‘పెన్షన్ లేని అగ్నివీరులు రిటైరయితే వారిని పెళ్లాడేది ఎవరు’? ఓ గవర్నర్ సెటైర్
ప్రధాని మోడీ ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ పథకంపై ఇప్పటికీ విమర్శనాస్త్రాలు ఆగలేదు. వ్యతిరేకత వెల్లువెత్తుతూనే ఉంది. ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని తాజాగా మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్.. ప్రభుత్వాన్ని కోరారు. పెన్షన్ లేని అగ్నివీరులను ఎవరు పెళ్లి చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఇది ఈ దేశ యువత ప్రయోజనాలకు ఉపయోగపడేట్టు లేదని, పైగా ఈ పథకం కారణంగా ప్రభుత్వానికి, గ్రామాలకు మధ్య దూరం పెరుగుతుందని ఆయన అన్నారు. అగ్నిపథ్ స్కీం కి వ్యతిరేకంగా ఓ గవర్నర్ మాట్లాడడం […]
ప్రధాని మోడీ ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ పథకంపై ఇప్పటికీ విమర్శనాస్త్రాలు ఆగలేదు. వ్యతిరేకత వెల్లువెత్తుతూనే ఉంది. ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని తాజాగా మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్.. ప్రభుత్వాన్ని కోరారు. పెన్షన్ లేని అగ్నివీరులను ఎవరు పెళ్లి చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు.
ఇది ఈ దేశ యువత ప్రయోజనాలకు ఉపయోగపడేట్టు లేదని, పైగా ఈ పథకం కారణంగా ప్రభుత్వానికి, గ్రామాలకు మధ్య దూరం పెరుగుతుందని ఆయన అన్నారు. అగ్నిపథ్ స్కీం కి వ్యతిరేకంగా ఓ గవర్నర్ మాట్లాడడం ఇదే మొదటిసారి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలతో బాటు బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ-యూ కూడా దీన్ని వ్యతిరేకించింది. బీహార్ లో మొదట యువత రైళ్లకు, బస్సులు, ఇతర వాహనాలకు నిప్పు పెట్టి తమ ఆగ్రహం వెళ్లగక్కారు.
జూన్ 14 న కేంద్రం ఈ పథకాన్ని ప్రకటించినప్పటి నుంచి దేశంలో సుమారు 14 రాష్ట్రాల్లో యువత నుంచి నిరసనలు పెల్లుబికాయి. మైసూరులో నిన్న కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ పథకాన్ని ఉపసంహరించుకునేంత వరకు తమ నిరసనలు ఆగవని వారు హెచ్చరించారు.
హర్యానాలో ఖాప్ నేతలు, రైతులు నిన్న రోహతక్ లో పాదయాత్రలు నిర్వహించారు. పంజాబ్ లో సైతం సంయుక్త కిసాన్ మోర్చా.. ఈ పథకం సైన్యానికి , రైతులకు, దేశానికి వ్యతిరేకమని పేర్కొంది. తాము కూడా ఉధృతంగా ఆందోళనకు దిగుతామని రైతు సంఘాల నేతలు తెలిపారు. ఈ నగరంలో వీరితో బాటు సామాజిక కార్యకర్తలు, యువకులు, విద్యార్థులు.. స్థానిక అధికారులకు మెమొరాండంలు సమర్పించారు.
అహింసాయుతంగా తమ ఆందోళన కొనసాగిస్తామని, కేంద్రం దీన్ని వెనక్కి తీసుకునేంతవరకు ఇది కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. కర్నాల్ జిల్లాలోనూ భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యాన నిరసన ప్రదర్శనలు జరిగాయి. పాత పద్దతిలోనే సైన్యంలో నియామకాలు చేపట్టాలని ఈ సంఘం నేత రతన్ మాన్ డిమాండ్ చేశారు.