Telugu Global
NEWS

దమ్ముంటే నిరూపించండి రాజీనామా చేస్తా.. కేంద్రానికి కేటీఆర్ సవాల్

తెలంగాణకు కేంద్రం ఎక్కువ నిధులు ఇచ్చిందా? తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి ఎక్కువ నిధులు వెళ్లాయా..? అనే విషయంపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. కేంద్రానికి తెలంగాణ ఇచ్చినదానికంటే.. తెలంగాణకు కేంద్రం ఎక్కువ ఇచ్చినట్టు నిరూపించగలిగితే తాను మంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికెళ్తానంటూ ఛాలెంజ్ చేశారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. ఢిల్లీ వేదికగా బీజేపీకి సవాల్ విసిరారు. రాష్ట్రపతి అభ్యర్థి సొంత […]

దమ్ముంటే నిరూపించండి రాజీనామా చేస్తా.. కేంద్రానికి కేటీఆర్ సవాల్
X

తెలంగాణకు కేంద్రం ఎక్కువ నిధులు ఇచ్చిందా? తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి ఎక్కువ నిధులు వెళ్లాయా..? అనే విషయంపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్.

కేంద్రానికి తెలంగాణ ఇచ్చినదానికంటే.. తెలంగాణకు కేంద్రం ఎక్కువ ఇచ్చినట్టు నిరూపించగలిగితే తాను మంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికెళ్తానంటూ ఛాలెంజ్ చేశారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. ఢిల్లీ వేదికగా బీజేపీకి సవాల్ విసిరారు.

రాష్ట్రపతి అభ్యర్థి సొంత ఊరికి కరెంట్ లేదు..
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాల ఉమ్మడి అభ్యర్థి ద్రౌపది ముర్ము సొంత ఊరికి కరెంటు సౌకర్యం కల్పించేందుకు అధికారులు హడావిడి చేస్తున్నారు. ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాతే ఆమె ఊరికి కరెంటు పోల్స్ వేస్తున్నారు. ఒడిశాలోని మయూర్‌ భంజ్‌ జిల్లా పరిధిలో ఉపర్బేద అనే పంచాయతీ పరిధిలో దుండూర్సాహి, బడాసాహి అనే రెండు కుగ్రామాలున్నాయి.

వీటి జనాభా దాదాపు 3,500. బడాసాహి గ్రామానికి కరెంటు ఉన్నా, ద్రౌపది ముర్ము పూర్వీకులు నివసించిన దుండూర్సాహిలో మాత్రం కరెంటు లేదు. ఎన్డీఏ ఎనిమిదేళ్ల పాలనలో కనీసం ఆ గ్రామానికి కరెంట్ కూడా ఇవ్వలేకపోయింద‌ని ఎద్దేవా చేశారు కేటీఆర్.

పరువు పోతుందనే ఉద్దేశంతో ఇప్పటికిప్పుడు హడావిడిగా ద్రౌపది ముర్ము గ్రామానికి కరెంటు సరఫరా చేస్తున్నారన్నారు. ఆ మాటకొస్తే మోదీ ముఖ్యమంత్రిగా పనిచేసిన గుజరాత్ రాష్ట్రంలో కూడా కరెంటు లేని గ్రామాలు ఇంకా ఉన్నాయని గుర్తుచేశారు. బీజేపీ భావదారిద్ర్యానికి ఇదే నిదర్శనమని, ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు కేటీఆర్.

తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు వస్తారు.. పోతారు కానీ, ఏమీ చేయలేకపోతున్నారని చెప్పారు కేటీఆర్. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విపక్షాలు ప్రతిపాదించిన యశ్వంత్ సిన్హా కు తాము మద్దతు తెలిపామని వెల్లడించారు. యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. హైదరాబాద్‌ రావాలని ఆయనను ఆహ్వానించినట్టు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని, వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ ప్రధాని అయ్యాక ఎనిమిదికి పైగా రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. మెజార్టీ లేకపోయినా బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుందని విమర్శించారు కేటీఆర్. గట్టిగా మాట్లాడితే ఏజెన్సీలను పురిగొల్పుతున్నారని ఎద్దేవా చేశారు.

ప్రజా స్వామ్యంలో ప్రజలు తిరగబడే రోజు వస్తుందని, అది తెలంగాణ నుంచే మొదలు కావొచ్చని హెచ్చరించారు. ద్రౌపది ముర్ము పట్ల వ్యక్తిగతంగా తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, కానీ బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థిని తిరస్కరిస్తున్నామని చెప్పారు కేటీఆర్. యశ్వంత్ సిన్హాను గెలిపించాలని పిలుపునిచ్చారు.

First Published:  27 Jun 2022 3:07 PM IST
Next Story