కేటీఆర్ ట్వీట్‌కు ప్రముఖుల అనూహ్య స్పందన
తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తే ప్రముఖులనుంచి కచ్చితంగా మంచి స్పందన ఉంటుంది. కాకపోతే ఆయా రంగాలకు చెందినవారు వాటిపై స్పందిస్తుంటారు. కానీ ఇప్పుడు సినీ నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు.. ఒకరేంటి.. అందరూ కేటీఆర్ ట్వీట్ పై సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. టీహబ్-2 ప్రారంభోత్సవంపై కేటీఆర్ చేసిన ట్వీట్ దీనికి కారణం. ఈనెల 28న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా టీహబ్-2 ప్రారంభోత్సవం ఉంటుందని కేటీఆర్ ట్వీట్ చేయగా.. ప్రముఖులంతా శుభాకాంక్షలు […]
తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తే ప్రముఖులనుంచి కచ్చితంగా మంచి స్పందన ఉంటుంది. కాకపోతే ఆయా రంగాలకు చెందినవారు వాటిపై స్పందిస్తుంటారు. కానీ ఇప్పుడు సినీ నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు.. ఒకరేంటి.. అందరూ కేటీఆర్ ట్వీట్ పై సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
టీహబ్-2 ప్రారంభోత్సవంపై కేటీఆర్ చేసిన ట్వీట్ దీనికి కారణం. ఈనెల 28న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా టీహబ్-2 ప్రారంభోత్సవం ఉంటుందని కేటీఆర్ ట్వీట్ చేయగా.. ప్రముఖులంతా శుభాకాంక్షలు చెబుతూ ఆ ట్వీట్ ని వైరల్ చేశారు.
‘భవిష్యత్తును అంచనా వేయడానికి ఉత్తమ మార్గం దాన్ని సృష్టించడం’ అన్న అబ్రహాం లింకన్ మాటలను కోట్ చేస్తూ.. 28న టీహబ్-2 భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. సినీ రంగం నుంచి మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, అడవి శేష్, ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్, సమంత.. కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు. సానియామీర్జా, సైనా నెహ్వాల్, పీవీ సింధు, గగన్ నారంగ్, పారుపల్లి కశ్యప్ వంటి క్రీడాకారులు కూడా రీట్వీట్ చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా టీహబ్ ప్రారంభోత్సవంపై సంతోషం వ్యక్తం చేశారు. గ్లోబల్ టెక్నాలజీలో బెంగళూరు, చెన్నైని ఓడించడానికి హైదరాబాద్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, ఇది ఆరోగ్యకరమైన పోటీ అని అన్నారు.
‘తెలంగాణ ప్రభుత్వ చొరవ, మంత్రి కేటీఆర్ ఆలోచనల ప్రతిరూపం టీహబ్, భారతీయ యువకుల ఆకాంక్షలకు రెక్కలిచ్చిన ఆలోచన ఇది. ఒకప్పుడు భారతదేశ అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా మొదలై.. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ గా టీహబ్ రూపాంతరం చెందుతోంది’ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీహబ్-2 అంతర్జాతీయ ప్రమాణాలతో రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ఎస్‌ఈజెడ్ లో ఏర్పాటైంది. ఈ ఫెసిలిటీ సెంటర్ హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ కు ఊతమిచ్చేలా రూపొందించారు.
ఈనెల 28న జరగబోతున్న ప్రారంభోత్సవంలో దేశ, విదేశాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటారు. ఇన్నోవేషన్ సదస్సు నిర్వహించబోతున్నారు. ఈ సదస్సులో ఐటీ, స్టార్టప్ రంగ నిపుణులు, స్టార్టప్ లలో పెట్టుబడులు పెట్టే వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. దీనికోసం తెలంగాణ ఐటీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.