Telugu Global
National

సీఎం ఏక్‌నాథ్ షిండే వివాదాస్పద నిర్ణయం.. ఆరే కాలనీలోనే మెట్రో షెడ్

శివసేన శాసనసభా పక్షాన్ని చీల్చి.. బీజేపీ మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన ఏక్‌నాథ్ షిండే తొలి నిర్ణయమే వివాదాస్పదంగా మారింది. ముంబైలోని ఆరే కాలనీలోనే మెట్రో కార్‌ షెడ్ నిర్మించాలని నిర్ణయించారు. ఫడ్నవీస్ కోరడంతోనే సీఎం ఏక్‌నాథ్ షిండే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ఆరే కాలనీలోనే మెట్రో షెడ్ నిర్మించనున్నట్లు కోర్టుకు తెలియజేయాలని షిండే, ఫడ్నవీస్‌లు అడ్వకేట్ జనరల్‌కు సూచించినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. ఏమిటీ ఆరే కాలనీ వివాదం? దేవేంద్ర […]

సీఎం ఏక్‌నాథ్ షిండే వివాదాస్పద నిర్ణయం.. ఆరే కాలనీలోనే మెట్రో షెడ్
X

శివసేన శాసనసభా పక్షాన్ని చీల్చి.. బీజేపీ మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన ఏక్‌నాథ్ షిండే తొలి నిర్ణయమే వివాదాస్పదంగా మారింది. ముంబైలోని ఆరే కాలనీలోనే మెట్రో కార్‌ షెడ్ నిర్మించాలని నిర్ణయించారు. ఫడ్నవీస్ కోరడంతోనే సీఎం ఏక్‌నాథ్ షిండే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ఆరే కాలనీలోనే మెట్రో షెడ్ నిర్మించనున్నట్లు కోర్టుకు తెలియజేయాలని షిండే, ఫడ్నవీస్‌లు అడ్వకేట్ జనరల్‌కు సూచించినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు.

ఏమిటీ ఆరే కాలనీ వివాదం?
దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 సెప్టెంబర్‌లో ఆరే కాలనీ అటవీ ప్రాంతంలో చెట్లను నరికేయడానికి అనుమతి ఇచ్చారు. ముంబై మెట్రోరైల్ కార్పొరేషన్ ఆ ప్రాంతంలో 2,700 చెట్లను నరికి, అక్కడ మెట్రో కార్ షెడ్ నిర్మిస్తామని తెలిపింది. 13 వేల హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఆరే కాలనీ అడవిలో 27 ఆదివాసీ గ్రామాలతో పాటు అనేక రకాలైన వన్య‌ప్రాణులు ఉన్నాయి. అడవిని నరికేయడం వల్ల ఆదివాసీలు ఇళ్లు కోల్పోవడంతో పాటు వన్య‌ప్రాణులు నాశనం అవుతాయని పలువురు పర్యావరణ వేత్త‌లు, స్థానికులు ఆందోళన చేపట్టారు. కొంత మంది ముంబై హైకోర్టును ఆశ్రయించారు.

ఆరే కాలనీ ప్రాంతంలో మెట్రో కార్‌ షెడ్ కోసం చెట్లను నరకవద్దని ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్‌ను బాంబే హైకోర్టు సూచించడంతో.. మెట్రో సంస్థ ఒప్పుకుంది. అయితే 2019 అక్టోబర్‌లో అదే బాంబే హైకోర్టు చెట్లను నరకవద్దని వేసిన పిటిషన్లు అన్నింటినీ కొట్టేసి.. ముంబై మెట్రోకు మార్గం సుగమమం చేసింది. దీంతో ముంబై మొత్తం నిరసనలు, ఆందోళనలతో దద్దరిల్లింది. ప్రజాగ్రహం చూసి మహారాష్ట్ర ప్రభుత్వం అప్పటికి కార్‌ షెడ్ పనులను నిలిపివేసింది.

2020లో ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరే కాలనీ కోసం ఆందోళన చేసిన వారిపై పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకుంది. అంతే కాకుండా మెట్రో షెడ్‌ నిర్మాణాన్ని ఆరే కాలనీ నుంచి కంజుర్ మార్గ్‌కు తరలిస్తున్నట్లు చెప్పింది. అయితే కంజుర్ మార్గ్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలం వివాదంలో ఉంది. దీంతో ఇంకా అక్కడ పనులు ప్రారంభం కాలేదు.

తాజాగా, మళ్లీ ఫడ్నవీస్ మద్దతుతో షిండే సీఎంగా పీఠమెక్కారు. వెంటనే ఆరే కాలనీలోనే మెట్రో కార్ షెడ్ నిర్మాణం చేయబోతున్నట్లు హైకోర్టుకు చెప్పాలని ఏజీని ఆదేశించారు. మొత్తానికి దేవేంద్ర ఫడ్నవీస్ తన పంతాన్ని నెగ్గించుకోవడానికి ఆరే కాలనీ అటవీ ప్రాంతంలో చెట్లను నరకడానికి మార్గం సిద్ధం చేశారు.

తనపై కోపాన్ని ముంబై ప్రజలపై చూపొద్దు : ఉద్దవ్
తాను సీఎంగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని పక్కకుపెట్టి.. తిరిగి ఆరే కాలనీలో మెట్రో కార్ షెడ్ నిర్మించాలని నిర్ణయించడంపై ఉద్దవ్ ఠాక్రే విచారం వ్యక్తం చేశారు. తనపై ఉన్న కోపాన్ని ముంబై ప్రజలపై చూపించవద్దని ఆయన కోరారు. ముంబై పర్యావరణంతో ఆటలాడుకోవద్దని, మెట్రో కార్ షెడ్ ఆరే కాలనీలో ఉండటం కంటే కంజుర్ మార్గ్‌లో ఉండటమే సేఫ్ అని అన్నారు. కంజుర్ మార్గ్ స్థలం ప్రైవేటుది కాదని, అది ప్రభుత్వ స్థలమేనని ఉద్దవ్ చెప్పారు. ఆరే కాలనీని పర్యావరణవేత్తలతో కలసి తమ ప్రభుత్వం రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

First Published:  1 July 2022 6:28 AM
Next Story