రేపటి నుంచి ప్లాస్టిక్ బ్యాన్.. నిషేధించిన వస్తువులు ఇవే
ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న అతిపెద్ద సమస్య ప్లాస్టిక్ వ్యర్థాలు. మనిషి తన సౌకర్యం కోసం తయారు చేసుకుంటున్న ఈ ప్లాస్టిక్ వస్తువులు.. ఇతర జీవరాశులకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ప్రపంచం ఇప్పుడు ప్లాస్టిక్ కాలుష్యం కారణంగా తీవ్రంగా నష్టపోతోంది. దీంతో చాలా దేశాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను బ్యాన్ చేశాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా నిషేధించింది. ఈ మేరకు కేంద్ర పర్యవరణ మరియు అటవీ శాఖ గత […]
ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న అతిపెద్ద సమస్య ప్లాస్టిక్ వ్యర్థాలు. మనిషి తన సౌకర్యం కోసం తయారు చేసుకుంటున్న ఈ ప్లాస్టిక్ వస్తువులు.. ఇతర జీవరాశులకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ప్రపంచం ఇప్పుడు ప్లాస్టిక్ కాలుష్యం కారణంగా తీవ్రంగా నష్టపోతోంది.
దీంతో చాలా దేశాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను బ్యాన్ చేశాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా నిషేధించింది. ఈ మేరకు కేంద్ర పర్యవరణ మరియు అటవీ శాఖ గత ఏడాది గెజిట్ విడుదల చేసింది.
జూలై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు తయారీ, ఎగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వాడకం పూర్తిగా నిషేధించింది. కేవలం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మాత్రమే కాకుండా పాలీసెరేన్, ఎక్స్‌టెండెడ్ పాలీసెరేన్, వాటి సంబంధిత ఉత్పత్తులు కూడా వాడటం పూర్తిగా నిషేధం.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటి?
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే పేరులోనే తెలిసిపోతోంది. కేవలం ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులని. ప్లాస్టిక్‌ను ఉపయోగించి తయారు చేసే వాటిలో అత్యధిక భాగం ఇవే ఉంటాయి. కవర్లు, షాంపూ బాటిల్స్, పాలథిన్ బ్యాగ్స్, ఫేస్ మాస్కులు, కాఫీ కప్పులు, వైన్ గ్లాసులు, ప్యాకింగ్‌కు ఉపయోగించే సన్నటి ప్లాస్టిక్ ఫిల్మ్, చెత్త బ్యాగులు, ఆహార పదార్థాలు ప్యాక్ చేయడానికి ఉపయోగించే బాక్సులు ఈ కోవలోకే చెందుతాయి. ఆస్ట్రేలియాకు చెందిన మిండేరో ఫౌండేషన్ అనే ఎన్జీవో 2021లో ఒక నివేదిక విడుదల చేసింది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ వస్తువుల్లో మూడొంతులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ఉంటున్నాయని తేల్చి చెప్పింది. 98 శాతం ప్లాస్టిక్ శిలాజ ఇంధనాల నుంచే తయారు చేస్తున్నారు. 2019లో ప్రపంచ వ్యాప్తంగా 130 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణంలోకి వచ్చి చేరాయని చెప్పింది. ఇలాగే ప్లాస్టిక్‌ను వాడుకుంటూ పోతే.. 2050కల్లా గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాల్లో 5 నుంచి 10 శాతం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచే వస్తుందని స్పష్టం చేసింది.
ప్రపంచంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను విపరీతంగా వాడుతున్న 100 దేశాల్లో ఇండియా కూడా ఒకటి. మన దేశంలో ఏడాదికి 11.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు ఉత్పత్తి చేస్తుండగా.. 2.9 మెట్రిక్ టన్నుల వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాము. ఏడాదికి 5.6 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకొని పోతున్నాయి. సగటున ఒక భారతీయుడు ఏడాదిలో 4 కేజీల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాడు.
భయపెడుతున్న నిజాలు..
– ఎర్త్ డే డాట్ ఆర్గ్ అనే సంస్థ అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఒక్క నిమిషంలో 1.2 మిలియన్ ప్లాస్టిక్ బాటిల్స్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రతీ ఏడాది 500 బిలియన్ల ప్లాస్టిక్ కప్పులు యూజ్ చేస్తున్నారు.
– సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యయనం ప్రకారం 25,940 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ ఇండియాలో జనరేట్ అవుతోంది.
– గత 35 ఏళ్లుగా సముద్రంలో కలిసిన ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీస్తే.. హిమాలయాలు అంతా పరిచేంత పరిణామం ఉంటాయని చెప్తున్నారు.
– 2020లో చేపట్టిన గ్లోబల్ ఓషియన్ క్లీనప్ కార్యక్రమంలో ఎక్కువగా ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు, బాటిల్ క్యాప్సప్, గ్రోసరీ బ్యాగులు, స్ట్రా, బేవరేజెస్ క్యాన్స్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇండియాలో బ్యాన్ చేస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు ఇవే..
– ఇయర్ బడ్స్, బెలూన్స్, క్యాండీస్‌లో ఉపయోగించే ప్లాస్టిక్ స్టిక్స్
– ప్లాస్టిక్ ప్లేట్లు
– ప్లాస్టిక్ గ్లాసులు
– ప్లాస్టిక్ ఫోర్కులు
– ప్లాస్టిక్ స్పూన్లు
– ప్లాస్టిక్ కత్తులు
– ప్లాస్టిక్ స్ట్రాలు
– ప్లాస్టిక్ కవర్లు
– ప్యాకేజింగ్‌కు ఉపయోగించే కవర్లు
– సిగరెట్ ప్యాకెట్లు, స్వీట్ బాక్సులపై వేసే ప్లాస్టిక్ ఫిల్మ్ కవర్లు
– 100 మైక్రాన్ల కంటే పలుచగా ఉండే పీవీసీ బ్యానర్లు
– థర్మాకోల్ ప్రొడక్ట్స్
ప్రత్యామ్నాయంగా ఏం సూచిస్తోంది?
– థర్మాకోల్ బదులుగా.. రీసైకిల్ చేసిన పేపర్ అట్టలు, హనీకాంబ్ పేపర్
– ప్లాస్టిక్ స్టిక్స్ బదులుగా.. ఉడెన్ స్టిక్స్, పేపర్ స్టిక్స్
– పేపర్‌తో చేసిన ప్లేట్లు, గ్లాసులు, పాత్రలు, మొక్కజొన్న ఆధారిత పాత్రలు, ఆకులతో చేసిన ప్లేట్లు, మట్టి కప్పులు, స్టీల్ కప్పులు వాడుకోవచ్చు
– పీవీసీ బ్యానర్లకు పదులు రీసైక్లింగ్ చేయగల పాలీఇథలిన్‌ను ఉపయోగించవచ్చు.
జరినామాలు..
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించకపోతే భారీగా జరిమానాలు ఉంటాయి. ఎవరైనా ప్లాస్టిక్ కవర్లు వాడితే రూ. 500, వ్యాపారస్తులకు అయితే రూ. 5వేలు జరిమానా విధిస్తారు. పదే పదే పట్టుబడితే జైలు శిక్ష కూడా ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.