Telugu Global
National

నాలుగేళ్ల క్రితం వివాదాస్పద ట్వీట్.. ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు అరెస్టు

ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్ ఆల్ట్ న్యూస్ (Alt News) సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నాలుగేళ్ల క్రితం చేసిన ఓ ట్వీట్ వల్ల ఒక మతానికి చెందిన వారి మనోభావాలను గాయపరిచాడని ఆయనపై సోషల్ మీడియా యూజర్ ఫిర్యాదు చేశారు. దీంతో జుబేర్‌పై పోలీసులు ఐపీసీ 153-ఏ (వేర్వేరు వర్గాల మధ్య శత్రుత్వం పెంచడం), 295-ఏ (మత విశ్వాసుల మనోభావాలను గాయపరచడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, సోమవారం […]

నాలుగేళ్ల క్రితం వివాదాస్పద ట్వీట్.. ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు అరెస్టు
X

ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్ ఆల్ట్ న్యూస్ (Alt News) సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నాలుగేళ్ల క్రితం చేసిన ఓ ట్వీట్ వల్ల ఒక మతానికి చెందిన వారి మనోభావాలను గాయపరిచాడని ఆయనపై సోషల్ మీడియా యూజర్ ఫిర్యాదు చేశారు. దీంతో జుబేర్‌పై పోలీసులు ఐపీసీ 153-ఏ (వేర్వేరు వర్గాల మధ్య శత్రుత్వం పెంచడం), 295-ఏ (మత విశ్వాసుల మనోభావాలను గాయపరచడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, సోమవారం అరెస్టు చేశారు. కాగా, కంప్ల‌యింట్ ఇచ్చిన వ్యక్తి పేరు తెలియదని.. కానీ అతడి ట్విట్టర్ అకౌంట్ పేరు హనుమాన్ భక్త్, ప్రొఫైల్ పిక్ హనుమంతుడి ఫొటో ఉందని పోలీసులు చెప్పారు.

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ ఇటీవల ఒక టీవీ డిబేట్‌లో మహ్మద్ ప్రవక్తను అవమానించేలా మాట్లాడారు. ఈ కామెంట్లను తొలుత జుబేర్ హైలైట్ చేశాడు. ప్రవక్తపై వ్యాఖ్యల కారణంగా దేశవ్యాప్తంగా ముస్లింలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. యూపీలో కూడా ఆందోళనలు నిర్వహించారు. అనేక ముస్లిం దేశాలు ఈ వ్యాఖ్యలను ఆధారం చేసుకొని ఇండియాపై తీవ్ర ఒత్తిడి తీసుకుచ్చాయి. ఆల్ట్ న్యూస్ హైలైట్ చేయడంతో నుపుర్ శర్మతో పాటు నవీన్ కుమార్ జిందాల్‌ను కూడా పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసింది.

ఈ క్రమంలో జుబేర్ నాలుగేళ్ల క్రితం చేసిన ట్వీట్ ఆధారంగా కేసు నమోదు కావడం, అరెస్టు కావడం చకచకా జరిగిపోయాయి. అతడి అరెస్టుపై విపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. టీఎంసీ, ఆర్జేడీ, కాంగ్రెస్, ఏఐఎంఐఎం, వామపక్ష పార్టీలు అతడి అరెస్టును ఖండించాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తాము చేస్తున్న అసత్య ప్రచారాలు, విద్వేష ప్రసంగాలను ఖండించే వారిని ఇలా ఇబ్బందులు పెడుతుందని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. నిజాన్ని చెప్పే ఒక గొంతును అరెస్టు చేస్తే.. వెయ్యి గొంతులు పుట్టుకొస్తాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. జుబేర్‌ను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

కాగా, ఆల్ట్ న్యూస్ (Alt News) వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా జుబేర్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్లు చేశారు. ఒక పాత కేసు గురించి అతడిని ఢిల్లీ పోలీసులు పిలిచారని.. కాగా, ఏ కేసు విషయంలో అయినా ఎలాంటి అరెస్టు చేయవద్దని హైకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని ప్రతీక్ గుర్తుచేశారు. జుబేర్‌పే వేరే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు, ఆయా సెక్షన్ల పరిధిలో అరెస్టు చేస్తున్నట్లు ముందస్తు నోటీసు ఇవ్వలేదు.. అంతే కాకుండా ఎంత అభ్యర్థించినా మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదని సిన్హా ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. జుబేర్‌ను 153ఏ, 295ఏ సెక్షన్ల కింద నమోదైన కేసులో దర్యాప్తు పిలిచామని, తగిన సాక్ష్యాలు ఉన్నందున అరెస్టు చేశామని ఏఎన్ఐ వివరించింది.

ఆ ట్వీట్ ఏంటి?
హనీమూన్ హోటల్ అని రాసి ఉన్న బోర్డుపై హనీమూన్‌ను చెరిపేసి హనుమాన్ హోటల్‌గా మార్చిన ఫొటోను జుబేర్ అప్పట్లో ట్వీట్ చేశాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసి.. మా దేవుడిని హనీమూన్‌తో లింక్ చేసి అవమానపర్చాడు. ఆయన ఒక బ్రహ్మచారి దేవుడు. కానీ హనీమూన్ అంటూ పేర్కొనడంతో మా మనోభావాలు దెబ్బతిన్నాయని.. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్‌లోనే ఢిల్లీ పోలీసులను ట్యాగ్ చేస్తూ ఓ ట్విట్ట‌ర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ ప‌డింది. 2018లో చేసిన ఈ ట్వీట్ ఆధారంగానే తాము కేసు నమోదు చేశామని ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

First Published:  28 Jun 2022 4:10 AM IST
Next Story