Telugu Global
National

గవర్నర్ ఆదేశం.. రేపు అసెంబ్లీలో సీఎం ఉద్ధవ్ థాక్రే బల పరీక్ష

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే. రెబెల్ శివసేన నేత ఏక్ నాథ్ షిండే బలాబలాలు తేల్చుకునే సమయం వచ్చేసింది. రేపు అసెంబ్లీలో థాక్రే తన మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఉదయం 11 గంటలకు సభను ప్రత్యేకంగా సమావేశపరచాలని ఆయన అసెంబ్లీ కార్యదర్శి రాజేంద్ర భగవత్ కు లేఖ పంపారు. ముఖ్యమంత్రిపై ‘అజెండా ఆఫ్ ట్రస్ట్ ఓట్’ అన్న క్యాప్షన్ తో ఈ లెటర్.. శాసన సభా కార్యదర్శికి […]

గవర్నర్ ఆదేశం.. రేపు అసెంబ్లీలో సీఎం ఉద్ధవ్ థాక్రే బల పరీక్ష
X

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే. రెబెల్ శివసేన నేత ఏక్ నాథ్ షిండే బలాబలాలు తేల్చుకునే సమయం వచ్చేసింది. రేపు అసెంబ్లీలో థాక్రే తన మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఉదయం 11 గంటలకు సభను ప్రత్యేకంగా సమావేశపరచాలని ఆయన అసెంబ్లీ కార్యదర్శి రాజేంద్ర భగవత్ కు లేఖ పంపారు. ముఖ్యమంత్రిపై ‘అజెండా ఆఫ్ ట్రస్ట్ ఓట్’ అన్న క్యాప్షన్ తో ఈ లెటర్.. శాసన సభా కార్యదర్శికి అందింది. ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేట్టు చూడాలని, అసెంబ్లీ లోపల, బయట కూడా తగినన్ని భద్రతా దళాలను, పోలీసులను నియమించాలని గవర్నర్ ఆదేశించారు. కొంతమంది నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నందున లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. తాను, తన వర్గం రెబెల్ ఎమ్మెల్యేలు రేపు ముంబైలో ఉంటామని, ఫ్లోర్ టెస్ట్ లో పాల్గొంటామని షిండే ప్రకటించారు. మహారాష్ట్రలో శాంతి, సంతోషం వెల్లివిరియాలని, అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొనేందుకు రేపు ముంబైలో ఉంటామని ఆయన చెప్పారు. బుధవారం ఉదయం గౌహతిలోని ఆలయానికి వెళ్లిన ఆయన ప్రార్థనలు చేశారు. సభలో ఎలాగైనా తమ మెజారిటీని నిరూపించుకుంటామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి దారుణం.. గవర్నర్

రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మహావికాస్ అఘాడీ ప్రభుత్వం నుంచి నిష్క్రమించాలని 39 మంది శివసేన ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్టు మీడియాలో అదేపనిగా వార్తలు వస్తున్నాయని గవర్నర్ కోష్యారీ తన లేఖలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఏడుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఈ నెల 28 న ఈ-మెయిల్ ద్వారా పంపిన లేఖ రాజ్ భవన్ కి అందిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సీఎం సభా విశ్వాసాన్ని కోల్పోయారని, అందువల్ల సాధ్యమైనంత త్వరగా బల పరీక్ష తప్పనిసరి అని వారు కోరారన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ముంబైలోను, మరికొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని, వారి ఆఫీసులపైనా దాడులు జరిగాయని గవర్నర్ అన్నారు.పైగా ఈ ఎమ్మెల్యేలకు, వారి కుటుంబ సభ్యులకు ప్రాణహాని కలిగేట్టు అల్లర్లు జరిగాయని ఆయన పేర్కొన్నారు. సభా విశ్వాసానికి అనుగుణంగా ప్రభుత్వం కొనసాగాలంటే ముఖ్యమంత్రి సభలో తన మెజారిటీని నిరూపించుకోవాలని తాను అభిప్రాయపడుతున్నానని కోష్యారీ తెలిపారు. శాసన సభ విశ్వాసం పొందిన ప్రభుత్వం సజావుగా పని చేయాలని భావిస్తున్నానని, అందువల్ల రాష్ట్ర రాజ్యాంగ హెడ్ గా ఈ లేఖ పంపుతున్నానన్నారు. ఈ కారణంగానే ఈ నెల 30 న సీఎం సభలో తన బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశిస్తున్నట్టు ఆయన వివరించారు.

ప్రతిపక్ష నేత వ్యక్తిగతంగా వచ్చి తనను కలిశారని, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితి గురించి వివరించారని ఆయన వెల్లడించారు. శాసన సభలో ముఖ్యమంత్రి మెజారిటీని కోల్పోయారంటూ ఆ నేత తనకొక లేఖ అందజేశారన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకునేలా చూడాలని, దీనివల్ల రాష్ట్రంలో అప్రజాస్వామ్యయుతంగా రాజకీయ బేరసారాలు జరగకుండా నివారించవచ్చునని బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నిన్న రాత్రి పేర్కొన్నారు. సేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందన్నారు. తాము ప్రభుత్వానికి మద్దతునివ్వడం లేదని 39 మంది రెబెల్ సేన ఎమ్మెల్యేలు ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.

First Published:  29 Jun 2022 5:29 AM IST
Next Story