Telugu Global
National

సంక్షోభంలోనూ ఉద్ధవ్ ధైర్యం, ప్రశాంతత… రహస్యం ఏమిటి?

శివ‌సేన వ్య‌వ‌స్థాప‌కుడు బాలా సాహెబ్ థాక్రే మ‌ర‌ణానంత‌రం ఆ పార్టీ అత్యంత ఘోర‌మైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో జ‌రిగిన తిరుగుబాటు పార్టీనే కాక మ‌హా వికాస్ అఘాడి ప్ర‌భుత్వాన్ని కూడా ఇబ్బందుల్లో ప‌డేసింది. శివసేన‌కు అస‌లైన నాయ‌కుడు ఎవ‌ర‌నే ప్ర‌శ్న‌ల‌ని ఈ తిరుగుబాటు లేవ‌నెత్తుతోంది. అయిన‌ప్ప‌టికీ పార్టీ అధ్య‌క్షుడు, ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే నిబ్బ‌రంగా ఉండ‌డం చాలా మందికి ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఆయ‌న అంత ప్ర‌శాంతంగా , ధైర్యంగా ఉండ‌డం వెన‌క ర‌హ‌స్యం […]

సంక్షోభంలోనూ ఉద్ధవ్ ధైర్యం, ప్రశాంతత… రహస్యం ఏమిటి?
X

శివ‌సేన వ్య‌వ‌స్థాప‌కుడు బాలా సాహెబ్ థాక్రే మ‌ర‌ణానంత‌రం ఆ పార్టీ అత్యంత ఘోర‌మైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో జ‌రిగిన తిరుగుబాటు పార్టీనే కాక మ‌హా వికాస్ అఘాడి ప్ర‌భుత్వాన్ని కూడా ఇబ్బందుల్లో ప‌డేసింది. శివసేన‌కు అస‌లైన నాయ‌కుడు ఎవ‌ర‌నే ప్ర‌శ్న‌ల‌ని ఈ తిరుగుబాటు లేవ‌నెత్తుతోంది. అయిన‌ప్ప‌టికీ పార్టీ అధ్య‌క్షుడు, ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే నిబ్బ‌రంగా ఉండ‌డం చాలా మందికి ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఆయ‌న అంత ప్ర‌శాంతంగా , ధైర్యంగా ఉండ‌డం వెన‌క ర‌హ‌స్యం ఏమిటి అని ఆలోచిస్తే..రెండు కార‌ణాలు క‌నిపిస్తాయి. సిద్ధాంతం ప్రాతిప‌దిక‌పై కార్య‌క‌ర్త‌ల ఆధారిత పార్టీగా నిర్మించ‌డం ఒక‌టైతే, ఆ కేడ‌ర్ పై ఉద్ధ‌వ్ కు గ‌ట్టి ప‌ట్టు ఉండ‌డం రెండో కార‌ణ‌మ‌ని చెబుతున్నారు.

శివసేన కు బాలాసాహెబ్, ఉద్ధవ్ తప్ప మరో బ‌ల‌మైన నాయ‌క‌త్వం లేదు. పార్టీ 80 శాతం సామాజిక సేవ, 20 శాతం రాజకీయాలు అనే సూత్రంపై ఆధారపడింది. ఇందుకు ఉద‌హ‌ర‌ణ ..ఏదైనా సంఘటన జరిగినప్పుడు సేన కార్యకర్తలు చాలా చురుకుగా ప‌నిచేస్తారు. ఇప్ప‌టికీ జిల్లా,గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ముంబై న‌గ‌రంలో ఉన్న కేడ‌ర్ లో ఉద్ద‌వ్ ప్ర‌భావం అధికంగానే ఉంటుంది. ఆయ‌న ముఖ్య‌మంత్రి అధికారిక నివాసం వ‌ర్ష ను వ‌దిలి మాతోశ్రీ నివాసానికి చేరుకున్న సంద‌ర్భంగా ఉద్ద‌వ్ ను అనుస‌రించిన కార్య‌క‌ర్త‌లు, హంగామా ఆవేశం, ఆందోళ‌న చూసిందే.

ఉద్ధవ్ తన తండ్రిలాంటి వాడు కాదు. బాలాసాహెబ్ రాజకీయాలు భావోద్వేగాలపై ఆధారపడి ఉండేవి. ఉద్ధవ్ చురుకైనవాడు. పార్టీ పై నియంత్రణ సాధించకముందే పోరాటాలను విజ‌య‌వంతంగా ఎదుర్కొన్నాడు. 2003లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితుడైన తర్వాత పార్టీ క్యాడర్‌ను నిర్మించి బలోపేతం చేయ‌డంలో ఎంతో కృషి చేశాడు. అందుకే ఉద్ధవ్ పై కార్య‌క‌ర్త‌ల‌కు ఎంతో అభిమానం. ఆయ‌న ఎమ్మెల్యేలు, ఎంపీలపై పెద్దగా ఆధారపడకుండా కేడర్‌పైనే ఆధారపడ‌తారు. ఇప్ప‌టికీ ఆయ‌న ధైర్యం అదే.

