మా అమ్మ పదోతరగతి పాసైందోచ్..
ఒకసారి చదువు ఆపేశాక తిరిగి దానిని కొనసాగించాలంటే చాలా పట్టుదల కావాలి. అదీ చదువు ఆపేసిన 37 సంవత్సరాల అనంతరం తిరిగి చదివి పరీక్షలు రాసి పాస్ అవ్వటం అంటే.. ప్రశంసించదగిన విషయమే. అలాంటి ప్రశంసలే అందుకుంటున్నారు మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ. ఆమె కుమారుడు ప్రసాద్ జంభలే.. ఈ విషయాన్ని లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేయటంతో అందరికీ తెలిసింది. ప్రసాద్ ఐర్లాండ్ లో మాస్టర్ కార్డ్ సంస్థలో సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా […]
ఒకసారి చదువు ఆపేశాక తిరిగి దానిని కొనసాగించాలంటే చాలా పట్టుదల కావాలి. అదీ చదువు ఆపేసిన 37 సంవత్సరాల అనంతరం తిరిగి చదివి పరీక్షలు రాసి పాస్ అవ్వటం అంటే.. ప్రశంసించదగిన విషయమే. అలాంటి ప్రశంసలే అందుకుంటున్నారు మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ. ఆమె కుమారుడు ప్రసాద్ జంభలే.. ఈ విషయాన్ని లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేయటంతో అందరికీ తెలిసింది.
ప్రసాద్ ఐర్లాండ్ లో మాస్టర్ కార్డ్ సంస్థలో సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. అతను తన తల్లి మొదట చదువు ఎందుకు ఆపేశారు.. తిరిగి చదువుకుని పదో తరగతి పరీక్షల్లో ఎలా ఉత్తీర్ణత సాధించారు.. అనే విషయాలను గురించి తన పోస్ట్ లో వివరించారు.
ప్రసాద్ తల్లి.. 37 ఏళ్ల క్రితం తన 16వ ఏట ఆమె తండ్రి మరణించడంతో చదువుని ఆపేశారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడ్డారామె. గత సంవత్సరం ఏదో పనిమీద ప్రభుత్వ స్కూలుకి వెళ్లారామె. అక్కడ ఓ టీచరు ఆమె గురించి తెలుసుకుని.. ఎస్ఎస్సి పూర్తి చేయనివారు ఎవరైనా.. తిరిగి పరీక్ష రాయవచ్చని అలాంటి అవకాశమిచ్చే ఓ నూతన ప్రభుత్వ పథకం ఉన్నదని చెప్పారు.
ప్రభుత్వమే ఉచితంగా పుస్తకాలు అందించడంతో పాటు నేరుగా టీచర్లు పాఠాలను చెబుతారని, ఇంటర్ నెట్ శిక్షణని అందిస్తారని ఆ టీచరు ఆమెకు తెలిపారు.
దాంతో ప్రసాద్ తల్లి డిసెంబరు 2021లో తిరిగి స్కూలుకి వెళ్లటం మొదలుపెట్టారు. రాత్రి క్లాసులకు హాజరవుతుండేవారు. అయితే ప్రసాద్ ఐర్లాండ్ లో ఉండటంతో తల్లి తిరిగి చదువుకుంటున్నట్టుగా అతనికి తెలియదు. ఇండియాలో రాత్రి అయ్యే సమయంలో అతను ఇంటికి ఫోన్ చేస్తుండేవాడు. అతను ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మ వాకింగ్ కి వెళ్లిందని ఇంట్లోవారు చెబుతుండేవారు.
అమ్మ ప్రతిరోజూ రాత్రులు వాకింగ్ చేస్తున్నదేమోనని ప్రసాద్ భావించారు. తరువాత అతనికి విషయం తెలిసింది. తల్లి తన చదువు గురించి తన తండ్రి, సోదరుల వద్ద కూడా ఓ నెలపాటు దాచిపెట్టినట్టుగా ప్రసాద్ పేర్కొన్నారు. తల్లికి ఆల్ జీబ్రా లెక్కలు, ఇంగ్లీషులలో ఉన్న నాలెడ్జికి తనకే ఆశ్చర్యం కలిగిందని అతను చెప్పుకొచ్చాడు.
తల్లిలో నేర్చుకునే శక్తి, కొత్త విషయాల పట్ల ఆసక్తి తగ్గలేదని, ఆమె మల్టీ టాస్కింగ్ చేయగలరని, మార్చిలో పరీక్షలుంటే.. ఫిబ్రవరిలో తన సోదరుని వివాహం జరిగిందని, అయినా చదువుని అశ్రద్ధ చేయలేదని అతను తెలిపాడు. ఆమె పదో తరగతి పరీక్షలు పాస్ కావడమే కాకుండా 79.6శాతం మార్కులను సాధించారు.
తనకున్న సౌకర్యాలు అవకాశాలు తన తల్లికి ఆ రోజుల్లో ఉండి ఉంటే ఆమె ఎంతో సాధించి ఉండేదని, జీవితంలో ఎప్పటికీ నేర్చుకోవటం ఆపకూడదనే పాఠం తన తల్లితనకు నేర్పిందని, ఆమెని చూసి తాను గర్వపడుతున్నానని ప్రసాద్ జంభలే తన పోస్టులో పేర్కొన్నారు. పిల్లలను చూసి తల్లిదండ్రులు గర్వపడటం అనేది సాధారణ విషయమే.. అయితే తల్లి చదువుని చూసి పిల్లలు గర్వపడటం మాత్రం అరుదుగానే జరుగుతుంటుంది. ఈ మహారాష్ట్ర మహిళ దానిని సాధ్యం చేసి చూపించారు.