ధర్మాన ఫ్యామిలీలో లుకలుకలు..?
నిప్పులేనిదే పొగరాదు.. కానీ నిప్పు లేకుండానే తమ కుటుంబంలో లుకలుకలున్నట్టు పొగ సృష్టిస్తున్నారని అంటున్నారు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్. జగన్ తొలి కేబినెట్ లో ఆయన డిప్యూటీ సీఎం హోదాలో పనిచేశారు. రెండో దఫా.. ఆయన్ను పక్కనపెట్టి, ఆయన తమ్ముడు ధర్మాన ప్రసాదరావుకి మంత్రి పదవి ఇచ్చారు సీఎం. ఈ క్రమంలో ధర్మాన ఫ్యామిలిలో గొడవలున్నాయని, అన్నదమ్ములకు అస్సలు పడటం లేదని, వారసుల రాజకీయాల విషయంలో పొరపొచ్చాలు వచ్చాయనే వార్తలు బయటకొస్తున్నాయి. అయితే వీటిని కేవలం […]
నిప్పులేనిదే పొగరాదు.. కానీ నిప్పు లేకుండానే తమ కుటుంబంలో లుకలుకలున్నట్టు పొగ సృష్టిస్తున్నారని అంటున్నారు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్. జగన్ తొలి కేబినెట్ లో ఆయన డిప్యూటీ సీఎం హోదాలో పనిచేశారు. రెండో దఫా.. ఆయన్ను పక్కనపెట్టి, ఆయన తమ్ముడు ధర్మాన ప్రసాదరావుకి మంత్రి పదవి ఇచ్చారు సీఎం.
ఈ క్రమంలో ధర్మాన ఫ్యామిలిలో గొడవలున్నాయని, అన్నదమ్ములకు అస్సలు పడటం లేదని, వారసుల రాజకీయాల విషయంలో పొరపొచ్చాలు వచ్చాయనే వార్తలు బయటకొస్తున్నాయి. అయితే వీటిని కేవలం ఆరోపణలుగానే కొట్టిపారేశారు ధర్మాన కృష్ణదాస్.
తమ్ముడికోసం ప్రాణాలైనా ఇస్తా..?
తన తమ్ముడు ప్రసాదరావు.. గతంలో తాను గెలిచిన నరసన్నపేట నియోజకవర్గాన్ని కూడా తనకోసం ఇచ్చేశారని, ఆయన శ్రీకాకుళం వెళ్లాడని గుర్తు చేస్తున్నారు కృష్ణదాస్. తనంటే అంతటి అభిమానం ఉన్న ప్రసాదరావుకి తనతో ఎందుకు విభేదాలుంటాయని ప్రశ్నిస్తున్నారు.
కొంతమంది విషప్రచారం చేస్తున్నారని, వారంతా పనికిమాలిన ఎదవలు అంటూ మండిపడ్డారు. అలాంటి వారి మాటలను మీడియా పట్టించుకోవద్దని చెప్పారు. వైసీపీ కార్యకర్తలు కూడా ఇలాంటి దుష్ప్రచారాన్ని ఖండించాలన్నారు. అవసరమైతే తన తమ్ముడికోసం తాను ప్రాణాలైనా ఇస్తానని చెప్పారు కృష్ణదాస్.
ప్రసాదరావు కొడుకు ఎంట్రీ ఇస్తే..!
ప్రస్తుతం ధర్మాన ప్రసాదరావు వారసుడిగా ఆయన తనయుడు రామ్ మనోహర్ నాయుడు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ.. శ్రీకాకుళం జిల్లా వైసీపీలో యువనాయకుడిగా పేరు తెచ్చుకుంటున్నారు.
వచ్చే దఫా నరసన్నపేట నియోజకవర్గం నుంచి రామ్ మనోహర్ నాయుడు పోటీ చేసే అవకాశముందని, ఈ క్రమంలో కృష్ణదాస్ కి టికెట్ ఇవ్వకపోవచ్చని, ఒకవేళ ఇచ్చినా వేరే నియోజకవర్గం చూసుకోవాల్సిందేనని, అందుకే ఆ కుటుంబంలో గొడవలొచ్చాయనే ప్రచారం జరుగుతోంది. ఇదంతా వట్టి కల్పితమేనని ఖండించారు కృష్ణదాస్.
తమ్ముడు తనకోసం నియోజకవర్గాన్నే త్యాగం చేసిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తితో తానెందుకు గొడవపడాలంటున్నారాయన. జిల్లాలో 8 స్థానాల్లోనూ గెలిచేందుకు మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో కలిసి పనిచేస్తామని చెప్పారు. ప్రసాదరావు ఏం చెప్పినా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తనకు పదవులపై ఆశలు లేవని.. పదవి లేకపోతే ఊర్లో ఆవులు, గేదెలు తోలుకుంటూ వ్యవసాయం చేసుకుంటానని నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్.