ప్రతి జిల్లాలో శివసేన కేడ‌ర్ సంఘ‌టిత‌మై ప‌టిష్టంగా ఉంది. ముఖ్యంగా పార్టీకి ముంబై కంచుకోటగా నిలుస్తుంది. ఇక్కడ ఆటో-రిక్షా డ్రైవర్లు, ప్రజలు కూడా సేన శాఖా కార్యాల‌యాల‌నే త‌మ అడ్ర‌స్‌లుగా చేసుకున్నారు. ఉద్ధవ్ 2019లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజ‌కీయ ముఖ చిత్రాన్ని మార్చివేశాడు. గ‌తంలో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)తో చేతులు కలిపి ప్ర‌భుత్వాన్నిఏర్పాటు చేయ‌డంతో అప్ప‌టివ‌ర‌కు మిత్ర‌ప‌క్ష‌పార్టీగా ఉన్న బిజెపి రాష్ట్రంలో అధికారానికి దూరమైంది. బాలా సాహెబ్ ఠాక్రే వారసుడిగా ఉద్దవ్ సేనలో గత తిరుగుబాట్ల నుండి పాఠాలు నేర్చుకున్నాడు. అందుకే ఏ నాయకుడినీ తన నియోజకవర్గం దాటి ఎదగనివ్వలేదు. జిల్లా నేతల ద్వారా తన ఎమ్మెల్యేలపై కంట్రోల్ ఉంచుకున్నాడు.

అప్ప‌ట్నుంచే బిజెపిని అడ్డుకోవాల‌నుకున్నాడు..

ఉద్ధవ్ 2017 ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బిజెపి ఒక‌ శక్తిగా ఎదుగుతున్న‌ద‌ని,త‌న పార్టీకి భ‌విష్య‌త్తులో సవాల్ గా మార‌వ‌చ్చ‌ని గ్ర‌హించాడు. స‌రైన స‌మ‌యం కోసం వేచిచూశాడు. అందుకే 2019 ఎన్నికల తర్వాత బీజేపీతో తెగతెంపులు చేసుకోవడానికి ఇదే త‌గిన సమయం అని భావించాడు. రోజూ బిజెపి నుంచి ఎదుర‌వుతున్న అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటూనే ఎంవిఎ ప్ర‌భుత్వాన్ని రెండున్న‌రేళ్ళ‌గా న‌డిపిస్తున్నాడు.

స‌మ‌ర్ధ ముఖ్య‌మంత్రిగా..

కోవిడ్ మహమ్మారి సమయంలో, ఉద్ధవ్ ఆ సంక్షోభాన్ని చాకచక్యంగా ఎదుర్కొన్న ముఖ్యమంత్రిగా ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లనందుకునున్నారు. ప్రతిపక్ష బిజెపి ఉద్ద‌వ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రతి క్ష‌ణం ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. ఏ అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌కుండా ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) వంటి కేంద్ర ఏజెన్సీలు మనీలాండరింగ్, ఆదాయానికి మించి ఆస్తులు, అవినీతి ఆరోప‌ణ‌ల‌తో కేసులంటూ ప‌లు సార్లు ఎంవిఎ నాయ‌కుల ఇళ్ళు, కార్యాల‌యాల‌పై దాడులు చేయించ‌డ‌మేగాక వారిని ప్ర‌శ్న‌ల‌తో ఇబ్బంది పెట్టింది.

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల దాడులు, ఒత్తిళ్ళు భ‌రించ‌లేక‌పోవడమే ప‌లువురు ఎమ్మెల్యేల్లో అభ‌ద్ర‌తా భావాన్నిపెంచింది. పైగా కాంగ్రెస్,ఎన్సీపీ మంత్రుల‌తో పొస‌గ‌డంలేద‌నే సాకుతో తిరుగుబాటుకు కార‌ణ‌మైంది. ఈ ఆలోచ‌నే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లోనూ, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ క్రాస్ ఓటింగ్ కు దారి తీసింది. త‌ర్వాత తిరుగుబాటు జ‌రగ‌డం త‌ద‌నంత‌ర ప‌రిణామాలు తెలిసిన‌వే.

దీని వెన‌క బిజెపి హస్తం ఉందనే విష‌యాన్ని ఉద్ధ‌వ్ ప‌సిగ‌ట్టారు. అందుకే కాంగ్రెస్‌, ఎన్సీపీతో తెగ‌దెంపులు చేసుకోవాల‌ని కోర‌డం వెన‌క‌ బిజెపి ఉద్దేశం తేట‌తెల్లం. అధికారంలోకి రావాల‌నే ఆశ‌తోనే తిరుగుబాటు నాయ‌కుల‌ను ప్రోత్స‌హించి ఆశ్ర‌యం క‌ల్పించింది. ఉద్ద‌వ్ కూడా బిజెపి తెర‌వెన‌క ప్ర‌య‌త్నాల‌ను దీటుగా ఎదుర్కోవాల‌నుకున్నాడు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బిజెపి అధికారంలోకి రాకూడ‌ద‌నే ఉద్దేశంతోనే తాను రాజీనామా చేసినా శివ సైనికుడే సీఎం కావాలి త‌ప్ప మ‌రొక‌రిని అనుమ‌తించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో తిరుగుబాటు నాయ‌కులు కంగుతిని త‌మ‌కు ఒక జాతీయ‌పార్టీమ‌ద్ద‌తు ఉంద‌ని ప్ర‌క‌టించారు. ఆ పార్టీ ఏదో ప్ర‌తీ ఒక్క‌రికీ తెలిసిందే.

షిండే శిబిరంలో కొంతమంది ఎమ్మెల్యేలు ముంబయిలో దిగగానే మనసు మార్చుకుంటారని మరాఠీ మీడియా చెబుతోంది. ప్రభుత్వం బలపరీక్షకు వెళ్లినప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంటుందని కొందరు రాజకీయ వ్యాఖ్యాతలు కూడా భావిస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ, రెబల్స్ రాజకీయం బ‌ల‌హీన‌ప‌డడం ఖాయ‌మ‌ని, మహారాష్ట్రలో కొత్త సమీకరణాలు కనిపిస్తాయని వారు భావిస్తున్నారు.

First Published:  26 Jun 2022 6:03 AM IST
Next Story