మరాఠా ‘ఆత్మ’కు బీజేపీ తూట్లు
ఒకప్పుడు తోకపార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఎట్టకేలకు మహారాష్ట్రలో చక్రం తిప్పగలిగేలా కుటిల రాజకీయాలు చేస్తోంది. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ కనుసన్నల్లో మెలిగిన బీజేపీ చివరికి ఆ పార్టీ మూల సిద్ధాంతాన్నే ప్రశ్నార్థకం చేసే రాజకీయం చేస్తోంది. మరాఠీ ఆత్మకు బీజేపీ తూట్లు పొడిచిందని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చగన్ భుజబల్, నారాయణ రాణే, రాజ్ ఠాక్రే వంటి వారు కూడా అలజడి సృష్టించగలిగారే కానీ సునామీ కాలేకపోయారు. […]
ఒకప్పుడు తోకపార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఎట్టకేలకు మహారాష్ట్రలో చక్రం తిప్పగలిగేలా కుటిల రాజకీయాలు చేస్తోంది. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ కనుసన్నల్లో మెలిగిన బీజేపీ చివరికి ఆ పార్టీ మూల సిద్ధాంతాన్నే ప్రశ్నార్థకం చేసే రాజకీయం చేస్తోంది.
మరాఠీ ఆత్మకు బీజేపీ తూట్లు పొడిచిందని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చగన్ భుజబల్, నారాయణ రాణే, రాజ్ ఠాక్రే వంటి వారు కూడా అలజడి సృష్టించగలిగారే కానీ సునామీ కాలేకపోయారు.
అయితే నరేంద్ర మోడీ, అమిత్ షా కనుసన్నల్లోని బీజేపీ ఏక్ నాథ్ షిండేను శిఖండిగా ముందుపెట్టి నాటకాలాడించి ఇదంతా షిండే చేయగలిగాడనిపించింది. వీరంతా ఇలా చేయడం వల్ల మరాఠా అస్థిత్వానికి ద్రోహం చేసినవారిగానే మిగిలిపోతారని ఉద్ధవ్ ధ్వజమెత్తుతున్నారు.
లోక్ సభ మాజీస్పీకర్ మనోహర్ జోషి ఒక సందర్భంలో శివసేనను ఒక సింహాల గుహగా అభివర్ణించారు. దానిలోకి వెళ్ళడమే కానీ బయటికి రావడం అంటూ ఉండదన్నారు. కానీ నేడు అది ముక్కచెక్కలై మూలాలను కోల్పోయే పరిస్ఠితి వచ్చింది.
ఎవరీ బాలా సాహెబ్ ?
సంస్కర్తగా పేరొందిన కేశవ్ సీతారాం ప్రబోధంకర్ ఠాక్రే కుమారుడు బాలాసాహెబ్ ఠాక్రే. ప్రబోధంకర్ సామాజక స్పృహ కలిగిన సంస్కరణ వాది. దళితులను దేవాలయంలో పూజలకు అనుమతించలేదని ఆగ్రహించి ఆ గుడినే బహిష్కరించాలని పలుపునిచ్చిన వ్యక్తి.
తన కుమారుడు బాలాసాహెబ్ ను మహా రాష్ట్రీయుల సంరక్షణకు అకింతమిస్తున్నానని ఒక బహిరంగ సభలో ప్రకటించారు. ‘మహారాష్ట్రీయుల కోసమే మహారాష్ట్ర’ అనే నినాదాన్నితన కొడుకు ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నారు.
ముంబైలో ట్రేడ్ యూనియన్ల ఉద్యమాలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ బాలాసాహెబ్ ను ప్రోత్సహించింది. ఆ పార్టీ ఆర్ధిక సహాకారంతో 1966 లో మరాఠీ స్థానికులకు ప్రయోజనం కలగాలనే ఉద్దేశంతో బాలా సాహెబ్ ఠాక్రే శివసేనను స్థాపించారు.
శివసేన సంప్రదాయ రాజకీయ పార్టీ కాదు. ఒక వ్యక్తి ఆరాధనా సమూహంగా ఏర్పడింది. దాని వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే ఆలోచనతో మరాఠీ ప్రజల స్థానికతను పరిరక్షించే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. ఆయన మాటే శాసనంగా, ఆయనే ఒక సర్కార్ గా చెలామణి అయ్యేది. మరాఠీ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసే నిబద్ధత గల పార్టీ గా పేరొందింది. ఆయన ఒక మాట చెబితే వెనకా ముందు ఆలోచించకుండా గుడ్డిగా దూసుకెళ్ళే పార్టీగా పేరొందింది. 1970ల మధ్యలో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి ఠాక్రే మద్దతు ఇచ్చారు.
