Telugu Global
National

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం: సేన రెబ‌ల్‌ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో తాత్కాలిక‌ ఊర‌ట

ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని రెబ‌ల్ శివసేన ఎమ్మెల్యేల‌కు సుప్రీంకోర్టులో సోమవారం నాడు తాత్కాలికంగా ఊర‌ట ల‌భించింది. డిప్యూటీ స్పీకర్‌ వారికి పంపిన అనర్హత నోటీసులపై సమాధానం ఇవ్వడానికి జూలై 12 దాకా సమయమిచ్చింది. అప్పటిదాకా అనర్హత ప్రక్రియపై ఎలాంటి చర్యలూ తీసుకోవ‌ద్ద‌ని మ‌హారాష్ట్ర డిప్యూటీ స్పీక‌ర్ ను ఆదేశించింది. తిరుగుబాటు చేసిన 39 మంది శివసేన ఎమ్మెల్యేల ఆస్తులు ప్రాణాల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలని మహారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. రెబెల్ ఎమ్మెల్యేల అన‌ర్హ‌త నోటీసుల చ‌ట్ట‌త‌బ‌ద్ద‌త‌ను ప్ర‌శ్నిస్తూ […]

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం: సేన రెబ‌ల్‌ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో తాత్కాలిక‌ ఊర‌ట
X

ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని రెబ‌ల్ శివసేన ఎమ్మెల్యేల‌కు సుప్రీంకోర్టులో సోమవారం నాడు తాత్కాలికంగా ఊర‌ట ల‌భించింది. డిప్యూటీ స్పీకర్‌ వారికి పంపిన అనర్హత నోటీసులపై సమాధానం ఇవ్వడానికి జూలై 12 దాకా సమయమిచ్చింది. అప్పటిదాకా అనర్హత ప్రక్రియపై ఎలాంటి చర్యలూ తీసుకోవ‌ద్ద‌ని మ‌హారాష్ట్ర డిప్యూటీ స్పీక‌ర్ ను ఆదేశించింది. తిరుగుబాటు చేసిన 39 మంది శివసేన ఎమ్మెల్యేల ఆస్తులు ప్రాణాల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలని మహారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. రెబెల్ ఎమ్మెల్యేల అన‌ర్హ‌త నోటీసుల చ‌ట్ట‌త‌బ‌ద్ద‌త‌ను ప్ర‌శ్నిస్తూ వారు దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై కౌంట‌ర్ అఫిడ‌విట్లు దాఖ‌లు చేయాల‌ని డిప్యూటీ స్పీక‌ర్‌, ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

అయితే, చ‌ట్ట విరుద్దంగా జ‌రిగిన ప్ర‌తీసారి తాము కోర్టును ఆశ్ర‌యించ‌లేమ‌ని, అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించ‌కుండా మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కోర‌గా అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జ‌స్టిస్ సూర్యకాంత్, జ‌స్టిస్ జెబి పార్దివాలాలతో కూడిన వెకేషన్ బెంచ్ రెబ‌ల ఎమ్మ‌ల్యేల పిటిష‌న్ విచారించింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌కు నోటీసు జారీ చేస్తూ, తిరుగుబాటు ఎమ్మెల్యేలు తనపై ఇచ్చిన అవిశ్వాస నోటీసుకు సంబంధించిన అఫిడవిట్ రికార్డులను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను జులై 11 కు వాయిదా వేసింది.

డిప్యూటీ స్పీక‌ర్ అధికారాల‌పై తేల్చాలి..
స్పీకర్/డిప్యూటీ స్పీకర్ తీసుకునే అనర్హత ప్రక్రియలు, సభా కార్యకలాపాల‌లో కోర్టులు జోక్యం చేసుకోలేవని డిప్యూటీ స్పీకర్ ఇతర ప్రతివాదుల తరపున వాద‌న‌లు వినిపించిన సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, దేవదత్ కామత్ కోర్టుకు చెప్పారు. అయితే న్యాయ సమీక్షను నిషేధించబోమని సుప్రీంకోర్టు గ‌తంలో ఇచ్చిన తీర్పును ధర్మాసనం ప్రస్తావించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 179 ప్రకారం డిప్యూటీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు పెండింగ్‌లో ఉండ‌గా, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను జారీ చేసే అధికారం ఆయ‌న‌కు ఉంటుందా లేదా అనే విష‌యం ముందు తేలాల‌ని జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యానించారు.

ఆ అధికారం డిప్యూటీ స్పీకర్‌కు ఉండదని గతంలో నబమ్‌ రెబియా కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని 15 మంది రెబెల్‌ ఎమ్మెల్యేల తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది నీరజ్‌ కిషన్‌ కౌల్‌ ధర్మాసనానికి తెలిపారు. రెబెల్‌ ఎమ్మెల్యేలు ఈ పిటిషన్లు హైకోర్టులో కాకుండా నేరుగా సుప్రీంకోర్టులో ఎందుకు వేశారని ధర్మాసనం ప్రశ్నించింది. ముంబైలో పరిస్థితులు వారికి అనుకూలంగా లేక‌పోవ‌డంతో సుప్రీం కోర్టును ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు. షిండే స‌హా 16 మంది రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు డిప్యూటీ స్పీక‌ర్ న‌ర‌హ‌రి జిర్వాల్ అన‌ర్హ‌త పిటిష‌న్లు ఇచ్చారు. 27వ తేదీ సాయంత్రం 5.30 లోగా జ‌వాబు ఇవ్వాల‌ని ఆదేశించారు. వారు సుప్రీం కోర్టులో వీటిని స‌వాల్ చేస్తూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. డిప్యూటీ స్పీక‌ర్ పై అవిశ్వాసం వ్య‌క్తం చేస్తూ తాము ఇప్ప‌టికే ఆయ‌న‌కు నోటీసు పంపామ‌ని అది పెండింగ్ లో ఉండ‌గా త‌మ‌కు అన‌ర్హ‌త పిటిష‌న్లు జారీ చేసే అధికారం ఉండ‌ద‌ని వారు పేర్కొన్నారు.

గ‌వ‌ర్న‌ర్ ను క‌ల‌వ‌నున్న రెబ‌ల్స్‌!
త్వరలోనే రెబెల్‌ ఎమ్మెల్యేల ప్ర‌తినిధులు గవర్నర్‌ కోష్యారీని కలిసి, బలపరీక్ష పెట్టాల్సిందిగా కోరతారని తెలుస్తోంది. ఈ వారాంతంలో గవర్నర్‌ ఫ్లోర్‌ టెస్టుకు ఆదేశిస్తారని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా, తిరుగుబాటు చేసినవారిలో ఉన్న మంత్రుల‌ను ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ సోమ‌వారంనాడు తొల‌గించారు. వారి శాఖ‌ల‌ను మిగిలిన మంత్రుల‌కు అప్ప‌గించిన విష‌యం తెలిసిందే.

First Published:  28 Jun 2022 3:55 AM IST
Next Story