కల్తీ నాయుడు.. కల్తీ నాయకుడు..
ఏపీలో కల్తీ మద్యం అంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. టీడీపీ ఒక కల్తీ పార్టీ అని, కల్తీకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఆయన ఓ కల్తీ నాయుడు, కల్తీ నాయకుడని సెటైర్లు వేశారు నాని. కుళ్లు, కుట్రలు, కుతంత్రాలతో చంద్రబాబు ఒళ్లంతా కుళ్లిపోయిందని విమర్శించారు. విషం ఎక్కడో లేదని, చంద్రబాబు బుర్రలోనే విషం ఉందన్నారు నాని. మీరు తాగి పంపించారా..? గోబెల్స్ ప్రచారానికి తాత చంద్రబాబేనంటూ ధ్వజమెత్తిన […]
ఏపీలో కల్తీ మద్యం అంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. టీడీపీ ఒక కల్తీ పార్టీ అని, కల్తీకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఆయన ఓ కల్తీ నాయుడు, కల్తీ నాయకుడని సెటైర్లు వేశారు నాని. కుళ్లు, కుట్రలు, కుతంత్రాలతో చంద్రబాబు ఒళ్లంతా కుళ్లిపోయిందని విమర్శించారు. విషం ఎక్కడో లేదని, చంద్రబాబు బుర్రలోనే విషం ఉందన్నారు నాని.
మీరు తాగి పంపించారా..?
గోబెల్స్ ప్రచారానికి తాత చంద్రబాబేనంటూ ధ్వజమెత్తిన నాని.. టీడీపీ నాయకులు మద్యాన్ని ఏ ల్యాబ్‌లో టెస్ట్ చేయించారని, టీడీపీ ఆఫీస్‌లోనా? అని వ్యంగ్యోక్తులు విసిరారు. టీడీపీ నేతలు సగం తాగి వదిలిన బాటిళ్లు తీసి చెక్ చేశారా? అని ప్రశ్నించారు. వ్యూహాత్మక కుతంత్రంలో భాగంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు నాని.
హెరిటేజ్ పాలలోనే విషం..
ఆ మాటకోస్తే ఏపీ మద్యంలో విషం లేదని, హెరిటేజ్ పాలలోనే విషం ఉందని మండిపడ్డారు నాని. హెరిటేజ్ పాలను కేరళ, తమిళనాడుల్లో 2012లో నిషేధించారని, ఇది వాస్తవం కాకపోతే చంద్రబాబు స్పందించాలని సవాల్ విసిరారు. “చిన్న పిల్లలు తాగే పాలలో విషం కలపడానికి చంద్రబాబుకు సిగ్గు ఉండాలి కదా! ఆయన రూ.10 కోట్లతో హెరిటేజ్ కంపెనీ పెడితే.. అది రూ.10 వేల కోట్లు అయ్యిందంట. దానికన్నా దౌర్భాగ్య కంపెనీ ఇంకోటి దేశంలో లేదు. కల్తీ పాలు, కల్తీ పెరుగు. తన బ్లాక్ మనీ వైట్ చేసుకోవడానికే చంద్రబాబు హెరిటేజ్ కంపెనీ పెట్టారు.” అని విమర్శించారు నాని. ఎంపీ విజయసాయిరెడ్డి వియ్యంకులు కావడం వల్లే అరబిందో ఫార్మాపైనా టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు నాని.
విషం కక్కుతున్నారు..
చంద్రబాబుతోపాటు, దత్త పుత్రుడు పవన్, ఎల్లో మీడియా కలసి అదే పనిగా ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని అన్నారు నాని. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో మత కలహాలు సృష్టించే ప్రయత్నం చేశారని అన్నారు. రథాలు తగలబెట్టారు, విగ్రహాలు పగలగొట్టారు, ఆలయాల్లో ఆభరణాలు దొంగిలించారంటూ విష ప్రచారం చేశారని చెప్పారు. సీఎం జగన్ క్రిస్టియన్ అని.. హిందువులకు భద్రత లేదంటూ ఎల్లో మీడియాలో విషం చిమ్మారని చెప్పారు. ఆ తర్వాత కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూశారని, కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే.. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు తగలబెట్టారని విమర్శించారు. ఎల్లో మీడియా పత్రికలు చదవద్దు.. ఆ టీవీలను ఎవరూ చూడొద్దని చెప్పారు నాని.