Telugu Global
NEWS

నాదీ బాలినేని పరిస్థితే- కోటంరెడ్డి

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై టీడీపీ, జనసేన నేతలే కాకుండా వైసీపీకి చెందిన ఒక ముఖ్యనేత కూడా కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బాలినేనిపై కుట్రలు మానుకోవాలని టీడీపీ, జనసేన నేతలకు సూచించారు. మూడు జిల్లాలకు ఇన్‌చార్జ్‌గా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై సొంత పార్టీ నేతలు కూడా కుట్రలకు దిగడం విచారకరమన్నారు. […]

నాదీ బాలినేని పరిస్థితే- కోటంరెడ్డి
X

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై టీడీపీ, జనసేన నేతలే కాకుండా వైసీపీకి చెందిన ఒక ముఖ్యనేత కూడా కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

బాలినేనిపై కుట్రలు మానుకోవాలని టీడీపీ, జనసేన నేతలకు సూచించారు. మూడు జిల్లాలకు ఇన్‌చార్జ్‌గా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై సొంత పార్టీ నేతలు కూడా కుట్రలకు దిగడం విచారకరమన్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వ్యక్తి ఆత్మస్థైర్యం దెబ్బతింటే అది పార్టీకే నష్టమన్నారు. ఆ పరిస్థితి రాకుండా జగన్‌మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు.

సోనియా గాంధీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పెద్దల వరకు మంత్రి పదవికి రాజీనామా చేయవద్దని కోరినా లెక్క చేయకుండా జగన్‌ కోసం వచ్చిన వ్యక్తిపైనే కుట్రలు చేయడం సరైనది కాదన్నారు. అచ్చం బాలినేని శ్రీనివాస్ రెడ్డి పరిస్థితినే తానూ ఎదుర్కొంటున్నానని కోటంరెడ్డి వివరించారు.

నెల్లూరు జిల్లాకే చెందిన కొందరు వైసీపీ ముఖ్య నేతలు… తన నియోజకవర్గంలో వేలు పెడుతున్నారని ఆరోపించారు. తనను బలహీనపరిచేందుకు కుట్రలు చేస్తున్నారని వివరించారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియన ముఖ్యనేతలు ఈ పని చేస్తున్నారని ఆరోపించారు.

సొంత నియోజకవర్గంలో తిరిగి ఎలా గెలవాలా?, ప్రజలకు ఎలా అందుబాటులో ఉండాలా అన్న విషయాలను మానేసి తన నియోజకవర్గంలోకి వేలు పెడుతున్నారని ఆవేదన చెందారు.

జిల్లాలో ఓదార్పు యాత్ర మొత్తం తన నెత్తిన వేసుకుని నడిపించానని.. తనకూ ప్రతి నియోజకవర్గంలోనూ పరిచయాలున్నాయని.. ఇలాగే తన నియోజకవర్గంలో ముఖ్యనేతలు వేలు పెడితే.. తాను కూడా వారి నియోజకవర్గాల్లో వేలు పెడుతానని కోటంరెడ్డి హెచ్చరించారు.

ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఒకవేళ సమస్య పరిష్కారం కాకుంటే.. తాను కూడా వారి నియోజకవర్గాల్లో వేలుపెట్టడం మినహా మరో ఆప్షన్ లేదన్నారు. ఎవరి ఇల్లు వారు చక్క దిద్దుకుంటే బాగుంటుందన్నారు.

First Published:  28 Jun 2022 2:26 AM GMT
Next Story