ఆటో డ్రైవర్ టూ సీఎం చైర్.. ఇదే షిండే ప్రస్థానం
ఏక్‌నాథ్ షిండే.. ప్రస్తుతం దేశమంతటా ఈ పేరు మార్మోగిపోతోంది. గత కొన్ని రోజులుగా శివసేన పార్టీ ఎమ్మెల్యేలను అస్సోంలో ఉంచి.. మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాడు. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలక పాత్ర పోషించిన నాటి నుంచి.. తాజాగా మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టే వరకు ఆయన రాజకీయ చతురత గురించి అందరూ చర్చించుకుంటున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో బాల్ ఠాక్రే కుటుంబాన్ని ఎదిరించి ఏ శివసైనికుడూ మాట్లాడడు. అలాంటిది ఏకంగా ఆ […]
ఏక్‌నాథ్ షిండే.. ప్రస్తుతం దేశమంతటా ఈ పేరు మార్మోగిపోతోంది. గత కొన్ని రోజులుగా శివసేన పార్టీ ఎమ్మెల్యేలను అస్సోంలో ఉంచి.. మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాడు. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలక పాత్ర పోషించిన నాటి నుంచి.. తాజాగా మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టే వరకు ఆయన రాజకీయ చతురత గురించి అందరూ చర్చించుకుంటున్నారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో బాల్ ఠాక్రే కుటుంబాన్ని ఎదిరించి ఏ శివసైనికుడూ మాట్లాడడు. అలాంటిది ఏకంగా ఆ కుటుంబాన్ని పక్కకు పెట్టి శివసేనను నిట్టనిలువునా చీల్చి.. ఏకంగా ముఖ్యమంత్రి అవడమంటే మాటలు కాదు. అసలు ఎవరు ఈ ఏక్‌నాథ్ షిండే.. ఆయన ప్రస్థానం ఏంటి అని అందరూ గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు.
మహారాష్ట్రలోని సతారాకు చెందిన షిండే కుటుంబం జీవనోపాధి కోసం ముంబైని ఆనుకొని ఉన్న థానేకు వలస వచ్చింది. అక్కడి మంగళా స్కూల్‌లో ఏక్‌నాథ్ 11వ తరగతి వరకు చదువుకున్నాడు. అయితే ఆర్థిక కారణాల వల్ల ఆపైన చదవలేదు. కుటుంబం గడవడానికి టెంపో డ్రైవర్‌గా పనిచేశారు. చాలా కాలం ఆటో నడిపించారు. అప్పుడే థానే ప్రాంతంలో శివసేనకు బలమైన రాజకీయ నాయకుడు ఆనంద్ దిఘేతో ఏక్‌నాథ్‌కు పరిచయం అయ్యింది.
ఒకవైపు ఆటో నడుపుకుంటూనే ఆనంద్ దిఘే అనుచరుడిగా మారిపోయాడు. ఆనంద్ దిఘేకు చాలా పాపులారిటీ ఉండేది. థానే జిల్లాలోని నాలుగైదు పార్లమెంటు, 10 అసెంబ్లీ స్థానాల్లో అతడు ఏం చెప్తే అదే వేదం. పోలీసులు, కోర్టులు కూడా పరిష్కరించలేని సమస్యలను ఆనంద్ దిఘే దర్బార్‌లో పరిష్కారం అయ్యేవి. రైతులు, ఆదివాసీలు, పేదలు, సామాన్య ప్రజలు ఎంతో మంది ఆ దర్బార్‌కు వచ్చి తమ సమస్యలు చెప్పుకునే వారు.
ఆయనకు విద్యార్థులంటే చాలా ఇష్టం. స్కూల్ అడ్మిషన్లు ఇప్పించేవాడు. యువతను పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయమని ప్రోత్సహించేవాడు. ఆయన అండదండలతో పోలీసు, ఇతర అధికారులు అయిన వారు చాలా మంది ఉండేవారు. ఆ తర్వాత కాలంలో అతడికి అండగా నిలబడేవారు. ఈ క్రమంలో ఏక్‌నాథ్ షిండే ఇద్దరు పిల్లలు ఒక బోటు ప్రమాదంలో మరణించారు. దీంతో షిండే చాలా కుమిలిపోయాడు. బయటకు వచ్చేవాడు కాదు. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు.
విషయం తెలిసి ఆనంద్ దిఘే స్వయంగా ఏక్‌నాథ్ వద్దకు వచ్చి అతడికి అండగా నిలిచాడు. తన ప్రధాన అనుచరుడిగా తీసుకున్నాడు. ఏక్‌నాథ్‌కు రాజకీయాలు నేర్పించాడు. దీంతో ఆటో డ్రైవింగ్ వృత్తి మానేసి పూర్తి స్థాయిలో ఆనంద్ కోసం పనిచేశాడు. 1980 నుంచి ఏక్‌నాథ్ పూర్తిగా శివసేన కోసం పనిచేయడం ప్రారంభించారు.
ఆనంద్ దిఘే మృతితో..
ఆనంద్ దిఘే బతికి ఉన్నన్ని రోజులు ఏక్‌నాథ్ ఆయన ప్రధాన అనుచరుడిగానే ఉన్నాడు. ఆయన అండదండతోనే 1997లో థానే కార్పొరేటర్‌గా గెలిచాడు. 2001లో ఆనంద్ దిఘే మరణించడంతో ఆయన వారసుడిగా ఏక్‌నాథ్ శివసేనలో కీలకంగా మారాడు. దీంతో 2004 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఆయనకు అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. పోటీ చేసిన తొలిసారే ఘనవిజయం సాధించాడు.
అప్పటి నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో శివసేన శాసనసభా పక్షనేతగా ఎన్నికయ్యారు. ఉద్దవ్ ఠాక్రే సీఎం అయినా కేవలం ఎమ్మెల్సీ కావడంతో.. 2019లో కూడా ఆయన శివసేన శాసన సభా పక్ష నేతగా ఉన్నారు. ఉద్దవ్ కేబినెట్‌లో పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా పని చేశారు. షిండే కొడుకు శ్రీకాంత్ లోక్‌సభ ఎంపీగా ఉన్నాడు. కరుడు కట్టిన శివసైనికుడిగా తనను తాను అభివర్ణించుకునే షిండేకు ఎన్సీపీతో జత కట్టడం మొదటి నుంచి ఇష్టం లేదు.
వాస్తవానికి ఎంవీఏ ప్రభుత్వం ఏర్పాటు సమయంలో శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండేనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేసులో నిలిచారు. అయితే ఎన్సీపీ ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంతో ఉద్దవ్ ఠాక్రే సీఎం అయ్యారు. అప్పటి నుంచే సీఎం కుర్చీని టార్గెట్ చేసిన షిండే.. సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ వచ్చారు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి లోపాయికారిగా మద్దతు తెలిపి ఒక సీటు అదనంగా గెలుచుకునేలా చేయడంలో షిండే కీలక పాత్ర వహించినట్లు సమాచారం. ఇక అక్కడి నుంచి తన వ్యూహాన్ని అమలు చేశారు. శివసేన ఎమ్మెల్యేలను తనవైపునకు తిప్పుకొని.. వారు చేజారి పోకుండా క్యాంపు రాజకీయాలు నడిపి..ఎట్టకేలకు సీఎం కుర్చీపై కూర్చుంటున్నారు. ఇలా ఒక ఆటో డ్రైవర్.. ఏకంగా మహారాష్ట్ర రాజకీయాలను నడిపించే స్థాయికి ఎదిగారు.