అప్పుడు శివసేన హిందూత్వ పార్టీ కాదు. ఇతర రాష్ట్రాల నుండి తమ జీవనోపాధి కోసం ముంబైకి వస్తున్న వలసదారుల వల్ల బెదిరింపులు ఎదుర్కొంటున్న ‘మరాఠీ మనుష్’ కోసం నిలబడిన పార్టీ మాత్రమే. ఢిల్లీ, ముంబై మధ్య ఏర్పడిన రాజకీయ ఉద్రిక్తతలో మరాఠీ గుర్తింపును కాపాడుకోవడం కోసం ఇప్పుడు కూడా పోరాటం చేయాల్సి వస్తోంది.
తోక ఝాడించిన బీజేపీ..!
ఎన్నికల రాజకీయాల్లో బీజేపీ కన్నా బలంగా ఉన్నంత కాలం సేన బీజేపీతో బాగానే ఉంది. ఠాక్రే నివాసమైన ‘మాతోశ్రీ ని నిర్లక్ష్యం చేసి మహారాష్ట్ర రాజకీయాల్లో నిలదొక్కుకోవడం బీజేపీ నేతలెవరికీ సాధ్యపడలేదు. ఈ పరిస్థితిని సహించలేకపోయారు, కానీ కేంద్రంలో బీజేపీకి సుప్రీం కమాండర్‌గా నరేంద్ర మోడీ ఆవిర్భవించడంతో సమీకరణాలు మారిపోయాయి. 2014లో, సేన ,బీజేపీ విడివిడిగా ఎన్నికలలో పోటీ చేశాయి, శివసేన వాస్తవానికి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వలేదు, కానీ తరువాత ఇవ్వక తప్పలేదు. ప్రభుత్వ కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, ప్రతిపక్ష పార్టీలన్నింటి కంటే శివసేన మోడీ, బీజేపీ లను ఎక్కువగానే విమర్శించింది.
ఎందుకు బీజేపీతో పొసగలేదు..
2019లో, శివసేన, బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ, దానిపై అపనమ్మకం వల్ల బీజేపీ తో విడిపోవాలని నిర్ణయించుకుంది. బీజేపీ మరాఠా అస్తిత్వానికంటే తన సొంత ప్రయోజనాలే ముఖ్యంగా చూసుకుంటుందని భావించారు ఉద్ధవ్ ఠాక్రే . అందుకే తమ పార్టీ సిద్ధాంతానికి భిన్నమైనా బీజేపీ కంటే ప్రమాదకరం కాదని భావించి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో జతకట్టి మహా వికాస్ అఘాడీ పేరుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఉద్దవ్ పదవీకాంక్ష వల్లే ఇలా చేశారనేవారు కూడా లేకపోలేదు. కేంద్రంలో కాంగ్రెస్ స్థానంలో బీజేపీ వచ్చిన తర్వాత మరాఠీ అస్మితపై ఆధిపత్యం చెలాయించే ‘న్యూ’ ఢిల్లీగా మారిందని బీజేపీని శివసేన అంచనా వేస్తోంది. బీజేపీ, ఎన్సిపీ , కాంగ్రెస్‌పార్టీలు శివసేనకు షరతులను నిర్దేశించే పరిస్థితిలో లేవు, కానీ బీజేపీ ఆ పని చేసే స్థాయికి చేరడమే కాక ఆదేశించే స్థాయికి చేరుకుంది.
షిండే బీజేపీ కీలుబొమ్మ!
ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంపై తిరుగుబాటుకు ఏక్‌నాథ్ షిండే కారణంగా పైకి కనిపిస్తున్నప్పటికీ అతణ్ణి బీజేపీ వెనకనుంచి నడిపిస్తున్నదని స్పష్టమైంది కదా. ఆ విషయాన్ని నిస్సిగ్గుగా బీజేపీయే అధికారికంగా ప్రకటించుకుంది. ఒకప్పుడు ఆటో డ్రైవర్ గా ఉండే ఏక్ నాథ్ షండే అంచలంచెలుగా శివసేన పార్టీలో సిద్ధాంతాన్ని కాపాడే సీనియర్ గా పేరుండేది. అయితే ఆయన ఢిల్లీ బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారడంతో మరాఠీ అస్మితకు ప్రతీక కాగలరా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి, షిండే అతని వర్గం విజేతగా కనిపించవచ్చు, కానీ దీర్ఘకాలంలో, వారు మరాఠీ వాదానికి వెన్నుపోటు పొడిచిన ద్రోహులుగానే కనిపిస్తారు.