Telugu Global
NEWS

ఏపీలో మోడీ మీటింగ్‌కు చిరంజీవి.. రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న ఆహ్వానం

ఏపీలో రాజకీయ పరిణామాలు ఆనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. అప్పుడే రాష్ట్రంలోని పార్టీలన్నీ ఎన్నికల మూడ్‌లోకి వచ్చేశాయి. వైసీసీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లడం ఖాయమే. అయితే ప్రతిపక్ష పార్టీల్లో ఎలాంటి పొత్తులు ఉంటాయనేది తేలడం లేదు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకొని వెళ్తే.. తప్పకుండా మంచి పాజిటివ్ వేవ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ ఇటీవల ఇరు పార్టీల అధినేతలు కూడా ఈ పొత్తు విషయంలో సరైన క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు. అందుకు ప్రధాన కారణం […]

narendra modi and chiranjeevi
X

ఏపీలో రాజకీయ పరిణామాలు ఆనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. అప్పుడే రాష్ట్రంలోని పార్టీలన్నీ ఎన్నికల మూడ్‌లోకి వచ్చేశాయి. వైసీసీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లడం ఖాయమే. అయితే ప్రతిపక్ష పార్టీల్లో ఎలాంటి పొత్తులు ఉంటాయనేది తేలడం లేదు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకొని వెళ్తే.. తప్పకుండా మంచి పాజిటివ్ వేవ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ ఇటీవల ఇరు పార్టీల అధినేతలు కూడా ఈ పొత్తు విషయంలో సరైన క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు. అందుకు ప్రధాన కారణం బీజేపీ.

జనసేనతో తమకు పొత్తు ఉంటుందని బీజేపీ రాష్ట్ర నాయకులు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా జనసేన-బీజేపీ-టీడీపీ కలిసి పోటీ చేయాలని కోరుకుంటున్నారు. అయితే బీజేపీ-టీడీపీ మధ్య టర్మ్స్ సరిగా లేకపోవడంతో ఈ పొత్తు కుదరడం లేదు. బీజేపీని వదిలేసి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బాగనే ఉంటుందని జనసేనలో చర్చ జరుగుతున్నది. అయితే కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీని వదిలేస్తే భవిష్యత్‌లో ఏమైనా సమస్యలు ఎదురవుతాయేమోనని పవన్ కల్యాణ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఏపీలో ప్రతిపక్షాల పొత్తుల విషయంలో గందరగోళం నెలకొన్న సమయంలోనే ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకున్నది. జూలై 4న ప్రధాని మోడీ ఏపీ పర్యటనకు రానున్నారు. భీమవరంలో జరిగే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా.. దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆయన జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు.

ప్రధాని మోడీ పాల్గొనే ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. కేంద్ర పర్యాటక శాఖ నుంచి ఆయనకు ఈ ఇన్విటేషన్ అందడం గమనార్హం. రాష్ట్రంలో ఎంతో మంది మాజీ కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్లెవరికీ అందని ఆహ్వానం కేవలం చిరంజీవికి మాత్రమే అందడంపై బీజేపీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తున్నది. రాజ్యసభ ఎంపీ పదవీ కాలం ముగిసిన తర్వాత చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యారు. పేరుకు కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నా.. ఆయన ఏనాడూ ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు.

ఇటీవల టాలీవుడ్‌ సమస్యలను ఏపీ సీఎం జగన్‌ దృష్టికి తీసుకొని వెళ్లే క్రమంలో ఆయనతో కాస్త సన్నిహితంగా మెలిగారు. ఇండస్ట్రీ పెద్దగా మాత్రమే ఆయన కలిశారు తప్ప.. రాజకీయ పార్టీ నేతగా ఆయన ఆ సమావేశంలో పాల్గొనలేదు. ఇలా రాజకీయాలు మానేసి సినిమాలు చేసుకుంటున్న చిరంజీవికి ఆహ్వానం పంపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

జనసేన అధినేత పవన్ కల్యాన్ ఇటీవల టీడీపీకి దగ్గరవుతున్నారని గ్రహించిన బీజేపీ.. చిరంజీవి ద్వారా పవన్‌కు స్పష్టమైన సందేశం ఏమైనా పంపాలని భావించిందా? లేదంటే.. చిరంజీవిని బీజేపీలో చేర్చుకునే అవకాశం ఏమైనా ఉన్నదా అనే చర్చ జరుగుతున్నది.

జనసేన పార్టీకి చిరంజీవి మద్దతు ఉంటుందని తమ్ముడు నాగబాబు చెప్పడం తప్ప.. ఆ మాట చిరంజీవి నుంచి ఏనాడూ రాలేదు. ఒకసారి రాజకీయాల్లో చేతులు కాల్చుకున్న చిరంజీవి.. తిరిగి ఏదైనా పార్టీలో యాక్టీవ్ అవుతారా అనేది కూడా అనుమానమే. దీంతో అసలు ఆహ్వానం ఎందుకు పంపారనే విషయంపై గందరగోళం నెలకొన్నది. ఈ విషయంపై మోడీ పర్యటన అనంతరం పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.

First Published:  29 Jun 2022 10:31 AM IST
Next Story