నాపై కోపానికి కారణం అదే – ఏబీ వెంకటేశ్వరరావు
ఏపీ ప్రభుత్వం తనపై రెండోసారి సస్పెన్షన్ వేటు వేయడం పట్ల సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఒకే అంశంపై ప్రభుత్వం రెండుసార్లు ఎలా చర్యలు తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు న్యాయ సమీక్షలో చెల్లుబాటు కావు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తనను సస్పెండ్ చేసినట్లు మీడియాలో వచ్చిందని.. తనకైతే ఇంకా ఎటువంటి ఆదేశాలు అందలేదన్నారు. తనపై ఇప్పటివరకు చార్జిషీట్ కూడా […]
ఏపీ ప్రభుత్వం తనపై రెండోసారి సస్పెన్షన్ వేటు వేయడం పట్ల సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఒకే అంశంపై ప్రభుత్వం రెండుసార్లు ఎలా చర్యలు తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వం తీసుకున్న చర్యలు న్యాయ సమీక్షలో చెల్లుబాటు కావు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తనను సస్పెండ్ చేసినట్లు మీడియాలో వచ్చిందని.. తనకైతే ఇంకా ఎటువంటి ఆదేశాలు అందలేదన్నారు.
తనపై ఇప్పటివరకు చార్జిషీట్ కూడా దాఖలు చేయలేదన్నారు. సీఎం జగన్‌పై 12 సీబీఐ ఛార్జి షీట్‌లు ఉన్నాయని.. శ్రీలక్ష్మిపైనా కేసులు ఉన్నాయన్నారు. రాజకీయ నాయకులకు ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనలు వర్తించవని.. కానీ సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి పై ఉన్న కేసుల సంగతి ఏంటని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ఆమెపై చార్జ్ షీట్లు కూడా ఉన్నాయని, ఆమెకు వర్తించని నిబంధనలు తనకు మాత్రమే ఎలా వర్తిస్తాయి ఆయన ప్రశ్నించారు.
రాజ్యాంగం ప్రకారం ఉన్న సమానత్వం అనే ప్రాథమిక హక్కుకు ఏపీ ప్రభుత్వం భంగం కలిగించిందని వెంకటేశ్వరరావు చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల పై మరోసారి కోర్టుకు వెళ్లి తాను పోరాటం చేస్తానన్నారు. ఈ సందర్భంగా మరో కీలకమైన ఆరోపణ కూడా చేశారు.
తనను ప్రభుత్వం టార్గెట్ చేయడం లేదని కొందరు వ్యక్తులు, కొన్ని శక్తులు టార్గెట్ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. అందుకు కారణాలు కూడా ఉన్నాయని చెప్పారు. తాను ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని తగలబెట్టాలని చూస్తే దాన్ని అడ్డుకున్నానని ఆ కోపంతోనే తనను టార్గెట్ చేశారని వెంకటేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు.
కోడికత్తి కేసు అడ్డంపెట్టుకుని రాష్ట్రాన్ని తగలబెట్టాలని చూశారని ఆరోపించారు. కానీ తాను కొన్ని గంటల వ్యవధిలోనే సమర్థవంతంగా అడ్డుకున్నానని ఆయన వివరించారు. అందుకే తనపై కొందరికి కోపం ఉందని ఆయన ఆరోపించారు.
23మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లటంతో తనకేం సంబంధమని ప్రశ్నించారు. తన ప్రమేయం ఉంటే విచారించి చర్యలు తీసుకోవచ్చునన్నారు. ఇదే అంశాన్ని చెప్పుకుంటూ ఎంతకాలం ప్రచారం చేస్తారన్నారు.
పదేపదే ఇజ్రాయిల్ కంపెనీ నుంచి అక్రమంగా కొనుగోలు అంటూ మాట్లాడుతున్నారని ఆ కంపెనీ ఏమైనా సూట్ కేస్ కంపెనీనా అని ఏబీ ప్రశ్నించారు. అసలు ఒక్క రూపాయి కూడా అవినీతి జరగని చోట ఏసీబీ కేసు ఎలా నమోదు చేస్తుందని ఆయన ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ నిబంధనలకు లోబడే పనిచేయాలని.. అలా కాకుండా నిబంధనలు అతిక్రమిస్తే ఏదో ఒకరోజు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఇజ్రాయిల్ నుంచి నిఘా పరికరాల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏబీ వెంకటేశ్వరరావుపై 2020లో ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల తరువాత ఈ నెల 14న ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆయన సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మరోసారి ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై న్యాయపోరాటం చేస్తానని ఇప్పుడు వెంకటేశ్వరరావు చెబుతున్నారు.