Telugu Global
NEWS

రోహిత్ శర్మకు కరోనా.. కోహ్లీని కెప్టెన్ చేయాలని అభిమానుల డిమాండ్

ఒక టెస్టు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడటానికి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియాలో కరోనా మరోసారి కలకలం సృష్టించింది. గత ఏడాది ఐదు టెస్టులు ఆడటానికి వెళ్లిన సమయంలో టీమ్ ఇండియా ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో చివరి టెస్టును వాయిదా వేశారు. ఆ సిరీస్‌లో భాగమైన చివరి టెస్టునే తాజాగా జులై 1 నుంచి ఆడాల్సి ఉన్నది. మ్యాచ్‌కు మరో నాలుగు రోజులే సమయం ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ కోవిడ్ బారిన […]

రోహిత్ శర్మకు కరోనా.. కోహ్లీని కెప్టెన్ చేయాలని అభిమానుల డిమాండ్
X

ఒక టెస్టు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడటానికి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియాలో కరోనా మరోసారి కలకలం సృష్టించింది. గత ఏడాది ఐదు టెస్టులు ఆడటానికి వెళ్లిన సమయంలో టీమ్ ఇండియా ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో చివరి టెస్టును వాయిదా వేశారు. ఆ సిరీస్‌లో భాగమైన చివరి టెస్టునే తాజాగా జులై 1 నుంచి ఆడాల్సి ఉన్నది. మ్యాచ్‌కు మరో నాలుగు రోజులే సమయం ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ కోవిడ్ బారిన పడటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం అతడి ఒక్కడికే కరోనా సోకినా.. మరింత మంది ఆటగాళ్లకు కరోనా సోకితే ఎలా అనే అనుమానాలు నెలకొన్నాయి.

టెస్టు జట్టుకు జస్ప్రిత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఏకైక టెస్టుకు అతడిని కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉన్నది. అయితే గత సిరీస్‌లో కెప్టెన్‌గా ఉన్న కోహ్లీకే ఈ ఏకైక టెస్టుకు కెప్టెన్ చేయాలని, అందుకు కోహ్లీ పూర్తిగా అర్హుడని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఏకంగా బీసీసీఐకి ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. బుమ్రా, రిషబ్ పంత్ కంటే కోహ్లీకి కెప్టెన్సీ ఇవ్వడమే న్యాయమని అంటున్నారు. ఇది కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించిన సిరీస్‌లోని మిగిలిన మ్యాచే అని.. కాబట్టి అతడికే బాధ్యతలు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రోహిత్ శర్మ అప్పటిలోగా కోలుకోకుండా ఎవరికి కెప్టెన్సీ ఇస్తామనే విషయంపై బీసీసీఐ ఇంకా ప్రకటన చేయలేదు.

కాగా, రోహిత్ శర్మ కరోనాకు సోకిన విషయంలో అతడి నిర్లక్ష్యమే కారణమనే కథనాలు వెలువడుతున్నాయి. వార్మప్ మ్యాచ్‌కు ముందు బయటకు వెళ్లడం వల్లే సోకినట్లు తెలుస్తున్నది. బయోబబుల్‌లో ఉండాల్సిన ఆటగాళ్లు మాస్కులు లేకుండా ఫ్యాన్స్‌తో ఫొటోలు దిగడం, షాపింగ్‌లకు వెళ్లడం బీసీసీఐ దృష్టికి వచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో కూడా ప్రత్యక్షమయ్యాయి. అసలు బ్రిటన్‌లో ప్రతీ రోజు కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో.. ఆటగాళ్ల నిర్లక్ష్య ప్రవర్తన కారణంగానే కోవిడ్ సోకినట్లు నిపుణులు చెప్తున్నారు.

టీమ్ ఇండియా ఆటగాళ్లందరూ రెండు డోసులతో పాటు బూస్టర్ డోసు టీకా కూడా వేసుకున్నారు. అయితే వీటి వల్ల కోవిడ్ సోకడం మాత్రం ఆగదని, కేవలం ప్రాణనష్టం మాత్రమే ఉండదని వైద్యులు చెప్తున్నారు. ఒకవేళ ఆటగాళ్లందరూ కోవిడ్ బారిన పడితే ఏకైక టెస్టు కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నది. అప్పుడు సిరీస్ ఫలితంపై ఐసీసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.

First Published:  26 Jun 2022 8:02 AM IST
Next Story