Telugu Global
NEWS

టీ హబ్ సూపర్ సక్సెస్.. 28న టీ హబ్-2 ప్రారంభం.. విశేషాలు ఇవే

దేశంలోనే ప్రతిష్టాత్మకంగా స్టార్టప్‌లకు వేదికగా టీ-హబ్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. 2015లో టీ హబ్‌ను గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేశారు. అప్పటి గవర్నర్ నర్సింహన్, మంత్రి కేటీఆర్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా 2015 నవంబర్ 5న టీ హబ్‌ను ప్రారంభించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ), ట్రిపుల్ ఐటీ, నల్సార్ యూనివర్సిటీలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్‌లో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఈ ఫెసిలిటీకి అత్యంత ఆదరణ లభించడంతో […]

టీ హబ్ సూపర్ సక్సెస్.. 28న టీ హబ్-2 ప్రారంభం.. విశేషాలు ఇవే
X

దేశంలోనే ప్రతిష్టాత్మకంగా స్టార్టప్‌లకు వేదికగా టీ-హబ్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. 2015లో టీ హబ్‌ను గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేశారు. అప్పటి గవర్నర్ నర్సింహన్, మంత్రి కేటీఆర్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా 2015 నవంబర్ 5న టీ హబ్‌ను ప్రారంభించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ), ట్రిపుల్ ఐటీ, నల్సార్ యూనివర్సిటీలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్‌లో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి.

ఈ ఫెసిలిటీకి అత్యంత ఆదరణ లభించడంతో ప్రాజెక్టును మరింతగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాయదుర్గం ప్రాంతంలో టీ హబ్-2 ఫెసిలిటీని అత్యంత సుందరంగా, ఆధునిక‌ సౌకర్యాలతో నిర్మించారు. ఈ ఫెసిలిటీనీ సీఎం కేసీఆర్ ఈ నెల 28న ప్రారంభిస్తారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో వెల్లడించారు.

రతన్ టాటా ఏమన్నారంటే..

టీ హబ్ ప్రారంభోత్సవం రోజు పాల్గొన్న పారిశ్రామికవేత్త రతన్ టాటా మాట్లాడుతూ.. ఈ టీ హబ్‌ను చూస్తుంటే మన దేశపు కొత్త మొఖాన్ని చూస్తున్నాను అన్నారు. దేశంలో కుటీర పరిశ్రమలు, కిరాణా షాపుల ఓనర్లు, చిన్న వ్యాపారలు చేసుకునే వారినే చూశాను. కానీ నిజమైన వ్యాపారవేత్తలు రావడం నేను గమనించలేదు. ఒక వ్యాపారం ప్రారంభించాలంటే వందలాది ఎకరాల స్థలం, కోట్లాది రూపాయలు అవసరం అనే రోజులు పోయాయి. కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత యువకులు కూడా వ్యాపారవేత్తలు, వ్యవస్థాపకులుగా మారిపోయే అవకాశం వచ్చింది. 80వ దశకంలో అమెరికాలో ఇలాంటి వేదికలు ఉండేవి. ఇప్పుడు ఇండియాలో కూడా యువ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి టీ హబ్ రావడం చాలా సంతోషం. ఇప్పుడు మన కాన్సెప్ట్ విని, అవసరమైన పెట్టుబడి పెట్ట‌డానికి ఒక వేదిక ఉండటం ఎంతో అవసరం. దీన్ని తెలంగాణ ప్రభుత్వం నిజం చేసిందని అన్నారు.

కేటీఆర్ అన్నదే నిజం అయ్యింది..

మన దేశంలో ప్రతీ ఏడాది ఎంతో మంది గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. దాదాపు ఆరు కోట్ల మంది యువత సరైన అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్లందరూ బ్యాక్ ఆఫీసుల్లో పని చేసేందుకు కాదు. యంగ్ ఇండియన్స్‌కు రెక్కలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వాళ్ల ఆలోచనలు ఒక వ్యాపారంలా మారాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈ టీ హబ్‌ను ఏర్పాటు చేశామని అప్పుడు మంత్రి కేటీఆర్ అన్నారు. వాళ్లు కూడా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర అనేక పాపులర్ యాప్స్ తయారు చేయాలని కోరుకుంటున్నారు. ఒక కాన్సెప్ట్ ఉంటే.. టీ హబ్‌కు వచ్చి.. ఆ కలను నెరవేర్చుకొని బయటకు వెళ్లాల‌ని కోరుకుంటున్నాను అని కేటీఆర్ అన్నారు. అలాంటి యువతకు చేయూతగా ఉండటానికే తెలంగాణ ప్రభుత్వం ఈ వేదిక ఏర్పాటు చేసిందని చెప్పారు. ఆయన ఆ రోజు చెప్పినట్లుగానే టీ హబ్ నుంచి ఎన్నో స్టార్టప్ కంపెనీలు ప్రారంభమయ్యాయి.

టీ హబ్ విజయాలు..

టీ హబ్ ద్వారా 2000పైగా స్టార్టప్‌లు పురుడుపోసుకున్నాయి. వీటి కోసం దాదాపు 1 బిలియన్ యూఎస్ డాలర్ల ఫండింగ్ జరిగినట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ అంకుర సంస్థల కోసం 600 పైగా కార్పొరేట్ కంపెనీలు టీ హబ్‌ను సంప్రదించాయి. 42కు పైగా దేశాలకు చెందిన స్టార్టప్‌లకు టీ హబ్ వేదికగా నిలిచింది. 100కు పైగా ఎంఎన్‌సీలకు చెందిన సీఈవోలు, ఉన్నతాధికారులు టీ హబ్‌ను సందర్శించారు. ఇక గత ఏడేళ్లలో టీ హబ్‌కు 1.13 లక్ష మంది సందర్శకులు రాగా, మెయిల్ ద్వారా 62 వేల మంది, వర్చువల్ విధానం ద్వారా 5,500 మంది టీ హబ్ సాయం పొందారు.

టీ హబ్ – 2 విశేషాలు ఇవే..

టీ హబ్ ప్రారంభోత్సవం రోజే దీని విస్తరణ వివరాలను కేటీఆర్ చెప్పారు. రెండు మూడేళ్లలోనే టీ హబ్ 2 ప్రారంభమవుతుందని అన్నారు. అయితే కోవిడ్ కారణంగా ప్రాజెక్టు ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు నిర్మాణం పూర్తి చేసుకున్న టీ హబ్ 2 ఈ నెల 28న కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. టీహబ్ రెండో దశను రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాతో నిర్మించింది. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో 3.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తి చేశారు. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ సెంటర్‌గా తీర్చిదిద్దారు.

టీ హబ్-2 లో ఓకేసారి 2వేల స్టార్టప్ కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహించే వీలుంది. అందుకు తగిన మౌలిక సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వం కల్పించింది.

కాగా, ఇప్పటికే 6,600పైగా స్టార్టప్‌లు రిజిస్టర్ చేసుకున్నాయి. 10 ప్రముఖ విద్యాసంస్థలు, 80కి పైగా భారత కార్పొరేటర్లు, 25కు పైగా రీసెర్చ్ ల్యాబ్‌లు, 10కిపైగా అటల్ ఇంకుబేషన్ సెంటర్లు, 240కిపైగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్, 120కిపైగా జీసీసీ ఎకో సిస్టమ్స్ టీ హబ్ 2కు వేదిక కానున్నాయి.

First Published:  26 Jun 2022 8:06 AM IST
Next Story