Telugu Global
NEWS

కర్నూలు వైసీపీలో వెన్నుపోటు వ్యాఖ్యలు..

సొంత పార్టీ నేతలే గోతులు తీస్తున్నారు, కుట్రలు చేస్తున్నారంటూ ఇటీవల కాలంలో వైసీపీ నుంచి కంప్లయింట్ లు ఎక్కువగా వస్తున్నాయి. సాక్షాత్తూ మాజీ మంత్రి, సీఎం జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వైసీపీలో తనకు వ్యతిరేకంగా కొంతమంది పనిచేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మరుసటి రోజే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనది కూడా అదే బాధ అన్నారు. తాజాగా.. కర్నూలు వైసీపీలో వెన్నుపోటు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పార్టీలోనే ఉంటూ […]

కర్నూలు వైసీపీలో వెన్నుపోటు వ్యాఖ్యలు..
X

సొంత పార్టీ నేతలే గోతులు తీస్తున్నారు, కుట్రలు చేస్తున్నారంటూ ఇటీవల కాలంలో వైసీపీ నుంచి కంప్లయింట్ లు ఎక్కువగా వస్తున్నాయి. సాక్షాత్తూ మాజీ మంత్రి, సీఎం జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వైసీపీలో తనకు వ్యతిరేకంగా కొంతమంది పనిచేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ మరుసటి రోజే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనది కూడా అదే బాధ అన్నారు. తాజాగా.. కర్నూలు వైసీపీలో వెన్నుపోటు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కి కొంతమంది ద్రోహం చేస్తున్నారని ఎంపీ సంజీవ్ కుమార్ మండిపడ్డారు. అదే కార్యక్రమంలో పాల్గొన్న హఫీజ్ ఖాన్.. అది నిజమేనంటూ తన బాధ వెల్లగక్కారు. తనపై పార్టీలోనే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.

టార్గెట్ ఎస్వీ మోహన్ రెడ్డి..
2014లో వైసీపీ టికెట్ పై కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్వీ మోహన్ రెడ్డి అనంతరం టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ నిరాకరించి టీజీ భరత్ కి ఆ స్థానం కేటాయించింది. దీంతో ఎస్వీ తిరిగి వైసీపీలో చేరారు. అయితే అప్పటికే కర్నూలు సీటు హఫీజ్ ఖాన్ కి కేటాయించింది వైసీపీ. చేసేదేం లేక హఫీజ్ ఖాన్ కోసం ప్రచారం చేసి, జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేశారు ఎస్వీ.

ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. మెల్లగా హఫీజ్ ఖాన్ కి పక్కలో బల్లెంలా మారారు ఎస్వీ. 2024 ఎన్నికల్లో కర్నూలు టికెట్ సంపాదించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో హఫీజ్ ఖాన్ కి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ అండగా నిలిచారు. వారిద్దరూ ఎస్వీ మోహన్ రెడ్డికి చెక్ పెట్టాలనుకుంటున్నారు.

తాజాగా ఎస్వీ పేరు ప్రస్తావించకుండానే వారు తేనెతుట్టెను కదిపారు. కర్నూలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు కొంతమంది సొంత పార్టీ నేతలే ద్రోహం చేస్తున్నారంటూ మండిపడ్డారు ఎంపీ సంజీవ్ కుమార్. ఎవరెన్ని ఇబ్బందులు సృష్టించినా వచ్చే దఫా టికెట్ హఫీజ్ ఖాన్ కే ఇస్తారని, ఆయనే విజయం సాధిస్తారని చెప్పారు.

ఇక హఫీజ్ ఖాన్ కూడా కుట్రలపై మండిపడ్డారు. తనపై కుట్రలు చేయాలని చూసినా తాను మాత్రం చిరునవ్వుతో ఓర్చుకుంటానని తెలిపారాయన. ఎన్ని ద్రోహాలనైనా భరిస్తాను, ప్రజలు నాతోనే ఉన్నారని చెప్పారు హఫీజ్ ఖాన్. కర్నూలు జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. అయితే కర్నూలులో కుట్ర రాజకీయాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. సొంత పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. గోతులు తవ్వుతున్నారని బహిరంగ వేదికలపైనే ఆరోపణలు చేస్తున్నారు.

First Published:  30 Jun 2022 5:51 AM GMT
Next Story