బుక్ మై షో, ఏపీ ప్రభుత్వం మధ్య వాడీవేడిగా వాదనలు
ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు నడిచాయి. ఇటు ప్రభుత్వం, అటు బుక్ మై షో మధ్య గట్టిగా వాదనలు నడిచాయి. ప్రేక్షకులను బుక్ మై షో లాంటి సంస్థలు దోచేస్తున్నాయని ప్రభుత్వం ఆరోపించగా.. ప్రభుత్వం గుత్తాధిపత్యానికి తెరలేపుతోందని బుక్ మై షో ఆరోపించింది. ప్రభుత్వం తెస్తున్న పోర్టల్ ద్వారానే ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించాలన్న నిబంధనను బుక్ మై షో తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం నేరుగా తనకు తాను ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తే […]
ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు నడిచాయి. ఇటు ప్రభుత్వం, అటు బుక్ మై షో మధ్య గట్టిగా వాదనలు నడిచాయి. ప్రేక్షకులను బుక్ మై షో లాంటి సంస్థలు దోచేస్తున్నాయని ప్రభుత్వం ఆరోపించగా.. ప్రభుత్వం గుత్తాధిపత్యానికి తెరలేపుతోందని బుక్ మై షో ఆరోపించింది.
ప్రభుత్వం తెస్తున్న పోర్టల్ ద్వారానే ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించాలన్న నిబంధనను బుక్ మై షో తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం నేరుగా తనకు తాను ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తే తమకు అభ్యంతరం లేదని.. అలా కాకుండా తమను కూడా ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రూపొందించిన వెబ్ సైట్ ద్వారానే టికెట్లు విక్రయించాలని ఆదేశించడం ఎంతవరకు సమంజసమని బుక్ మై షో ప్రశ్నించింది.
ప్రభుత్వానికి ప్రతి టికెట్‌పై సర్వీస్ చార్జ్ కింద 2 శాతం చెల్లించాలనడం, వారు రూపొందించిన వెబ్ సైట్ ద్వారానే తాము కూడా టికెట్లు విక్రయించాలని చెప్పడం ద్వారా ప్రభుత్వం గుత్తాధిపత్యానికి ప్రయత్నిస్తోందని.. ఇది ప్రైవేట్ వ్యాపార సంస్థలను దెబ్బతీయడమేనని ఆక్షేపించింది. ప్రభుత్వం పోర్టల్ ఏర్పాటు చేస్తే.. బుక్‌మై షోనూ దానికి అనుసంధానం చేస్తే అప్పుడు ప్రేక్షకులంతా ప్రభుత్వ పోర్టల్ నుంచే టికెట్లు కొంటారని.. ప్రభుత్వం వ్యాపారం చేయాలనుకుంటోందని బుక్ మై షో తరఫున హాజరైన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఆరోపించారు.
ఆ సమయంలో జోక్యం చేసుకున్న కోర్టు.. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదని ఎక్కడైనా ఉందా.. ఉంటే చూపండి అని ప్రశ్నించింది. జూలై 2 నుంచి ప్రభుత్వం తెస్తున్న కొత్త విధానాన్ని అడ్డుకోవాలని బుక్ మై షో తరఫున హాజరైన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోరారు. బుక్ మై షో అభ్యంతరాలను, అనుమానాలను ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరాం తోసిపుచ్చారు.
అధిక ధరలకు కళ్లెం వేయడం, దోపిడీ నుంచి ప్రేక్షకులను కాపాడేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగిందని వివరించారు. బుక్ మై షో ఇప్పటిలాగే తన పని చేసుకోవచ్చని.. కాకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వెబ్‌సైట్‌తో అనుసంధానం అయితే సరిపోతుందన్నారు. ప్రభుత్వం తెస్తున్న కొత్త విధానాన్ని కొద్దికాలమైన పరిశీలన చేయాలని, అప్పుడు అందులోని లాభనష్టాలు తెలుస్తాయన్నారు.
బుక్ మైషో లాంటి సంస్థలు రకరకాల చార్జీల పేరుతో ప్రేక్షకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయని, 100 రూపాయల టికెట్‌ను 145 రూపాయలకు అమ్ముతున్నారని వివరించారు. ఆన్‌లైన్‌లో 50 శాతం టికెట్లు విక్రయించి, మిగిలిన టికెట్లను థియేటర్ల వద్ద నేరుగా ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. బుక్ మై షో లాంటి సంస్థలు వంద శాతం టికెట్‌లను ఆన్‌లైన్‌లోనే బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్ముతున్నాయని ఏజీ వివరించారు.
ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల ధర్మాసనం సమయం మించి పోవడంతో తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.