జగన్నాథ రథయాత్ర విశేషాలివే..
ఈ సంవత్సరం జగన్నాథుని రథయాత్ర జూలై 1 నుంచి ప్రారంభమవుతుంది. ఏటా ఈ రథయాత్రలో పాల్గొనడానికి లక్షల మంది పూరికి చేరుకుంటారు. దేశ విదేశాల నుంచి జగన్నాథుడి భక్తులు ఈ రథయాత్రలో పాలుపంచుకుంటారు. ఇంతగా ప్రసిద్ధి చెందిన ఈ యాత్ర విశేషాలేంటో ఓసారి తెలుసుకుందాం. జగన్నాథ రథయాత్ర ఆషాఢ మాసం శుక్ల పక్షం రెండో తేదీన జరుగుతుంది. ఈ యాత్రకై మూడు రథాలు సిద్ధం చేస్తారు. వాటిలో ఒకటి శ్రీకృష్ణుడికి.. మిగతావి కృష్ణుడి సోదరుడు బలరాముడు, సోదరి […]
ఈ సంవత్సరం జగన్నాథుని రథయాత్ర జూలై 1 నుంచి ప్రారంభమవుతుంది. ఏటా ఈ రథయాత్రలో పాల్గొనడానికి లక్షల మంది పూరికి చేరుకుంటారు. దేశ విదేశాల నుంచి జగన్నాథుడి భక్తులు ఈ రథయాత్రలో పాలుపంచుకుంటారు. ఇంతగా ప్రసిద్ధి చెందిన ఈ యాత్ర విశేషాలేంటో ఓసారి తెలుసుకుందాం.
జగన్నాథ రథయాత్ర ఆషాఢ మాసం శుక్ల పక్షం రెండో తేదీన జరుగుతుంది. ఈ యాత్రకై మూడు రథాలు సిద్ధం చేస్తారు. వాటిలో ఒకటి శ్రీకృష్ణుడికి.. మిగతావి కృష్ణుడి సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రల కోసం. శ్రీ కృష్ణుడి రథాన్ని గరుడధ్వజ అని పిలుస్తారు. ఈ రథం రంగు ఎల్లప్పుడూ పసుపు లేదా ఎరుపు రంగులో ఉంటుంది. బలరాముడి రథాన్ని తలధ్వజ అని పిలుస్తారు.
ఈ రథం రంగు ఎరుపు, ఆకుపచ్చలో ఉంటుంది. అలాగే సుభద్ర రథం రంగు నలుపు లేదా నీలం రంగులో ఏర్పాటు చేస్తారు. పురాణాల ప్రకారం ప్రతీఏటా జగన్నాథుడు రథయాత్ర ద్వారా తన మేనత్త ఆలయాన్ని సందర్శిస్తాడట.
దానికి ప్రతిరూపంగానే ఈ యాత్రను నిర్వహిస్తారు. ఈ యాత్ర ఆచారం ప్రకారం కృష్ణుడు.. పూరీ ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉడే గుండిచా అమ్మవారి గుడికి వెళ్లి తొమ్మిది రోజుల పాటు ఆ ఆలయంలో ఉండి తిరిగి ఆషాఢమాసంలోని పదోరోజున పూరీ గుడికి చేరుకుంటాడు.
ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్రగా పూరీ జగన్నాథుని రథయాత్రకు పేరుంది. జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతిసారి కొత్త రథాలను తయారుచేస్తారు. వీటి తయారీని అక్షయతృతీయ రోజున మొదలుపెడతారు. ప్రపంచంలో ఏ గుడిలో అయినా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగింపుకి వాడతారు. కానీ పూరీలో.. సాక్షాత్తు గర్భగుడిలో ఉండే దేవుళ్లే గుడి బయటకు వస్తారు.
ఆ సమయంలో వాళ్లని భక్తులంతా దర్శనం చేసుకోవచ్చు. జగన్నాథుని రథాన్ని తయారుచేసేందుకు కొన్ని లెక్కలు ఉంటాయి. ఏ రథం ఎన్ని అడుగులు ఉండాలి. దానికి ఎన్ని చక్రాలు ఉండాలి. ఆ చక్రాలు ఎంత ఎత్తు ఉండాలిలాంటి లెక్కల్ని తు.చ. తప్పకుండా పాటించాలి.
జగన్నాథుడు తన గుడికి తిరిగి వచ్చిన తర్వాత ‘సునా బేషా’ అనే ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంలో దేవుడి విగ్రహాలను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. దీనికోసం దాదాపు 208 కిలోల బంగారు నగలను ఉపయోగిస్తారు.
ఇక మరో విశేషం ఏంటంటే.. ప్రతీ సంవత్సరం జగన్నాథుని రథయాత్ర సమయంలో వర్షం పడడం ఆనవాయితీగా వస్తుంది. ఇది భక్తులు దేవతల దీవెనగా, శుభప్రదంగా భావిస్తారు.