Telugu Global
NEWS

బీజేపీ దూకుడుకు కళ్లెం వేస్తూ.. కాంగ్రెస్‌లోకి భారీ వలసలు

బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఇటీవల ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత కూడా పూర్తి చేసుకున్నారు. ఆ సమయంలో చాలా మంది టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరతారని ప్రకటించారు. ముగింపు సభకు ఏకంగా కేంద్ర మంత్రి అమిత్ షాను తీసుకొని వచ్చారు. అయినా సరే గుర్తింపు ఉన్న ఏ బడా రాజకీయ నాయకుడు కూడా బీజేపీలో చేరలేదు. కానీ, కాంగ్రెస్ పార్టీలోకి మాత్రం కాస్తో కూస్తో గుర్తింపు ఉన్న నాయకులు వచ్చి చేరుతున్నారు. […]

బీజేపీ దూకుడుకు కళ్లెం వేస్తూ.. కాంగ్రెస్‌లోకి భారీ వలసలు
X

బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఇటీవల ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత కూడా పూర్తి చేసుకున్నారు. ఆ సమయంలో చాలా మంది టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరతారని ప్రకటించారు. ముగింపు సభకు ఏకంగా కేంద్ర మంత్రి అమిత్ షాను తీసుకొని వచ్చారు.

అయినా సరే గుర్తింపు ఉన్న ఏ బడా రాజకీయ నాయకుడు కూడా బీజేపీలో చేరలేదు. కానీ, కాంగ్రెస్ పార్టీలోకి మాత్రం కాస్తో కూస్తో గుర్తింపు ఉన్న నాయకులు వచ్చి చేరుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చేది తామేనని చెప్పుకుంటున్న రెండు పార్టీల్లో కాంగ్రెస్‌లోకే భారీగా నేతలు వలస బాట పట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో ఊపు వచ్చిన మాట వాస్తవమే. తన దూకుడైన వ్యవహార శైలికి తోడు.. అధికార పార్టీ తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో ముందుంటున్నారు. ఈ క్రమంలోనే గతంలో కాంగ్రెస్‌, టీడీపీల్లో ఉండి.. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్న నేతలకు గాలం వేస్తున్నారు. అధిష్టానం తనకు ఇచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకుంటూ వారికి భారీ హామీలు ఇచ్చి కాంగ్రెస్‌లోకి తీసుకొని వస్తున్నట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ పార్టీ తరపున చెన్నూరు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లల ఓదేలును కాంగ్రెస్ పార్టీలోకి రప్పించడంలో రేవంత్ సఫలమయ్యారు. మూడు సార్లు గెలిచినా.. గత ఎన్నికల్లో ఆయనకు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. గత కొన్ని నెలలుగా ఓదేలు బీజేపీలో చేరతారనే వార్తలు వచ్చాయి. అయితే బీజేపీ తరపున చెన్నూరు సీటును జి. వినోద్ లేదా జి. వివేక్‌కు కేటాయిస్తారని తెలుసుకున్న ఓదేలు ఎటూ తేల్చుకోలేకపోయారు. దాన్ని పసిగట్టిన రేవంత్ వెంటనే ఆయనను కాంగ్రెస్‌లోకి తీసుకొని వచ్చారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి కూడా బీజేపీకి షాకిచ్చి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నది. అమెరికా పర్యటనలోనే ఆమెను కాంగ్రెస్‌లోకి తీసుకొని వచ్చారు. ఇక జీహెచ్ఎంసీ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీలో చేరాలనుకున్న ఆమెను మోటివేట్ చేసి కాంగ్రెస్‌లోకి తీసుకొని వచ్చారు. ఆమెకు ఈ సారి ఖైరతాబాద్ టికెట్ వస్తుందనే హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తున్నది.

టీడీపీలో తన పాత మిత్రుడు, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లును కూడా టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి రేవంత్ తీసుకొని వచ్చారు. తాటికి ఆ నియోజకవర్గంలో మంచి పట్టున్నది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కూడా కలిస్తే ఆయన మరోసారి అక్కడ విజయం సాధిస్తారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అందుకే రేవంత్ ఆయనను పట్టుబట్టి కాంగ్రెస్‌లోకి తీసుకొని వచ్చారని తెలుస్తోంది. ఆయనతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం జెడ్పీటీసీ కాంతారావు కూడా పార్టీలో చేరారు. ఆయనకు పినపాక టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నది.

టీఆర్ఎస్‌లో ఉన్న అసంతృప్త నేతలను కాంగ్రెస్‌లోకి తీసుకొని రావడానికి రేవంత్ తన రాజకీయ పరిచయాలను వాడుకుంటున్నారు. అదే సమయంలో బీజేపీ కొత్త వారిని పార్టీలోకి తీసుకొని రావడంలో విఫలమవుతున్నది. మరో వారం రోజుల్లో హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి. ఆలోగా బీజేపీకి మరింత గట్టి షాక్ ఇచ్చేలా మరిన్ని చేరికలను ప్రోత్సహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్‌లో పూర్తి స్వేచ్ఛను ఇచ్చినందువల్లే ఆయన భారీగా వలసలను ప్రోత్సహిస్తున్నారని పార్టీలోని వర్గాలే అంటున్నాయి. ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు కనపడటం లేదు. అలాంటి సెగ్మెంట్లనే టార్గెట్ చేసుకొని రేవంత్ వలసలను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తున్నది.

First Published:  25 Jun 2022 3:01 AM GMT
Next Story