Telugu Global
NEWS

సొంతంగా అధికారం.. బీజేపీ-జనసేన దూరం దూరం..

2024 ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఆ మధ్య మూడు ఆప్షన్లు ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ మాట మార్చిన సంగతి తెలిసిందే. జనసేనకు ఈసారి అధికారం ఇవ్వండి, మార్పు ఎలా ఉంటుందో చూపిస్తామంటూ పవన్ పదే పదే తన ప్రసంగాల్లో పేర్కొంటున్నారు. కనీసం బీజేపీ ప్రస్తావన కూడా ఆయన తేవడంలేదు. ఇప్పుడు బీజేపీ కూడా అదే రూట్లో ప్రచారం మొదలు పెట్టింది. ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయం కేవలం బీజేపీయేనంటున్నారు […]

సొంతంగా అధికారం.. బీజేపీ-జనసేన దూరం దూరం..
X

2024 ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఆ మధ్య మూడు ఆప్షన్లు ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ మాట మార్చిన సంగతి తెలిసిందే. జనసేనకు ఈసారి అధికారం ఇవ్వండి, మార్పు ఎలా ఉంటుందో చూపిస్తామంటూ పవన్ పదే పదే తన ప్రసంగాల్లో పేర్కొంటున్నారు. కనీసం బీజేపీ ప్రస్తావన కూడా ఆయన తేవడంలేదు.

ఇప్పుడు బీజేపీ కూడా అదే రూట్లో ప్రచారం మొదలు పెట్టింది. ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయం కేవలం బీజేపీయేనంటున్నారు ఆ పార్టీ నేతలు. వచ్చే దఫా బీజేపీ అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో చూడండి అంటూ ఓ జాబితా ఏకరువు పెడుతున్నారు.

సొంతగా అధికారం..
ఇన్నాళ్లూ.. బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని చెబుతూ వచ్చిన కమలదళం.. ఆత్మకూరు ఉప ఎన్నికల తర్వాత పంథా మార్చినట్టు తెలుస్తోంది. ఉప ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ కనీసం మాట సాయం చేయకపోవడం, స్థానికంగా జనసేన శ్రేణులు లోపాయికారీగా కూడా కలసి రాకపోవడం, డిపాజిట్ కోల్పోయి ఘోర అవమానం మిగిలిన సందర్భంలో.. బీజేపీ నేతలు కొత్త పల్లవి అందుకున్నారు.

ఏపీలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు. అధికారంలోకి వచ్చాక ఏపీని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామని, అమరావతికి 10వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తామని, రాజధానిని అభివృద్ధి చేస్తామని చెబుతున్నారాయన.

మేమే.. మేము మాత్రమే..
బీజేపీ నేతల వ్యాఖ్యలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. మేమే అధికారంలోకి వస్తాం, మేము మాత్రమే అధికారంలోకి వస్తామంటున్నారు. ఏపీలో వైసీపీకి బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎందుకు మారకూడదంటూ ప్రశ్నిస్తున్నారు వీర్రాజు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా కేంద్రాలనుంచి కాకుండా.. ఎఫ్.సి.ఐ. ద్వారా ధాన్యం సేకరణ చేపడతామని భరోసా ఇస్తున్నారాయన. టిడ్కో ఇళ్లను కూడా తామే పూర్తి చేస్తామంటున్నారు.

డిపాజిట్ గల్లంతు దగ్గర్నుంచి రెండేళ్లలో అధికారం ఎలా సాధ్యం..
బీజేపీ నేతల మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నాయి. అధికారంలోకి వస్తామని చెబుతున్నా.. ఇక్కడ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు. ప్రధాన పార్టీలు పోటీకి దూరంగా ఉన్నా కూడా బీజేపీ పరిస్థితి అంత దారుణంగా ఉందంటే.. రేపు ముక్కోణపు పోటీ జరిగితే, బీజేపీకి ఓటేసే దిక్కెవరని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కానీ పవన్ కల్యాణ్ తనకు తానే దూరమవుతున్న సందర్భంలో.. బీజేపీ కూడా మాట మార్చక తప్పడంలేదు. మీడియా ప్రశ్నిస్తే పొత్తులో ఉన్నామని చెబుతారు, లేకపోతే.. తమ పార్టీయే అధికారంలోకి వస్తుందంటారు. కూటమికి ఇక బీజేపీ, జనసేన రెండూ బైబై చెప్పేసినట్టే అనుకోవాలి.

First Published:  27 Jun 2022 9:40 PM GMT
Next Story