని ఒప్పించడం వెనక బిజెపి ఆలోచన స్టీరింగ్ ను పరోక్షంగా ఆయన చేతిలో పెట్టినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు.