Telugu Global
National

ఆకలితో…అలసటతో…500 రోజులుగా ఢిల్లీ గడ్డపై నిరసన…పట్టించుకునే నాథుడే లేడా ?

విశాల్ లాంగ్డేది మహారాష్ట్ర గోండియా జిల్లాలోని ఓ గ్రామం అతను 500 రోజులుగా ఇంటికి వెళ్ళలేదు రోడ్డుమీదే నిరసన ప్రదర్శనలో ఉన్నాడు. లాంగ్డే లాంటి అనేక మంది యువకులు ఆకలితో, అలసటతో 500 రోజులుగా రోడ్లమీదే ఉన్నారు. వీళ్ళంతా 2018 లో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో సెలక్ట్ అయిన వాళ్ళు. అయినా ఉద్యోగాలు లేకుండా ఆక్రోషిస్తున్న వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ”హోలీ, దీపావళి , […]

ఆకలితో…అలసటతో…500 రోజులుగా ఢిల్లీ గడ్డపై నిరసన…పట్టించుకునే నాథుడే లేడా ?
X

విశాల్ లాంగ్డేది మహారాష్ట్ర గోండియా జిల్లాలోని ఓ గ్రామం అతను 500 రోజులుగా ఇంటికి వెళ్ళలేదు రోడ్డుమీదే నిరసన ప్రదర్శనలో ఉన్నాడు. లాంగ్డే లాంటి అనేక మంది యువకులు ఆకలితో, అలసటతో 500 రోజులుగా రోడ్లమీదే ఉన్నారు. వీళ్ళంతా 2018 లో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో సెలక్ట్ అయిన వాళ్ళు. అయినా ఉద్యోగాలు లేకుండా ఆక్రోషిస్తున్న వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన చేస్తున్నారు.

”హోలీ, దీపావళి , ఇతర‌ అన్ని పండుగలుమాకు రోడ్లమీదే జరిగాయి. నేను మా కుటుంబం నుండి డబ్బు అడగలేను. కొంతమంది మా చేతుల్లో ఉన్న భారత జెండాను చూసి మాకు ఆహారం ఇస్తారు. అలా మేము బ్రతుకుతున్నాము ” అని లంగేడ్ మీడియాతో అన్నారు.

2018 లో జరిగిన‌ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ పరీక్షలో అర్హత సాధించిన 4,295 మంది అభ్యర్థులను ఎందుకు రిక్రూట్ చేయడం లేదో వాళ్ళకు ఇప్పటికీ అర్దం కాని ప్రశ్న.తమకు న్యాయం చేయమ‍ంటూ వీళ్ళంతా అనేక మంది అధికారులను కలిశారు. రాజకీయ నాయకులను కలిశారు. కేంద్ర మంత్రులను కలిశారు.ఎక్కడా వీళ్ళకు సరి అయిన సమాధానం రాలేదు. న్యాయం జరగలేదు.

జంతర్ మంతర్ కన్నా ముందు వీళ్ళు 2018 లో నాగ్ పూర్ లో 72 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. అప్పుడు పలువురు విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. నిరాహార దీక్ష వల్ల అనారోగ్యంపాలైన‌ సహచరులను పదుల కిలోమీటర్ల వరకు మోసుకెళ్ళే వీడియోలను లాంగ్డే మీడియాకు చూయించారు. ఎంపీ రాందాస్ అథవాలే, నితిన్ గడ్కరీలు వీళ్ళతో సమావేశాలు జరిపి హామీ ఇవ్వడంతో వారు నాగ్ పూర్ లో నిరసనను విరమించుకున్నారని, సమస్యను త్వరగా పరిష్కరించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు తెలిసింది. అయితే దీనిపై హోంశాఖ ఇప్పటి వరకు స్పందించలేదు.

ఆ తర్వాత వీళ్ళు తమ నిరసన వేదికను ఢిల్లీ జంతర్ మంతర్ కు మార్చారు. నాగ్ పూర్ నుంచి ఢిల్లీకి పాదయాత్రగా వెళ్ళారు. అక్కడ వీళ్ళకు పోలీసులనుండి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. తమ శాంతియుత నిరసనలను ఆపేందుకు గత ఏడాది జంతర్ మంతర్ వద్ద పోలీసులు హింస, బెదిరింపులకు పాల్పడ్డారని కొందరు విద్యార్థులు ఆరోపించారు.Image

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అమిత్ అనే అభ్యర్థి అత్యంత‌ పేదరికం నుంచి బయటపడాలంటే నాకున్న ఏకైక మార్గం ఈ ఉద్యోగమే అని చెప్పారు. “నా ఫలితాలు వచ్చిన రోజే బ్రెయిన్ హెమరేజ్ కారణంగా మా నాన్న చనిపోయారు. కుటుంబం బతకడం కోసం మా భూమిని తాకట్టు పెట్టాం.” అని అన్నాడు అమిత్.

అతన్ని చదువు కొనసాగించవచ్చుకదా అని అడిగినప్పుడు, ”నిజమే నేను చదువుకోవచ్చు. కానీ పని చేయడం మానేసి చదువుకుంటే నా తోబుట్టువులను. కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? ” అని ప్రశ్నించాడు.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మరో అభ్యర్థి సీమా ధ్రువ్ ఈ నిరసనలో పాల్గొనడం తన లాంటి యువతులకు ఎంత కష్టమో వివరించారు. ఈమెతో పాటు అనేక మంది యువతులు 500 రోజులుగా ఇంటికి వెళ్ళకుండా నిరసనల్లో పాల్గొంటున్నారు. అపరిశుభ్రమైన జీవన పరిస్థితుల కారణంగా రెండుసార్లు ఈమె తో పాటు అనేక మంది యువతులు ఆసుపత్రి పాలయ్యారు. “మాకు సరైన వాష్‌రూమ్‌లు లేవు. మేము ఎక్కడా స్నానం చేయలేము. పీరియడ్స్ వస్తే మా పరిస్థితి ఇక నరకమే. మొదట్లో నా కుటుంబం నేను తిరిగి ఇంటికి వచ్చేయాలని కోరుకున్నారు. కానీ నేను నిరసనను వదులుకోలేను. ఇప్పుడు వారు నా నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. “అని సీమా ధ్రువ్ తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే మాకు న్యాయం దక్కేవరకు మేము పోరాడుతూనే ఉంటామని ఆమె ధీమాగా చెప్పారు.Image

ఈ నిరసనకారుల్లో చాలామందికి ఉద్యోగాలకు వయో పరిమితి దాటి పోయింది. ఇది తప్ప వారికి మరో అవకాశమే లేకుండా పోయింది.

అయితే సంవత్సర కాలం నిరసనలు చేసిన రైతాంగం గురించి దేశమంతా స్పందించింది. చివరకు ప్రభుత్వమే దిగి వచ్చింది. ఇప్పుడు జంతర్ మంతర్ లో నిరసనలు చేస్తున్న , ఉద్యోగాలకు సెలక్ట్ అయిన ఈ నిరుద్యోగులు సంవత్సరం కాదు 500 రోజులుగా నిరసనలు చేస్తున్నారు. వీళ్ళంతా అత్యంత పేదరికం నుండి వచ్చినవాళ్ళు…. ప్రతి రోజూ భోజనం చేయడానికి, కనీస అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు లేని వాళ్ళు….. ఎవరైనా దయతలచి ఆహారం ఇస్తే తప్ప కడుపు నిండనివాళ్ళు… అయినా ధైర్యాన్ని కోల్పోకుండా, హింసకు పాల్పడకుండా శాంతియుతంగా పోరాడుతున్న వాళ్ళు…. వీళ్ళను ప్రభుత్వం ఎలాగూ పట్టించుకోవడం లేదు. ఓ నాలుగు వేల ఓట్లు రాకపోతే వాళ్ళకొచ్చే నష్టమేంలేదనుకునే మనస్థత్వం రాజకీయ నాయకులది. మరి మీడియా ఎందుకు వీళ్ళను పట్టించుకోవడం లేదు ? మనందరి లాగే మీడియా కూడా సున్నితత్వం కోల్పోయిందా ?

First Published:  29 Jun 2022 7:22 AM IST
Next Story