ఉద్ధవ్ రాజీనామా.. కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్ర సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత రాత్రి పదవికి రాజీనామా చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని ఇది వరకే గవర్నర్.. ఉద్ధవ్‌ను ఆదేశించారు. గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు వేళలు ముగిసినప్పటికీ పిటిషన్ ప్రభావాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు రాత్రి వరకు సుదీర్ఘంగా వాదనలు విని.. రాత్రి 9.15 నిమిషాలకు తీర్పు వెలువరించింది. గవర్నర్ ఆదేశాల్లో తాము […]
మహారాష్ట్ర సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత రాత్రి పదవికి రాజీనామా చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని ఇది వరకే గవర్నర్.. ఉద్ధవ్‌ను ఆదేశించారు. గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
కోర్టు వేళలు ముగిసినప్పటికీ పిటిషన్ ప్రభావాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు రాత్రి వరకు సుదీర్ఘంగా వాదనలు విని.. రాత్రి 9.15 నిమిషాలకు తీర్పు వెలువరించింది. గవర్నర్ ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశాలను పరిష్కరించేందుకు శాసనసభే ఏకైక మార్గమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రెబల్స్ అనర్హత పిటిషన్ల వ్యవహారం తేలే వరకు బలపరీక్షను వాయిదా వేయాలన్న ప్రభుత్వ చీఫ్ విప్ విజ్ఞప్తికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. మహా రాజకీయ సంక్షోభానికి తెరపడాలంటే బలనిరూపణే సరైన మార్గమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
జైల్లో ఉన్న ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఇద్దరినీ విశ్వాస పరీక్ష సమయంలో అసెంబ్లీకి తీసుకురావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలా చేయని పక్షంలో ఇలాంటి సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభకు రాకుండా జైళ్లలోకి నెట్టడం అలవాటుగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది.
కోర్టు తీర్పు రాగానే రాత్రి 9.30కి ఠాక్రే రాజీనామా ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకుంటున్నట్టు వెల్లడించారు. బుధవారం అర్థరాత్రి రాజ్‌భవన్ చేరుకుని రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేశారు. రాజీనామాను ఆమోదించిన గవర్నర్ ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరారు.
కోర్టు తీర్పును గౌరవిస్తున్నట్టు ఉద్ధవ్ చెప్పారు. పదవి పోతున్నందుకు తనకేమీ బాధ లేదని.. బాలాసాహెబ్ ఠాక్రే కుమారుడిని పదవి నుంచి దించిన ఆనందాన్ని తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా ఆస్వాదించనీయండి అంటూ కామెంట్ చేశారు. వారంతా శివసేన ద్వారానే రాజకీయంగా ఎదిగారని.. అలాంటి వారిలో ఒక్కరు తనకు వ్యతిరేకంగా ఉన్నా అది తనకే సిగ్గు చేటన్నారు. నంబర్ గేమ్‌పై తనకు ఎలాంటి ఆసక్తి లేదన్నారు. రెబల్స్ ను ముంబై రానివ్వాలని.. కార్యకర్తలు ఎలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించవద్దని సూచించారు. శివసేన సామాన్యుల పార్టీ అని.. పార్టీని తిరిగి పునర్‌నిర్మిస్తామని ఉద్ధవ్ ప్రకటించారు.
కోర్టులో విచారణ నడుస్తున్న సమయంలోనే ఠాక్రే కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఇంతకాలం మీరు అందించిన సహకారానికి కృతజ్ఞతలు అంటూ మంత్రులతో సీఎం చెప్పడంతో ఆయన రాజీనామా చేయబోతున్నారన్న ప్రచారం అప్పుడే మొదలైంది.
ఠాక్రే రాజీనామా చేసిన నేపథ్యంలో తదుపరి ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారన్న చర్చ మొదలైంది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని రెబల్స్ రాత్రి గోవా చేరుకున్నారు. నేడు ఉదయం అక్కడి నుంచి నేరుగా ముంబై చేరుకోనున్నారు. 39 మంది రెబల్ ఎమ్మెల్యేలు, 10 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు.
ఈ పరిణామాలపై బీజేపీ స్పందించింది. ఉద్ధవ్ ఠాక్రే విషయంలో కర్మ సిద్ధాంతం పనిచేసిందని, కర్మ ఎవరినీ వదిలిపెట్టదని, దాన్ని అందరూ అనుభవించాల్సిందే అంటూ బీజేపీ వ్యాఖ్యానించింది. ”ఒకప్పుడు బాల్ ఠాక్రే పదవులు చేపట్టకుండానే ప్రభుత్వాలను శాసించారు., ఆయన కుమారుడు మాత్రం సొంత పార్టీనే అదుపు చేయలేకపోయారు.. ఇది ఎంతటి పతనం?” అంటూ బీజేపీ నేత అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.