తెలంగాణలో బిజెపి కి ‘అగ్నిపథమే..!?’
భారతీయ జనతా పార్టీ (బిజెపి) ‘మిషన్-7’ లో భాగంగా రాష్ట్రల్లో ఆధిపత్యం చాటాలని లక్ష్యంగా ఎన్నుకున్నా ఒక్కదానిలో మినహా ఎక్కడా నేటికీ పాగా వేయలేకపోయింది. దేశంలోనే అతి చిన్న దక్షిణాది రాష్ట్రంగా ఉన్న తెలంగాణతో పాటు ఈ “మిషన్-7″లో అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి ఏడు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని 2014లోనే పార్టీ ప్లాన్ చేసింది. అయితే అస్సాం మినహా ఈ అన్ని రాష్ట్రాల్లో దాని పాచిక పారలేదు. హైదరాబాద్‌లో వచ్చేనెల […]
భారతీయ జనతా పార్టీ (బిజెపి) ‘మిషన్-7’ లో భాగంగా రాష్ట్రల్లో ఆధిపత్యం చాటాలని లక్ష్యంగా ఎన్నుకున్నా ఒక్కదానిలో మినహా ఎక్కడా నేటికీ పాగా వేయలేకపోయింది. దేశంలోనే అతి చిన్న దక్షిణాది రాష్ట్రంగా ఉన్న తెలంగాణతో పాటు ఈ “మిషన్-7″లో అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి ఏడు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని 2014లోనే పార్టీ ప్లాన్ చేసింది. అయితే అస్సాం మినహా ఈ అన్ని రాష్ట్రాల్లో దాని పాచిక పారలేదు.
హైదరాబాద్‌లో వచ్చేనెల 2,3 తేదీల్లో జరగనున్న రెండు రోజుల సమావేశాల నేపథ్యంలో తెలంగాణలో బిజెపి బలం పుంజుకోగలదా అనే ప్రశలు తలెత్తుతున్నాయి. ఈ సమావేశాలను బిజెపి శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ అగ్రనేతలు హాజరుకానున్నారు. వరుసగా మూడోసారి జరుగుతున్న పార్టీ ప్రస్తుత జాతీయ కార్యవర్గ సమావేశం తెలంగాణలో ఎలా పాగా వేయాలనే వ్యూహంపైనే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. వచ్చేయేడాది తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఎల్‌కే అద్వానీ రథయాత్ర నిర్వహించిన నేపథ్యంలో 1991లో జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత, 1994 మార్చి 21, 22 తేదీల్లో మొదటిసారిగా హైదరాబాద్ నగరం బీజేపీ జాతీయ కార్యవర్గానికి ఆతిథ్యం ఇచ్చింది. తరువాత, పార్టీ రెండవ సమావేశం 2004 జనవరి 11న జరిగింది, వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డియే ప్రభుత్వం 13వ లోక్‌సభను రద్దు చేసి పదవీకాలానికి ముందే ఎన్నికలకు వెళ్ళడం, ఆ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత పార్టీ దశాబ్దం పాటు రాజకీయంగా అజ్ణాతంలోకి వెళ్ళిపోయింది. ఆతర్వాత 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లిన తర్వాతే బీజేపీ తిరిగి పుంజుకుంది. ఇక అప్పట్నుంచి ఆక్టోపస్ లా రాష్ట్రాలన్నింటినీ ఆక్రమించుకోవాలనే ఏకైక ఎజెండాతో ముందుకు సాగుతోంది.
వాపును చూసి బలంగా మురిసిపోతున్న బిజెపి!
తెలంగాణలో 2018 శాసనసభ ఎన్నికల్లో బిజెపికి మొత్తం ఓట్లలో ఏడు శాతంతో ఒక్క సీటు మాత్రమే వచ్చింది. అయితే ఈ ఓట్ల శాతం పెరుగుదలను చూసి ఉత్సాహపడింది. అంతేగాక 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి 20 శాతం ఓట్లతో నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడం పార్టీని సైతం ఆశ్చర్యపరిచింది. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా నిజామాబాద్‌లో బిజెపి అభ్యర్థి ధర్మపురి చేతిలో ఓటమి చెందడం. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజూరాబాద్ స్థానాలను టీఆర్‌ఎస్ నుంచి కైవసం చేసుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో పాగా వేసింది. దీంతో మోడీ మంత్రదండం వల్లే ఈ పలితాలు వస్తున్నాయని ప్రచారం మొదలైంది.
బిజెపి మత రాజకీయాలు..
తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్)ని రాజకీయంగా ఎదుర్కోవడం కష్టమని తెలిసి రాష్ట్రంలో మత రాజకీయాలకు తెరలేపింది. ఇదంతా మోడీ ఆలోచనగానే భావించాల్సి ఉంటుంది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఆలిండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్(ఎఐఎంఐఎం)తో టీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటోందనే భావనను బలంగా తీసుకెళ్ళేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని బిజెపి ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తోంది.
