Telugu Global
National

అప్పుడే షిండే ప్రభుత్వ దూకుడు.. ఉధ్ధవ్ సర్కార్ నిర్ణయం రద్దు

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగాపదవి చేబట్టి ఒక్కరోజైనా గడిచిందో, లేదో అప్పుడే నూతన సీఎం ఏక్ నాథ్ షిండే.. తన పవర్ చూపనారంభించారు. లోగడ ఉధ్దవ్ థాక్రే ప్రభుత్వం తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో ఒకదాన్ని మార్చిపారేశారు. ముంబైలోని ఆరే కాలనీలో మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టుకు సంబంధించి నాటి సర్కార్ పాటించిన విధానాన్ని మార్చేస్తూ కోర్టులో ఓ అఫిడవిట్ ను దాఖలు చేయవలసిందిగా అడ్వొకేట్ జనరల్ అషుతోష్ కుంభకోనిని ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. 2019 లో నాడు దేవేంద్ర ఫడ్నవీస్ […]

eknath shinde
X

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగాపదవి చేబట్టి ఒక్కరోజైనా గడిచిందో, లేదో అప్పుడే నూతన సీఎం ఏక్ నాథ్ షిండే.. తన పవర్ చూపనారంభించారు. లోగడ ఉధ్దవ్ థాక్రే ప్రభుత్వం తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో ఒకదాన్ని మార్చిపారేశారు.

ముంబైలోని ఆరే కాలనీలో మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టుకు సంబంధించి నాటి సర్కార్ పాటించిన విధానాన్ని మార్చేస్తూ కోర్టులో ఓ అఫిడవిట్ ను దాఖలు చేయవలసిందిగా అడ్వొకేట్ జనరల్ అషుతోష్ కుంభకోనిని ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. 2019 లో నాడు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది.

అప్పట్లో ఇది అత్యంత వివాదాస్పదమైంది. ఈ కాలనీలో మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టును చేపట్టేందుకు అనువుగా ఇక్కడి చెట్లను పడగొట్టడానికి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అనుమతిని నగర మెట్రో రైల్ కార్పొరేషన్ కోరింది. అయితే ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్న చెట్లను పడగొట్టిన పక్షంలో , ఆహ్లాదకరమైన వాతావరణాన్నిభంగ పరచినట్టవుతుందని, ఇది అసలు ముంబైకి పచ్చని ‘ఊపిరితిత్తి’ వంటిదని ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు ఇందుకు అభ్యంతరం చెప్పారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ వీరితో బాటు స్థానిక ప్రజలు కూడా నాడు ఆందోళనలు చేశారు. పలువురు ప్రముఖులు ఈ ప్రదేశంతో తమకు దశాబ్దాల తరబడి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

నగరంలో.. ముఖ్యంగా పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలు జరిగాయి. కానీ మెట్రో కార్ షెడ్ పరిధిలోనికి వచ్చే ఈ ప్రాంతం బయోడైవర్సిటీ కేటగిరీ కిందకు రాదని, లేదా ఇది అటవీ భూమి కూడా కాదని నాటి సీఎం ఫడ్నవీస్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల కార్బన్ కాలుష్యం తగ్గుతుందని అన్నారు.

ఆ తరువాత సంవత్సరాంతంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న దృష్ట్యా ఈ సమస్యపై శివసేనకు, బీజేపీకి మధ్య విభేదాలు తలెత్తాయి. అనంతరం ఉద్దవ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఈ ప్రాజెక్టును కంజుర్ మార్గ్ కి షిఫ్ట్ చేయాలని ఆ ప్రభుత్వం నిర్ణయించగా దీన్ని సవాలు చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2020 లో బాంబేహైకోర్టుకెక్కింది. దీంతో కోర్టు ఈ సమస్యపై స్టే విధించింది.

అప్పటినుంచి ఈ ప్రాజెక్టు వ్యవహారం పెండింగులో ఉంటూ వచ్చింది. చివరకు గత ఏడాది దీనిపై నిర్ణయం తీసుకున్న ఉద్ధవ్ ప్రభుత్వం.. హడావుడిగా చేపట్టే ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పనుల వల్ల అవి వ్యర్థమే అవుతాయని, అసలైన అభివృద్ధి జరగదని భావించింది.

ఫలితంగా మెట్రో కార్ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు షిండే ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. లోగడ ఫడ్నవీస్ సర్కార్ తీసుకున్న నిర్ణయమే సరైనదని భావించినట్టు కనబడుతోంది. దీనికి గో హెడ్ అని షిండే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

ముంబై మెట్రో ప్రాజెక్టు పనులు మళ్ళీ ప్రారంభమవుతాయని బీజేపీ నేత కిరిత్ సోమయా ట్వీట్ చేసేశారు కూడా.. ఆరే కాలనీలో తిరిగి స్థానికుల నిరసనలు, ఆందోళనలు తలెత్తుతాయేమో చూడాలి.

First Published:  1 July 2022 5:40 AM IST
Next Story