మాటలనుంచి చేతల్లోకి దిగిన ఉద్ధవ్.. 9మంది మంత్రులపై వేటు
రెబల్స్ విషయంలో ఇన్నాళ్లూ మాటలతో సరిపెట్టిన శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే.. ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. 9మంది మంత్రుల శాఖలు తొలగించారు. ఆయా శాఖలను మిగతా మంత్రులకు కేటాయించారు. శివసేన తిరుగుబాటు గ్రూపుకి నాయకత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండే చూస్తున్న పట్టణాభివృద్ధి, పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖలను తొలగించి.. మరో మంత్రి సుభాష్ దేశాయ్ కు అప్పగించారు. మరో రెబల్ మంత్రి గులాబ్ రావ్ పాటిల్ వద్ద ఉన్న నీటి సరఫరా, […]
రెబల్స్ విషయంలో ఇన్నాళ్లూ మాటలతో సరిపెట్టిన శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే.. ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. 9మంది మంత్రుల శాఖలు తొలగించారు.
ఆయా శాఖలను మిగతా మంత్రులకు కేటాయించారు. శివసేన తిరుగుబాటు గ్రూపుకి నాయకత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండే చూస్తున్న పట్టణాభివృద్ధి, పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖలను తొలగించి.. మరో మంత్రి సుభాష్ దేశాయ్ కు అప్పగించారు.
మరో రెబల్ మంత్రి గులాబ్ రావ్ పాటిల్ వద్ద ఉన్న నీటి సరఫరా, పారిశుద్ధ్యం శాఖల బాధ్యతలను మంత్రి అనిల్ పరబ్ కు అప్పగించారు. దాదాజీ భూసే వద్ద ఉన్న వ్యవసాయం, మాజీ సైనికుల సంక్షేమ శాఖలు, సందీపన్ భూమారే వద్ద ఉన్న ఉపాధి హామీ, ఉద్యానవన శాఖలను.. మంత్రి శంకర్ గడఖ్ కు కేటాయించారు. తాజాగా రెబల్ గ్రూప్ లో చేరిన మంత్రి ఉదయ్ సావంత్ వద్ద ఉన్న ఉన్నత విద్య, సాంకేతిక విద్యా శాఖలను.. మంత్రి ఆదిత్య ఠాక్రేకు బదిలీ చేశారు.
రెబల్ మంత్రి శంభురాజ్ ఇప్పటి వరకూ చూస్తున్న మూడు శాఖలను విడగొట్టి.. మంత్రులు సంజయ్ బన్సోడే, సతేజ్ పాటిల్, విశ్వజిత్ కదమ్ లకు ఒక్కో శాఖను కేటాయించారు. రెబల్ మంత్రి రాజేంద్ర పాటిల్ వద్ద ఉన్న నాలుగు మంత్రిత్వ శాఖలను మంత్రులు విశ్వజీత్ కదమ్, ప్రజక్త్ తాన్ పురే, సతేజ్ పాటిల్, అదితి తత్కరేకి కేటాయించారు. అబ్దుల్ సత్తార్ వద్ద ఉన్న మూడు శాఖలను మంత్రులు ప్రజక్త్ తాన్ పురే, సతేజ్ పాటిల్, అదితి తత్కరేకి కేటాయించారు.
రెబల్ మంత్రి ఓంప్రకాష్ కుడు వద్ద ఉన్న నాలుగు పోర్ట్‌ఫోలియోలను కూడా మరో నలుగురు మంత్రులకు అప్పజెప్పారు. పరిపాలనా పరంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఆయా శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులు ఆగకుండా ఉండేందుకు అందుబాటులో లేని మంత్రుల వద్ద ఉన్న శాఖలను ఇతర మంత్రులకు కేటాయించినట్లు సీఎం ఉద్ధవ్ థాక్రే కార్యాలయం ప్రకటించింది.
సీఎం ఉద్ధవ్ థాక్రే సహా 31మంది కేబినెట్ మంత్రులు, 10మంది సహాయ మంత్రులు ఉన్న మహారాష్ట్ర మంత్రిమండలిలో ఇప్పడు 9మందిని తొలగించారు. దీంతో.. 41మంది మంత్రుల టీమ్ కాస్తా 32కి పరిమితమైంది. గతంలో శివసేన నుంచి 14మంది మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇప్పుడు వారి సంఖ్య కేవలం 5 మాత్రమే. ఎన్సీపీ నుంచి 15మంది, కాంగ్రెస్ నుంచి 12మంది మహారాష్ట్ర మంత్రిమండలిలో యధాతథంగా ఉన్నారు.