టీఆర్‌ఎస్, ఎంఐఎం, హైదరాబాద్ నిజాం పాలనకు అనుకూలం అంటూ హిందువుల ఓట్లను చేజిక్కించుకోవడానికి బీజేపీ ప్రచారం చేస్తోంది. టీఆర్‌ఎస్‌కు ఒవైసీ సన్నిహితంగా ఉండడం వల్ల హిందూ ఓట్ల ఏకీకరణకు అవకాశంగా ఉంటుందని బిజెపి ఆశిస్తోంది. ఈ భావనతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను “నిజాం తాజా అవతారం” అంటూ కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షా ఇటీవల మహబూబ్‌నగర్‌లో తన బహిరంగ సభ సందర్భంగా అభివర్ణించారు.
తమ వాదనను బలంగా వినిపిస్తూ తమకు పల్లె ప్రాంతాల్లో కూడా బలం ఉందని నిరూపించుకునేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘సంగ్రామ యాత్ర’ పేరుతో పాదయాత్ర చేశారు. జనసమీకరణ ఫలితంగా ఈ యాత్రలో కనిపించిన జనసందోహాన్ని చూసి పల్లె ప్రాంతాల్లో బిజెపి పుంజుంకుంటోందనే ఆలోచన కల్పించేందుకు ప్రయత్నించారు. అయితే వాస్తవంగా క్షేత్ర స్థాయిలో బిజెపి భావిస్తున్నట్టు అంత ‘సీన్’ లేదని పరిస్థితులను దగ్గరగా పరిశీలిస్తున్న విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజల్లో కూడా ఆ పార్టీ పట్ల పూర్తి అవగాహన లేదని కేవలం మోడీ అనే పేరు తప్ప ఆయన గురించి కూడా పెద్దగా తెలియదని ఆ ప్రాంతాల్లోని ప్రజలతో మాట్లాడితే తెలుస్తుందంటున్నారు.
వాస్తవాలు ఇలా ..
ఏ రాజకీయ పార్టీ పాలనను అయినా ప్రజలు పరిస్థితులను బేరీజు వేసుకోవడం సహజం. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ ఎస్ దాదాపు ఎనిమిదేళ్ళకు పైగా పాలన సాగిస్తోంది. ఈ క్రమంలో ‘డెలివరీ సిస్టమ్’ లో అనివార్య కారణాల వల్ల లోటుపాట్లు జరగడం సహజం. అలాగే నాయకుల్లో కూడా అసంతృప్తులు ఉండడం కూడా జరుగుతూనే ఉంటుంది. సరిగ్గా ఈ పాయింట్ ను ఆధారం చేసుకుని టిఆర్ఎస్ పై కాషాయ విషం జిమ్ముతోంది బిజెపి. ప్రజా సంక్షేమం కోసం కెసిఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలు ప్రజలకు అందడం లేదని, బూటకపు కబుర్లంటూ ప్రచారం చేస్తోంది. అంతేగాక అవినీతి ఆరోపణలతో ఊదరగొడుతూ ప్రజల దృష్టిని మళ్ళించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే వాస్తవంగా పరిస్థితులు వారి ఆలోచనకు భిన్నంగా ఉన్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి.
బిజెపి చెప్పుకుంటున్నట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి పట్టు లేదని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా టిఆర్ఎస్ పార్టీకి ఎటువంటి ఢోకా లేదని ముచ్చటగా మూడోసారి అధికారంలో్కి వచ్చి హాట్రిక్ సాధించడం ఖాయమని స్పష్టమవుతోంది.
యేడాది క్రితం నుంచే క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసిఆర్ వివిధ రూపాల్లో సమాచారం సేకరించుకుంటూ ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితులను విశ్లేషించుకుంటూనే ఉన్నారు. రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్ సహకారంతో కూడా సర్వేలు జరిపించారు. ఆయన బృందం నిర్వహించిన సర్వేల్లో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయని తెలుస్తోంది. టిఆర్ఎస్ దరిదాపుల్లోకి కూడా బిజెపి రాలేదనే అంశాన్ని ఆయన నివేదించారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని ఇటీవల కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు వల్ల ఆ పార్టీ కూడా రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుందని ఆ సర్వే సారాంశం.
అంతేగాక ఇటీవల కేంద్ర ప్రకటించిన అగ్నిపథం తెలంగాణలో అగ్గి రాజేసింది. గ్రామీణ ప్రాంతాల యువతలో ఈ పథకం నిరాశ కలిగించింది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం నుంచే సైన్యంలోకి వెళ్ళే యువత ఎక్కువగా ఉంటుంది. దీంతో వారి ఆశలు నీరుగారడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ సారి ఎన్నికల్లో ఇక బిజెపి ఆశలు ‘అగ్నిపథమే’నని తేటతెల్లం అవుతోంది..