కష్టాల్లో టీమ్ ఇండియా.. ఏకైక టెస్టుకు వర్షం అడ్డంకి
ఇండియా-ఇంగ్లాండ్ మధ్య రీషెడ్యూల్ అయిన ఏకైక టెస్టు ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించలేకపోయారు. రోహిత్ శర్మ గైర్హాజరీలో.. శుభ్‌మన్‌గిల్, చతేశ్వర్ పుజారా ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఓపెనర్ గిల్ తనదైన శైలిలో కొన్ని అద్బుతమైన షాట్లు కొట్టాడు. నాలుగు బౌండరీలు బాది మంచి టచ్‌లో కనిపించిన గిల్‌ను ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ బోల్తా కొట్టించాడు. పిచ్‌పై పచ్చిక ఉండటంతో, దాన్ని ఉపయోగించుకొని బంతిని స్వింగ్ చేస్తూ అద్బుతంగా […]
ఇండియా-ఇంగ్లాండ్ మధ్య రీషెడ్యూల్ అయిన ఏకైక టెస్టు ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించలేకపోయారు. రోహిత్ శర్మ గైర్హాజరీలో.. శుభ్‌మన్‌గిల్, చతేశ్వర్ పుజారా ఇన్నింగ్స్ ప్రారంభించారు.
ఓపెనర్ గిల్ తనదైన శైలిలో కొన్ని అద్బుతమైన షాట్లు కొట్టాడు. నాలుగు బౌండరీలు బాది మంచి టచ్‌లో కనిపించిన గిల్‌ను ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ బోల్తా కొట్టించాడు. పిచ్‌పై పచ్చిక ఉండటంతో, దాన్ని ఉపయోగించుకొని బంతిని స్వింగ్ చేస్తూ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. అండర్సన్ బౌలింగ్‌లో గిల్ (17) స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు.
గత కొంత కాలంగా కౌంటీల్లో రాణిస్తూ సెంచరీల మీద సెంచరీలు బాదిన చతేశ్వర్ పుజారా మరోసారి టెస్టు మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేశాడు. హనుమ విహారీతో కలసి ఇన్నింగ్స్ చక్కదిద్దుతాడని భావించినా.. పుజార మాత్రం అండర్సన్ అండర్సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. బ్రాడ్ బౌలింగ్‌లో అంపైర్ అవుట్ ఇచ్చినా.. డీఆర్ఎస్ ఉపయోగించుకొని బతికిపోయిన పుజారా.. ఆ తర్వాత అండర్సన్ బౌలింగ్‌లో జాక్ క్రాలీకి క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. పుజారా అవుటైన కాసేపటికే వర్షం కురవడంతో అంపైర్లు లంచ్ విరామం ప్రకటించారు.
ఇక వర్షం తగ్గిన తర్వాత భారత జట్టు రెండో సెషన్ కొనసాగిస్తోంది. ఇన్నింగ్స్ 23వ ఓవర్ రెండో బంతికి హనుమ విహారి అవుటయ్యాడు. క్రీజులో కుదురుకున్నాడని భావించిన విహారిని మాటీ పాట్స్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. విహారి 53 బంతుల్లో 20 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో భారత జట్టు 64 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
భారత జట్టు ప్రస్తుతం 22.2 ఓవర్లలో 64/3 స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ (6), రిషబ్ పంత్ (0) క్రీజులో ఉన్నారు. గత ఏడాది వాయిదా పడిన సిరీస్‌లో భారత జట్టు 2-1 ఆధిక్యంలో ఉన్నది. ఈ మ్యాచ్ గెలిచినా, డ్రా చేసుకున్న సిరీస్ భారత జట్టు వశం అవుతుంది. ఒక వేళ ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ డ్రాగా ముగియనున్నది. ఇప్పుడు బ్యాటింగ్ భారమంతా కోహ్లీ, పంత్ పైనే ఉన్నది.